లేదంటే పార్టిలే ఖాళీ
మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టిల పరిస్థితి
పవార్, ఉద్ధవ్, షిండే, అజిత్‌లకు కఠిన పరీక్ష
ఈ లోక్‌సభ ఎన్నికలు మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టిలకు జీవన్మరణ పరీక్షగా మారాయి. రాజకీయ కురువృద్ధుడు ఎన్సీపీ (ఎస్‌సీపీ) అధినేత శరద్ పవార్, చీలిక వర్గం చీఫ్, ఆయన అన్న కుమారుడు అజిత్ పవార్, బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే, శివసేన చీఫ్, సీఎం ఏక్‌నాథ్ షిండే... ఈ నలుగురూ గెలుపు కోసం అన్ని అ్రస్తాలనూ ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా శరద్ పవార్, ఉద్ధవ్ ఎన్నికలయ్యేదాకా ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితులు కూడా లేవంటే అతిశయోక్తి కాదు. శివసేనను షిండే, ఎన్సీపీని అజిత్ చీల్చి వేరుకుంపటి పెట్టుకోవడం తెలిసిందే.
వాటినే అసలైన శివసేన, ఎన్సీపీగా మహారాష్ట్ర స్పీకర్‌తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్, శరద్ పవార్ అధికారంలో భాగస్వాములుగా లేరు. పైగా మహావికాస్ అఘాడీ కూటమి పొత్తులో భాగంగా కొన్ని స్థానాలకే పోటీ చేస్తున్నారు. కనుక గణనీయమైన సీట్లు సాధిస్తే తప్ప వారి రాజకీయ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరిలో శరద్ పవార్ 50 ఏళ్లలో ఒక్క ఓటమీ ఎదుర్కోని నేత కాగా, ఉద్ధవ్ ఠాక్రే ఒక్కసారీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపడని నేత కావడం విశేషం!
ఠాక్రే... వీలైనన్ని చోట్ల పోటీ
2019లో బీజేపీతో పొత్తులో భాగంగా శివసేన 23 స్థానాల్లో పోటీ చేసి 18 గెలుచుకుంది. తర్వాత పార్టీని షిండే చీల్చడంతో ఉద్ధవ్ రాజకీయ భవితవ్యమే అనిశి్చతిలో పడింది. ఈసారి సాధ్యమైనన్ని స్థానాల్లో పోటీ చేసి సత్తా చాటే క్రమంలో 21 స్థానాలకు ఆయన అభ్యర్థులను ప్రకటించేశారు. ఈ ఏడాది చివర్లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకైనా ఉద్ధవ్ తన కేడర్‌ను కాపాడుకోవాలంటే కనీసం ఆరేడు లోక్‌సభ స్థానాలు గెలిచి తీరాలని రాజకీయ విశ్లేషకుడు అకోల్కర్ విశ్లేషించారు.
బారామతిలో ఎవరిదో పరపతి!
శరద్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ 10 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. వాటిలో బారామతి పవార్‌కు కీలకమైనది. అక్కడ 3సార్లుగా ఎంపీగా గెలుస్తు న్న పవార్ కుమార్తె సుప్రియా సులే ఈ విడత అజిత్ పవార్ భార్య సునేత్ర గట్టి సవాలు విసురుతున్నారు. ‘‘బారామతిలో సుప్రి య ఓడితే పవార్ అంతా కోల్పోయినట్టే. అలా చూస్తే ఈ యుద్ధం శరద్, అజిత్ మధ్యే!’’ అని పరిశీలకులు అంటున్నారు.
ఓట్ల చీలిక..
సీఎంగా ఉండగా ఇల్లు కదల్లేదన్న విమర్శలు మూటగట్టుకున్న ఉద్ధవ్ ఇప్పుడు పార్టీని బతికించుకునేందుకు రాష్ట్రమంతా చుడుతున్నారు. ఆయన ర్యాలీలకు మంచి స్పందనే వస్తోంది. శరద్ పవార్ ఉన్నచోటి నుంచే చక్రం తిప్పుతున్నారు. బారామతిలో కుమార్తె గెలుపు కోసం పుణె జిల్లాలో పూర్వపు ప్రత్యర్థులైన కాంగ్రెస్ నేతల మద్దతుకూ ప్రయత్నిస్తున్నారు. అంబేడ్కర్ మన వడైన ప్రకాశ్ అంబేడ్కర్ ఆధ్వర్యంలోని వంచిత్ బహుజన్ అఘాడి (వీబీఏ)తో ఎంవీఏ కూటమి సీట్ల పంపకం చర్చలు విఫలమయ్యాయి. దాంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఇది అధికార కూటమికి అనుకూలిస్తుందంటున్నారు.
కేడర్, ఓటర్ ఎటువైపు
శరద్ పవార్, ఉద్దవ్‌లకు ఈ ఎన్నికలు గట్టి పరీక్షేనని సీనియర్ జర్నలిస్ట్ అభయ్ దేశ్‌పాండే అన్నారు. అయితే పార్టిలు చీలినా సంప్రదాయ ఓటర్లు, కేడర్ మద్దతు వావైపేనని అభిప్రాయపడ్డారు. ‘‘పైగా బీజేపీ కేడర్‌లోనూ అశాంతి నెలకొని ఉంది. కనుక వాళ్లు అజిత్, షిండే అభ్యర్థుల విజయానికి మనస్ఫూర్తిగా పనిచేస్తారా అన్నది అనుమానమే’’ అని ఆయన సందేహం వెలిబుచ్చారు. 2019 ఎన్నికల్లో బీజేపీ–శివసేన 41 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నాయి. వాటిని నిలుపుకోవడం వాటికి ప్రతిష్టాత్మకమని, ఆ లెక్కన ఈ ఎన్నికలు అధికార బీజేపీ–షిండే–అజిత్ కూటమికే అసలైన పరీక్ష అని ఉద్దవ్, శరద్ పవార్ వర్గీయులు వాదిస్తున్నారు.
– ముంబై
Comments
Please login to add a commentAdd a comment