
అజిత్ తన ప్రకటనలతో గందరగోళం సృష్టిస్తున్నాడని వ్యాఖ్యానించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే అజిత్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాడని ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముంబై : ఎన్సీపీ రెబల్ నేత, మహారాష్ట్ర ఉపమఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అజిత్ పవార్‌కు ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ కౌంటర్ ఇచ్చారు. అజిత్ తన ప్రకటనలతో గందరగోళం సృష్టిస్తున్నాడని వ్యాఖ్యానించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే అజిత్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాడని ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా శరద్ పవార్ స్పష్టం చేశారు. శివసేన, కాంగ్రెస్‌తో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతకు ముందు.. బీజేపీకి మద్దతునిచ్చే దిశగా తమ పార్టీ చీఫ్ ఆలోచిస్తున్నారని అజిత్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘నేను ఎన్సీపీలో ఉన్నాను. ఎప్పటికీ ఎన్సీపీలోనే కొనసాగుతాను.
మా నాయకుడు శరద్ పవారే. బీజేపీ-ఎన్సీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సుస్థిర పాలన అందిస్తుంది. ప్రజా సంక్షేమం కోసమే మా ప్రభుత్వం ఏర్పడింది’అని అజిత్ ట్వీట్ చేశారు. మరొక ట్వీట్‌లో.. దేనికి గురించి బాధ పడాల్సిన పనిలేదు. అంతా సవ్యంగానే ఉంటుంది. అయితే, కొంత సంయమనం పాటించాలి. మీ అందరి సహకారానికి ధన్యవాదాలు’అని పేర్కొన్నాడు. కాగా, అనూహ్య మలుపుల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. 105 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి విశ్వాస పరీక్షలో నెగ్లాలంటే మరో 40 మంది సభ్యుల మద్దతు కావాలి.. ఎన్సీపీ ఎమ్మెల్యేల సంఖ్య 54.