
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ కురువృద్ధుడు, విపక్షాల ముఖ్యనేత శరద్ పవార్ తన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మంగళవారం తన ఆత్మకథ పుస్తకం రెండో ఎడిషన్ రిలీజ్ కార్యక్రమంలో.. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని ప్రకటించారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనన్న పవార్.. ఎన్సీపీ తదుపరి అధ్యక్షుడి ఎన్నిక కోసం పార్టీ సీనియర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
పవార్ తన రాజీనామా ప్రకటించగానే.. ఎన్సీపీ కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఆయన రాజీనామా చేయొద్దంటూ వేదిక మీదకు ఎక్కి నినాదాలు చేశారు పార్టీ కార్యకర్తలు. రాజీనామా వెనక్కు తీసుకోవాలంటూ కోరారు. అయితే ఆయన మాత్రం రాజీనామాకే మొగ్గు చూపిస్తున్నారు.
👉 ‘‘రాజ్యసభ సభ్యుడిగా ఇంకా మూడేళ్ల పదవీకాలం ఉంది. అంతదాకా కొనసాగుతా. కానీ, భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయబోను అని ఆటోబయోగ్రఫీ ‘లోక్ మజే సంగతి’ సెకండ్ ఎడిషన్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ‘‘సరిగ్గా 1960 మే 1వ తేదీన మే డే నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలైందని గుర్తు చేసుకున్న ఆయన.. మనిషికి అత్యాశ ఉండకూడదని, ఇది ఎక్కడో ఒక దగ్గర ఆగాల్సిందేనని 83 ఏళ్ల పవార్ వ్యాఖ్యానించారు.
👉 అయితే తర్వాతి అధ్యక్ష పదవి కోసం పార్టీ నిబంధనలకు అనుగుణంగానే ఉంటుందన్న ఆయన.. ఎన్సీపీ సీనియర్ నేతలతో కూడిన కమిటీని తాను రికమండ్ చేస్తానని, వాళ్లే తర్వాతి పార్టీ చీఫ్ ఎంపిక బాధ్యత చేపడతారని వెల్లడించారు. ఆ కమిటీ ప్రఫుల్ పటేల్, సునీల్ తాట్కరే, పీసీ చాకో, అజిత్ పవార్, సుప్రియా సులే, జయంత్‌పాటిల్, అనిల్ దేశ్‌ముఖ్ తదితరులు ఉంటారని ఆయన తెలిపారు.
👉 గత కొంతకాలంగా.. మహారాష్ట్రలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ జోరుగా నడుస్తోంది. పవార్ అన్న కొడుకు, మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎన్సీపీలో తనకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలతో బీజేపీతో దోస్తీకి వెళ్లబోతున్నాడంటూ ప్రచారం తెర మీదకు వచ్చింది. అయితే అజిత్ పవార్ ఆ ప్రచారాన్ని ఖండిస్తూ వస్తున్నారు.
👉 మరోవైపు ఈ బాబాయ్-అబ్బాయ్ నడుమ గ్యాప్ గురించి, హఠాత్తుగా ఏం పరిణామం జరగబోతుందా? అనే ఆసక్తికర చర్చ మహా రాజకీయాల్లో నడుస్తుండగానే పవార్ పార్టీ చీఫ్ పదవికి రాజీనామా ప్రకటించారు. పార్టీలో తనకు దక్కుతున్న ప్రాధాన్యంపై అజిత్ అసంతృప్తిగా ఉన్నారని, పవార్ యువనాయకత్వాన్ని ప్రొత్సాహించడం అజిత్‌కు నచ్చడం లేదనే టాక్ మరోవైపు నడుస్తోంది.
👉 వచ్చే ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ హయాంలోని కేంద్ర ప్రభుత్వంపై పోరాటం కోసం.. విపక్షాలను ఒకే తాటి మీదకు తెచ్చేందుకు జరుగుతున్న కృషిలో పవార్ పాత్ర ఎంతో కీలకంగా ఉంటోంది కూడా. ఇలాంటి టైంలో ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడం గమనార్హం.
"I am resigning from the post of the national president of NCP," says NCP chief Sharad Pawar pic.twitter.com/h6mPIk4wgJ
— ANI (@ANI) May 2, 2023
పవార్ నాయకత్వంలో ఎన్సీపీ నావ
👉 జాతీయ వాదం, గాంధీ సెక్యులరిజం సిద్దాంతాలతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ NCP పుట్టుకొచ్చింది.
👉 1999 మే 20న.. సోనియా గాంధీ నాయకత్వాన్ని ‘ఇటలీ’ మార్క్‌ను చూపిస్తూ తీవ్రంగా వ్యతిరేకించింది కాంగ్రెస్‌లోని వర్గం. దీంతో శరద్ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది కాంగ్రెస్. అయితే నెల తిరగక ముందే జూన్ 10వ తేదీన.. ఆ ముగ్గురి ఆధ్వర్యంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఆవిర్భవించింది. పార్టీ గుర్తు మూడు రంగుల మధ్యలో గడియారం సింబల్.
👉 పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన శరద్ పవార్ నాటి నుంచి పార్టీ జాతీయాధ్యక్షుడిగా కొనసాగుతూ వస్తున్నారు. ఏక పక్షంగా ఆయన నియామకం జరుగుతూ వస్తోంది. ప్రస్తుతం జయంత్ పాటిల్ మాత్రం మహారాష్ట్ర రాష్ట్ర అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు.
👉 ఏ సోనియా గాంధీని అయితే వ్యతిరేకిస్తూ ఎన్‌సీపీ పుట్టిందో.. ఆ తర్వాతి సంవత్సరాల్లో సోనియా గాంధీ అధినేత్రిగా వ్యవహరించిన యూపీఏ ప్రభుత్వంతో మిత్రపక్షంగా కొనసాగుతూ వస్తోంది.
👉 ప్రభుత్వాలతో దోస్తీ కొనసాగించిన శరద్ పవార్.. కేంద్ర మంత్రి పదవులను సైతం చేపట్టారు. ప్రతిపక్షంలోనూ ఆయన రాజకీయంలో తన మార్క్ ప్రదర్శించేవారు.
👉 మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఎన్సీపీ.. నాగాలాండ్‌లోనూ ప్రభావం చూపెడుతూ వస్తోంది. ఈ తరుణంలోనే ఈసీ నిబంధనలకు లోబడి.. చాలా ఏళ్ల కిందటే జాతీయ పార్టీ హోదా పొందింది ఎన్సీపీ. కానీ, తాజాగా ఆ హోదాను కోల్పోవడం గమనార్హం.
👉 పార్టీలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా.. చీలిక వర్గాలు, అసంతృప్తులు, వెన్నుపోటులు ఎదురైనా.. పవార్ నాయకత్వం వాటిన్నింటికి చెక్ పెడుతూ నిలకడగా ఎన్సీపీ నావను ముందుకు నడిపింది.
ఇదీ చదవండి: మన్ కీ బాత్@100.. ఒక్కో ఎపిసోడ్‌కు 8.3 కోట్లు?
Comments
Please login to add a commentAdd a comment