Maharashtra political crisis: ‘మహా కుదుపు’.. నిలువునా చీలిన ఎన్సీపీ | Maharashtra political crisis: Ajit Pawar shocker for NCP | Sakshi
Sakshi News home page

Maharashtra political crisis: ‘మహా కుదుపు’.. నిలువునా చీలిన ఎన్సీపీ

Published Mon, Jul 3 2023 5:26 AM | Last Updated on Mon, Jul 3 2023 5:26 AM

Maharashtra political crisis: Ajit Pawar shocker for NCP - Sakshi

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో అలజడి. ఒక్కరోజులోనే రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. ప్రతిపక్ష నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) నిట్టనిలువునా చీలిపోయింది. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న ఆ పార్టీ అధినేత శరద్‌ పవార్‌కు పెద్ద షాక్‌ తగిలింది. ఆయన సోదరుడి కుమారుడు, ఎన్సీపీ సీనియర్‌ నాయకుడు అజిత్‌ పవార్‌ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి వేరు కుంపటి పెట్టుకున్నారు.

ఆదివారం బీజేపీ–శివసేన(షిండే వర్గం) ప్రభుత్వంలో చేరారు. ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అజిత్‌ వర్గం ఎమ్మెల్యేల్లో ఎనిమిది మందికి మంత్రి పదవులు లభించాయి. కాగా, పార్టీని ధిక్కరించి, ప్రభుత్వంలో చేరినవారిపై చర్యలు తీసుకోవడం ఖాయమని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ తేల్చిచెప్పారు. త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.  

ముంబై/పుణే/న్యూఢిల్లీ:  మహారాష్ట్ర రాజకీయాల్లో మరో అలజడి. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ)  అధినేత శరద్‌ పవార్‌కు పెద్ద షాక్‌ తగిలింది. ఆయన సోదరుడి కుమారుడు, ఎన్సీపీ సీనియర్‌ నాయకుడు అజిత్‌ పవార్‌ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి వేరు కుంపటి పెట్టుకున్నారు. ఆదివారం బీజేపీ–శివసేన(షిండే వర్గం) ప్రభుత్వంలో చేరారు.

ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అజిత్‌ వర్గం ఎమ్మెల్యేల్లో ఎనిమిది మందికి మంత్రి పదవులు లభించాయి. మహారాష్ట్రలో ఒక్కరోజులోనే పరిణామాలు వేగంగా మారిపోయాయి. అజిత్‌ పవార్‌తో ఉప ముఖ్యమంత్రిగా, ఛగన్‌ భుజ్‌బల్, దిలీప్‌ వాల్సే పాటిల్, హసన్‌ ముష్రీఫ్, ధనుంజయ్‌ ముండే, ఆదితీ తట్కారే, ధర్మారావు , అనిల్‌ పాటిల్, సంజయ్‌ బాంసోడేతో మంత్రులుగా రాష్ట్ర గవర్నర్‌ రమేశ్‌ రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవంలో స్పీకర్‌ తోపాటు డిప్యూటీ స్పీకర్‌ నరహరి, ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్‌ పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.   

విపక్ష నేత పదవికి అజిత్‌ రాజీనామా  
అజిత్‌ పవార్‌ తొలుత ముంబైలోని తన అధికారిక నివాసం ‘దేవగిరి’లో ఎన్సీపీ ఎమ్మెల్యేలతో, కొందరు నాయకులతో సమావేశమయ్యారు. భేటీ అనంతరం శానససభలో ప్రతిపక్ష నేత పదవికి అజిత్‌  రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ఆమోదించినట్లు అసెంబ్లీ స్పీకర్‌ ప్రకటించారు. ఆ తర్వాత అజిత్‌ తన ఎమ్మెల్యేలలో కలిసి రాజ్‌భవన్‌కు చేరుకొని, ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్రలో ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో 40 మంది తమ ప్రభుత్వానికి మద్దతిస్తున్నారని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బవాంకులే స్పష్టం చేశారు. అయితే, అజిత్‌ పవార్‌కు 36 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారని ఆయన సన్నిహితుడొకరు చెప్పారు.   

దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసమే చేరాం: అజిత్‌ æ  
దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రభుత్వంలో చేరామని అజిత్‌ చెప్పారు. ప్రభుత్వంలో చేరాలన్న నిర్ణయానికి పార్టీ ప్రజాప్రతినిధులందరూ మద్దతునిచ్చారని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీలో ఎలాంటి చీలిక లేదని, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఎన్సీపీ పేరుతో, ఎన్సీపీ గుర్తుపైనే పోటీ చేస్తామని అన్నారు.

పరిపాలనలో తమకు ఎంతో అనుభవం ఉందని, ప్రజలకు మేలు చేయడానికి ఈ అనుభవాన్ని ఉపయోగించుకుంటామని వ్యాఖ్యానించారు. తనతోపాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనిమిది మందికి త్వరలోనే శాఖలు కేటాయించనున్నట్లు అజిత్‌ వెల్లడించారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా తమ వెంటే ఉన్నారన్నారు. ప్రధాని∙మోదీ నాయకత్వంపై అజిత్‌‡ ప్రశంసల వర్షం కురిపించారు.  కాగా, రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం ఇప్పుడు త్రిబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వంగా మారిందని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే అన్నారు. ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులతో అభివృద్ధి ఇక వేగం పుంజుకుటుందని ధీమా వ్యక్తం చేశారు.   

అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జితేంద్ర అవద్‌
మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవద్‌ నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఎన్సీపీ  ప్రకటించింది. ఇప్పటిదాకా ప్రతిపక్ష నేతగా పనిచేసిన అజిత్‌ పవార్‌ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో జితేంద్రను నియమించినట్లు పేర్కొంది. పార్టీ ఎమ్మెల్యేలంతా తాను చేసే విప్‌నకు కట్టుబడి ఉండాలని జితేంద్ర అవద్‌ పేర్కొన్నారు.  

బీజేపీ వాషింగ్‌ మెషీన్‌..: కాంగ్రెస్‌  
మహారాష్ట్ర రాజకీయ వ్యవహారాలపై కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ వ్యంగ్యంగా స్పందించారు. బీజేపీ వాషింగ్‌ మెషిన్‌ మళ్లీ పని ప్రారంభించిందని అన్నారు. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్సీపీ నాయకులు మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారని, ఇక వారందరికీ క్లీన్‌ చిట్‌ వస్తుందని చెప్పారు. బీజేపీ కబంధ హస్తాల నుంచి మహారాష్ట్రకు విముక్తి కలి్పంచడమే తమ లక్ష్యమని తెలిపారు.  

శరద్‌కు ఖర్గే, రాహుల్‌ గాంధీ మద్దతు  
ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌కు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ మద్దతు ప్రకటించారు. ఇద్దరు నేతలు పవార్‌తో ఫోన్‌లో మాట్లాడి తాజా పరిస్థితి తెల్సుకున్నారు.

పార్టీని ధిక్కరించినవారిపై చర్యలు తప్పవు: శరద్‌ పవార్‌
పార్టీని ధిక్కరించి, ప్రభుత్వంలో చేరినవారిపై చర్యలు తీసుకోవడం ఖాయమని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ తేలి్చచెప్పారు. త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆయన ఆదివారం పుణేలో మీడియాతో మాట్లాడారు. పార్టీలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై స్పందిస్తూ.. ఇలాంటివి చూడడం తనకు కొత్తేమీ కాదన్నారు. బీజేపీ–శివసేన ప్రభుత్వం చేరాలన్నది తమ పార్టీ నిర్ణయం ఎంతమాత్రం కాదన్నారు.

కొందరు నాయకులు కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులకు భయపడి ప్రభుత్వంలో చేరినట్లున్నారని అభిప్రాయపడ్డారు. ఇది తన ఇంటి సమస్య కాదని, ప్రజల సమస్య అని చెప్పారు. మద్దతు కోసం సోమవారం నుంచే ప్రజల్లోకి వెళ్తానని, పార్టీని పునర్నిరి్మస్తానని శదర్‌ పవార్‌ పేర్కొన్నారు. త్వరలో తమ పార్టీ నాయకులతో సమావేశమవుతానని, పార్టీకి సంబంధించిన నిర్ణయాలపై చర్చిస్తామని తెలిపారు. జాతీయ స్థాయిలో త్వరలో జరిగే విపక్షాల సమావేశంలో తాను పాల్గొంటానని ఉద్ఘాటించారు.

రాష్ట్రంలో నాలుగేళ్లుగా అస్థిరతే  
నాలుగేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే ఎన్నికల తర్వాత ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఉద్ధవ్‌ ఠాక్రే పట్టుబట్టగా బీజేపీ అంగీకరించకపోవడమే ఇందుకు కారణం. దాంతో కొన్నాళ్లు రాష్ట్రపతి పాలన కొనసాగింది. తర్వాత బీజేపీకి అజిత్‌  అండగా నిలిచారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్‌ ప్రమాణం చేశారు.

ఆ ప్రభుత్వం కేవలం 80 గంటలపాటు మనుగడ సాగించింది. ఉద్ధవ్‌ ఠాక్రే ఎన్సీపీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. గత ఏడాది జూన్‌లో శివసేన నేత షిండే తిరుగుబాటు చేశారు. శివసేనలో చీలిక ఏర్పడింది. ఎంవీఏ ప్రభుత్వం కూలింది. బీజేపీతో మద్దతుతో షిండే గత ఏడాది జూన్‌ 30న ముఖ్యమంత్రి అయ్యారు. సరిగ్గా ఏడాది తర్వాత ప్రభుత్వంలో అజిత్‌‡ చేరడం ఆసక్తికరంగా మారింది.

నాలుగేళ్లలో మూడుసార్లు డిప్యూటీ సీఎం
అజిత్‌ పవార్‌ పొలిటికల్‌ పవర్‌ ఇదీ!
అజిత్‌ పవార్‌.. ఎన్‌సీపీని నిట్ట నిలువుగా చీల్చి మరోసారి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో హంగ్‌ అసెంబ్లీ వచ్చినప్పుడు బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిచ్చి కొద్ది రోజులు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఆయన ఇప్పుడు అధినేత శరద్‌ పవార్‌కు షాక్‌ ఇస్తూ పార్టీని చీల్చారు. 2019 నవంబర్‌ నుంచి 2022 జూన్‌ వరకు ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రిగా మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వంలో  డిప్యూటీ సీఎంగా పని చేశారు. అజిత్‌ 2019  తర్వాత ముచ్చటగా మూడోసారి ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. గతంలో కూడా కాంగ్రెస్‌–ఎన్సీపీ కలిసి 15 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన సమయంలో అశోక్‌ చవాన్, పృథ్వీరాజ్‌ చవాన్‌  హయాంలో డిప్యూటీ సీఎంగా చేశారు.

క్షేత్రస్థాయిలో పార్టీలో గట్టి పట్టున్న నాయకుడు. ప్రస్తుతం అజిత్‌ పవార్‌ సన్నిహితులు, కుటుంబ సభ్యులు వారి వారి చక్కెర సహకార సంఘాల్లో అవినీతి ఆరోపణల్ని, ఈడీ కేసుల్ని ఎదుర్కొంటున్నారు. అజిత్‌ పవార్‌ పార్టీని చీల్చడానికి  ఈ కేసులు కూడా ఒక కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అజిత్‌ పవార్‌ రాష్ట్రంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 70 వేల కోట్ల కుంభకోణం చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది మేలో ఎన్‌సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, కార్యకర్తల ఒత్తిడితో శరద్‌ పవార్‌ వెనక్కి తీసుకున్న సమయంలో అజిత్‌ పవార్‌ ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని కలుసుకున్నారు. ఇక శరద్‌ పవార్‌ తన కుమార్తె సుప్రియా సూలేకి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పజెప్పడం అజిత్‌ పవార్‌కు మింగుడు పడలేదని, అందుకే ఆయ పార్టీని చీల్చారన్నది బహిరంగ రహస్యమే.  

మహారాష్ట్రలో పార్టీల బలాబలాలు
2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
పార్టీ    స్థానాలు  
బీజేపీ    105
శివసేన    56  
ఎన్సీపీ     54  
కాంగ్రెస్‌     44  
ఇతర పార్టీలు+స్వతంత్రులు    29  
ఏ మొత్తం అసెంబ్లీ స్థానాలు    288  


ప్రస్తుతం పార్టీల బలాబలాలు  
పార్టీ    స్థానాలు  
బీజేపీ     105
శివసేన(ఉద్ధవ్‌ ఠాక్రే)    16
శివసేన(షిండే)    40
ఎన్సీపీ(శరద్‌ పవార్‌)    18
ఎన్సీపీ(అజిత్‌ పవార్‌)    36
కాంగ్రెస్‌    44
ఇతర పార్టీలు+స్వతంత్రులు    29

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement