పుణె: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ)అధినేత శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019లో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ, ఎన్‌సీపీ కలిసి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరినట్లు తెలిపారు. మరాఠీ దినపత్రిక బుధవారం నిర్వహించిన 'లోక్‌సత్తా' కార్యక్రమంలో పాల్గొన్న శరద్ పవార్ మాట్లాడుతూ.. 2019 రాష్ట్ర ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు చర్చల సమయంలో ఎన్‌సీపీ, బీజేపీ కలిసిరావాలని మోదీ తనతో చర్చించిన విషయం నిజమేనని తెలిపారు.
బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న శివసేన సీఎం పదవికి సంబంధించిన విషయంలో బీజేపీతో విడిపోయిన విషయం తెలిసిందే. 2019 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సుమారు 90 రోజుల వరకూ నూతన ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ప్రధాని మోదీతో చర్చ జరిగిన సమయంలో.. ఎన్‌సీపీ, బీజేపీలు కలసి రావాలని మోదీ అన్నట్లు తెలిపారు. అయితే తాను అది సాధ్యం కాదని స్పష్టం చేశానని పేర్కొన్నారు. తమ వైఖరి భిన్నమైందని తెలిపినట్లు చెప్పారు. అయినప్పటికీ ఆ విషయం గురించి ఆలోచించమని మోదీ అన్నారని పేర్కొన్నారు.
శరద్ పవార్ వ్యాఖ్యలపై స్పందించిన శివసేన నేత సంజయ్‌రౌత్ మాట్లాడుతూ.. శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలు ‘మహావికాస్ అగాడీ కూటమి’గా ఏర్పడి ఉద్దవ్ థాక్రే సీఎంగా ఎంపికయ్యారని తెలిపారు. బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నించిందని కానీ సాధ్యం కాలేదని తెలిపారు. బీజేపీ అధికారంలోకి రాలేదని తెలిసి ఎవరితోనైనా జట్టుకట్టడానికి సిద్ధపడిందని సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment