
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) నేత, మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన మద్దతుదారులతో సహా బీజేపీలోకి మారతారంటూ వస్తున్న ప్రచారంపై స్పందించారు. ఈ అంశం ఇప్పుడు మహా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆ ప్రచారాన్ని ఖండించిన ఆయన.. ఏ కారణం లేకుండా రూమర్లను ప్రచారం చేస్తున్న మీడియాపై అసహనం వ్యక్తం చేశారు.
పుకార్లలో ఏదీ నిజం కాదు. ఎన్సీపీలోనే ఉంటా. ఎన్సీపీతోనే నా ప్రయాణం కూడా అని పేర్కొన్నారు. ఎన్సీపీలో ముసలం, ప్రతిపక్షాల కూటమిలో చీలిక వచ్చిందన్న ప్రచారాల్ని ఆయన ఖండించారు. ఇలాంటి ప్రచారాల వల్ల ఎన్సీపీ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. వాళ్లందరికీ చెప్పేది ఒక్కటే. ఎలాంటి ఆందోళన చెందకండి. ఎన్సీపీ అనేది శరద్ పవార్ నాయకత్వంలో ఏర్పాటైన పార్టీ. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. మన ఉనికి మనదే అజిత్ పవార్ ప్రకటించారు. పవార్ తర్వాత నెంబర్ టూగా ఎన్సీపీలో ఆయన అన్న కొడుకు అజిత్ పవార్ హవా నడుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు సైతం ఆయన వెంట ఉన్నారు.
అయితే.. పవార్ కూతురు సుప్రియా సూలే ఈ ఉదయం చేసిన వ్యాఖ్యలు మహా రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయి. వచ్చే పదిహేను రోజుల్లో రెండు పెద్ద రాజకీయ కుదుపులకు వేదిక కానుందని వ్యాఖ్యానించారామె. ఒకటి ఢిల్లీ స్థాయిలో, మరొకటి మహారాష్ట్రలో రాజకీయ కుదుపులు ఉండనున్నాయని ఆమె పేర్కొన్నారు. అయితే అవేంటని మీడియా ఆమెను ఆరా తీయగా.. దాటవేత సమాధానం ఇచ్చారు.
అది అజిత్ పవార్ పార్టీ మారడం గురించేనా అని అడగ్గా.. ఆ విషయాన్ని అజిత్ దాదా(అజిత్ పవార్‌ను ఉద్దేశించి)నే అడగాలని రిపోర్టర్లకు సూచించారామె. ప్రజాప్రతినిధిగా తనకు చాలా పని ఉందని, ఉత్తినే మాట్లాడేందుకు తనకు సమయం లేదన్నారు.
అంతకు ముందు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్.. ఎన్సీపీ ఎమ్మెల్యేల చీలిక, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గంతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటూ వచ్చిన కథనాలను ఖండించారు. ‘పవార్ ఎన్సీపీ ఎమ్మెల్యేలతో ఎలాంటి సమావేశానికి పిలుపు ఇవ్వలేదు. అతను ఎన్సీపీ కోసమే పని చేస్తున్నాడు. ఇంతా మీ బుర్రలోంచి పుట్టిందేమో అంటూ మీడియాకు చురకలు అంటించారు.
Comments
Please login to add a commentAdd a comment