Supriya Sule Reacts To Reports On Ajit Pawar Unhappy With Her Elevation - Sakshi
Sakshi News home page

శరద్‌ పవార్‌ నిర్ణయంపై అజిత్‌ అసంతృప్తి.. స్పందించిన సుప్రియా సూలే

Published Mon, Jun 12 2023 11:50 AM | Last Updated on Mon, Jun 12 2023 5:17 PM

Supriya Sule On Reports Ajit Pawar Unhappy With Her Elevation - Sakshi

ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ తాజా నిర్ణయంపై అజిత్‌ పవార్‌ అసంతృప్తి ఉన్నారంటూ వస్తున్న వార్తలపై పార్టీకి కొత్తగా నియమితులైన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుప్రియా సులే స్పందించారు. తన పదవి పట్ల అజిత్‌ పవార్‌ సంతోషంగా లేరన్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. అవన్నీ పుకార్లేనని బారామతి ఎంపీ కొట్టిపారేశారు.

కాగా జూన్‌ 10న ఎన్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌ తన అన్న కొడుకు అజిత్‌ పవార్‌కు షాక్‌ ఇస్తూ కూతురు సుప్రియా సూలేకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి అజిత్ పవార్ కూడా హాజరయ్యారు. ఆయన ఎదుటే ఈ ప్రకటన వెలువడింది.

ఇద్దరు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు
సూప్రియా సూలేతోపాటు సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ ప్రఫుల్‌ పటేళ్లను ఎన్సీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా నియమించారు. మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, ఝార్ఖండ్‌, గోవాతోపాటు పార్టీ రాజ్యసభ వ్యవహారాలను ప్రఫుల్‌ పటేల్‌ చూస్తారు. కూతురికి లోక్‌సభ, పార్టీ వ్యవహారాలతోపాటు మహిళలు, యువత, విద్యార్థి విభాగాలు, మహారాష్ట్ర, హరియాణా, పంజాబ్‌ ఇంచార్జ్‌గా బాధ్యతలు అప్పజెప్పారు. అయితే మహారాష్ట్ర వ్యవహరాలను ఇప్పటికీ వరకు అజిత్‌ పవార్‌ చూసుకుంటున్నారు. తాజాగా సుప్రియా సూలేకు అ భాద్యతలు ఇవ్వడంతో అజిత్‌ను పక్కకు పెట్టినట్లు అయ్యింది. 

బంధుప్రీతితోనే బాధ్యతలు!
ఇక  పార్టీ వ్యవహారాల విషయంలో అన్న కొడుకు, ముఖ్యనేత అజిత్ పవార్‌ను పక్కన పెట్టడం హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పవార్‌ నిర్ణయం అజిత్‌ను పక్కకు పెట్టిన్నట్లు కనిపిస్తుందని, ఎన్సీపీలో విభేదాలు బయపడ్డాయని మండిపడుతున్నాయి. కేవలం బంధుప్రీతితోనే సుప్రియా సూలేకు కీలక బాధ్యతలు అప్పగించారని ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలపై సుప్రియా సులే స్పందించారు. అవన్నీ కేవలం  పుకార్లేనని కొట్టిపారేశారు. 

అజిత్‌ను బీజేపీ టార్గెట్‌ చేసింది
అజిత్‌ పవార్‌ సంతోషంగా లేరని ఎవరూ చెప్పారు? ఎవరైనా అతన్ని అడిగారా? ఈ విషయంలో వస్తున్న వార్తలన్నీ గాసిప్స్‌ మాత్రమే. దాదా అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా ఉన్నారు. ఆయన స్థానం ముఖ్యమంత్రితో సమానం. అజిత్ పవార్‌ను టార్గెట్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. కొన్నిసార్లు నన్ను టార్గెట్‌ చేస్తోంది’ మండిపడ్డారు. 

బంధుప్రీతి’ లేని పార్టీ ఏదీ?
అదే విధంగా వారసత్వ రాజకీయాలపై ఆమె ఘాటుగా స్పందించారు.‘ అవును బంధుప్రీతి రాజకీయాలు ఉన్నాయి. ‘బంధుప్రీతి’ లేని పార్టీ ఏదైనా ఉందా? శరద్‌ పవార్‌ కూతురిని అయినందుకు చాలా గర్వపడుతున్నాను. బంధు ప్రీతి గురించి మాట్లాడినప్పుడు పని తీరు గురించి, ప్రతిభ గురించి ఎందుకు మాట్లాడరు.  నేను సంసద్‌ రత్న అవార్డు కూడా అందుకున్నాను. అయితే నాకు ఆ అవార్డు పార్లమెంట్‌లో చేసిన కృషికి దక్కింది. శరద్‌ పవార్‌ కూతుర్ని కావడం వల్ల కాదు’ అని పేర్కొన్నారు. 

అజిత్‌ పవార్‌ ఏమన్నారంటే..
అంతకుముందు ఆదివారం ఆమె పుణెలో పార్టీ కార్యకర్తలను కలుసుకున్నారు. వర్కింగ్‌ ప్రెసిడెండ్‌గా ఎన్నికైనందుకు ఎన్సీపీ శ్రేణులు ఆమెను సత్కరించారు. ఈ సందర్భంగా సుప్రియా సూలే పుణెలోని గాంధీ భవన్‌లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఇక శరద్‌ పవార్‌ నిర్ణయంపై తాను సంతోషంగా ఉన్నట్లు అజిత్‌ పవార్‌ సైతం వెల్లడించారు. దీనిపై తాను అసంతృప్తితో ఉన్నట్లు వస్తున్న ప్రచారాలన్నీ పుకార్లేనని తెలిపారు.

అప్పుడే నిర్ణయం తీసుకున్నాం..
‘పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పజెప్పకపోవడంతో నేను సంతోషంగా లేనంటూ కొన్ని వార్త కథనాలు వెలువడుతున్నాయి. అవన్నీ అబద్ధాలే. శరద్‌ పవార్‌ రాజీనామా చేసిన సమయంలో కమిటీ ఏర్పడింది. అరోజే రెండు నిర్ణయాలు తీసుకున్నాం. శరద్‌ పవార్‌ తన రాజీనామాను వెనక్కి తీసుకోవడం ఒకటి.. సుప్రియా సూలేను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నియమించాలని కమిటీ ఏర్పడినప్పుడే సూచించాం. అయితే మిగిలిన కమిటీ సభ్యులు శరద్ పవార్‌ను ఒప్పించి రాజీనామా ఉపసంహరించుకోవడంపై దృష్టి సారించాలని చెప్పారు’ అని అజిత్ పవార్ విలేకరులతో అన్నారు.

శరద్ పవార్ గత నెలలో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే మే 5న ఎన్సీపీ కమిటీ శరద్రా‌ జీనామాను తిరస్కరిస్తూ తీర్మానం చేయసింది.అలాగే తను స్థాపించిన పార్టీకి నాయకత్వం వహించాల్సిందిగా అభ్యర్థించడంతో ఆయన తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.  మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement