ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మిత్రపక్షాలతో సమావేశం కానున్నారు. సీఎం అధికారిక నివాసంలో బుధవారం మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది.సంకీర్ణ ప్రభుత్వంలో విబేధాలు చోటుచేసుకున్నాయనే వార్తల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే కూటమి ప్రభుత్వంలో సంక్షోభం తలెత్తిందనే వార్తలను ఎన్సీపీ, శివసేన ఇదివరకే ఖండించిన సంగతి తెలిసిందే. కాగా, కరోనాను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు నారయణ రాణే గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారితో భేటీ అయి.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. దీంతో మహారాష్ట్రలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఈ క్రమంలో ఉద్దవ్‌తో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అసంతృప్తితో ఉన్న మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని.. ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్యేలను లాక్కోవాలని చూస్తే.. ప్రజలే తిరగబడతారని అన్నారు. అంతకుముందు లాక్‌డౌన్ ఎత్తివేతపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే భినాభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే లాక్‌డౌన్‌ను ఎత్తివేయక తప్పదని పవార్ సూచించగా.. వైరస్‌ను కట్టడి చేయాలంటే లాక్‌డౌన్‌ఒక్కటే మార్గమని ఠాక్రే స్పష్టం చేశారు. ఎన్సీపీ, కాంగ్రెస్ నేతల ఒత్తిడి మేరకే ఆంక్షల్లో సడలింపు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సంకీర్ణ సర్కార్‌లోని నేతల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయని బీజేపీ ప్రచారం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment