
ముంబై/న్యూఢిల్లీ : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ రాత్రికి రాత్రి బీజేపీతో చేతులు కలిపి మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుకి కారణమయ్యాడు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై శరద్‌పవార్ కుమార్తె సుప్రియా సూలే సోషల్ మీడియా వేదికగా వరుస పోస్ట్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. మహారాష్ట్రలో జరుగుతున్న నాటకీయ పరిణామాలను కవర్ చేయడానికి మీడియా ప్రతినిధులు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు.
ఈ క్రమంలో శరద్ పవార్ వెళ్తున్న కారును వెంబడించిన మీడియా ప్రతినిధులు.. ప్రమాదకర రీతిలో వీడియో చిత్రీకరించారు. ఓ వ్యక్తి బైక్ నడుపుతుండగా.. వెనకాల ఉన్న వ్యక్తి వీడియో చిత్రీకరిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేసిన సుప్రియా.. ‘మీరు చేస్తున్నది బ్రేకింగ్ న్యూస్ కోసమని తెలుసు.. కానీ కాస్త జాగ్రత్త తీసుకోండి. నేను ఆ బైక్ డ్రైవర్, కెమెరామెన్ గురించి ఆందోళన పడుతున్నాన’ని పేర్కొన్నారు.
బంధుత్వాలు ముఖ్యమని నమ్ముతాను..
అజిత్ పవార్ బీజేపీకి మద్దతుగా నిలిచి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని ఉద్దేశించి సుప్రియా తన వాట్సాప్ స్టేటస్‌లో పలు పోస్ట్‌లను ఉంచారు. కుటుంబం, పార్టీలో చీలిక వచ్చిందని పేర్కొన్న ఆమె.. తాను జీవితంలో ఇంత దారుణంగా మోసపోతానని అనుకోలేదని అన్నారు. తాము అతన్ని నమ్మినందుకు, ప్రేమించినందుకు.. తిరిగి తమకు ఏమి లభించిందో చూడండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే.. ‘అధికారం వస్తుంది.. పోతుంది. కానీ బంధుత్వాలు ముఖ్యమని నేను నమ్ముతాను’, ‘ గుడ్ మార్నింగ్.. విలువలే చివరకు విజయం సాధిస్తాయి. నిజాయితీ, శ్రమ ఎప్పటికీ వృథా కాదు.. ఈ మార్గం చాలా కష్టమైనదైనప్పటికీ దీర్ఘకాలం నిలిచిపోతుంది’ అంటూ కూడా ఆమె పోస్ట్ చేశారు.
కాగా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటీ నుంచి ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. అధికార పంపిణీ విషయంలో శివసేన, బీజేపీల మధ్య పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీతో మంతనాలు జరిపింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు గడువు ముగియడంతో గవర్నర్.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. ఈ క్రమంలో శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు తీవ్రంగా యత్నించింది. ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఓ నిర్ణయానికి వచ్చింది. శనివారం రోజున గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరేందుకు సిద్ధమైంది. కానీ, బీజేపీ తెరవెనక మంతనాలు జరపడంతో.. రాత్రికి రాత్రే మహా రాజకీయంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీ మద్దతుగా నిలువడంతో.. గవర్నర్ దేవేంద్ర ఫడ్నవిస్‌చే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. అయితే బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన, ఎన్సీపీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై సుప్రీం కీలక ఆదేశాలు జారీచేసింది. దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్షను వెంటనే ఎదుర్కోవాల్సిన అవసరం లేదని, ఎప్పడు చేపట్టాలో సోమవారం తమ నిర్ణయం తెలుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment