ఠాణే: ఎన్సీపీ... ద్రోహుల పార్టీ అని శివసేన నాయకుడు ఉద్ధవ్‌ఠాక్రే ఆరోపించారు. సొంత పార్టీకి చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు శరద్‌పవార్ పార్టీలో చేరడంపై స్పందిస్తూ ఎన్సీపీని మునిగిపోతున్న నావగా అభివర్ణించారు. అంతేకాకుండా ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ లోపాలను ఆయన ఈ సందర్భంగా ఎత్తిచూపారు. శివసేన, బీజేపీ, ఆర్‌పీఐ, స్వాభిమాన్ శేత్కారీ సంఘటన్‌ల నేతృత్వంలో డోంబివలిలో ఆదివారం రాత్రి జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ విశ్వసనీయత కలిగిన కూటమిని ఎంపిక చేసుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘దివంగత అధినేత బాల్‌ఠాక్రే పార్టీ కోసం రేయింబవళ్లు శ్రమించినవారిని గుర్తించి వారికి కీలక బాధ్యతలను అప్పగించారు. అయితే అత్యాశ కారణంగా కొందరు సొంత పార్టీకి ద్రోహం చేసి ఇతర పార్టీలలో చేరుతున్నారు.
అందులో ఆనంద్ పరాంజపే ఒకరు. ప్రజలు అటువంటి నాయకులకు తగు బుద్ధి చెబుతారు. ప్రజల్లో మాకు ఎంతో పట్టు ఉంది. అదే మా ఆస్తి. వచ్చే ఎన్నికల్లో మా సత్తా ఏమిటో చూపుతాం. ఎన్సీపీలో చేరుతున్న వారికి అదొక మునిగిపోయే నావ అని అర్ధం కావడం లేదు’ అని పేర్కొన్నారు. కాగా పర్భణి ఎంపీ గణేశ్ దుధ్‌గావ్కర్ ఎన్సీపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ‘శివసేనలో ప్రజాస్వామ్యం. నా మాటే వేదం. నా నిర్ణయమే అంతిమం’ అని అన్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు పెరోల్ మంజూరు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇటువంటి వెసులుబాటు కల్నల్ శ్రీకాంత్, సాధ్వి ప్రజ్ఞాసింగ్, అసీమానంద్‌లకు కూడా కచ్చితంగా కల్పించాలన్నారు. అనంతరం బీజేపీ అగ్రనాయకుడు గోపీనాథ్ ముండే మాట్లాడుతూ ఎన్సీపీ తమ బలాన్ని తక్కువగా అంచనా వేయకూడదన్నారు.
అది ద్రోహుల పార్టీ
Published Mon, Feb 24 2014 11:13 PM | Last Updated on Fri, Oct 19 2018 8:23 PM
Advertisement
Advertisement