మహా ట్విస్ట్‌: పవార్‌, ఉద్ధవ్‌ ఠాక్రే ప్రెస్‌మీట్‌ | Sharad Pawar Uddhav Thackeray Joint Press Meet Over Maharashtra Politics | Sakshi
Sakshi News home page

మాకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు: శరద్‌ పవార్‌

Published Sat, Nov 23 2019 1:14 PM | Last Updated on Sat, Nov 23 2019 1:42 PM

Sharad Pawar Uddhav Thackeray Joint Press Meet Over Maharashtra Politics - Sakshi

ముంబై : తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌ పార్టీలకు సరిపడా సంఖ్యాబలం ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్‌(బీజేపీ), డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌(ఎన్సీపీ) ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో శరద్‌ పవార్‌, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఫడ్నవిస్‌ ప్రభుత్వ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని ధ్వజమెత్తారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు అజిత్‌ పవార్‌ను ఎన్సీపీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడికీ వెళ్లలేదని వ్యాఖ్యానించారు.

అనర్హత వేటు తప్పదు
‘మా పార్టీ ఎమ్మెల్యేలు మాతోనే ఉన్నారు. మేం ఏర్పాటు చేయబోయే సంకీర్ణ ప్రభుత్వానికి స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా మద్దతునిచ్చారు. అయితే తెల్లవారేలోగా పరిస్థితులు మారిపోయాయి. రాష్ట్రపతి పాలన ఎత్తివేసినట్లు ఆరున్నరకు తెలిసింది. మా ఎమ్మెల్యేలలో కొంతమందిని అజిత్‌ పవార్‌ రాజ్‌ భవన్‌కు వెళ్లారు. ఇది పార్టీ నిర్ణయానికి వ్యతిరేకం. అక్కడున్న వాళ్లతో అజిత్‌ మాట్లాడిస్తున్నారు. బహుశా ఆయన వెంట 10 నుంచి 11 మంది ఎమ్మెల్యేలు ఉండి ఉంటారు అంతే. అయితే వాళ్లంతా అనర్హత వేటు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అసెంబ్లీలో బీజేపీ బల నిరూపణ చేసుకోలేదు. కాబట్టి మాకు అవకాశం ఉంటుంది’ అని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. బీజేపీతో ఎట్టిపరిస్థితుల్లోనూ చేతులు కలిపేది లేదని స్పష్టం చేశారు.(అందుకే కలిశాం; ‘మహా’ ట్విస్ట్‌పై వివరణ)

ఈ సందర్భంగా రాజ్‌ భవన్‌కు వెళ్లిన కొంతమంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో ఆయన మీడియాతో మాట్లాడించారు. ‘ అజిత్‌ పవార్‌ ఫోన్‌ చేసి రాజ్‌ భవన్‌కు రమ్మంటే వెళ్లాం. అయితే అప్పటికే అక్కడ ప్రమాణ స్వీకార ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడున్న వాతావరణంతో మేం షాక్‌కు గురయ్యాం. మేం అజిత్‌ వెంట వెళ్లడం లేదు. మా మద్దతు శరద్‌ పవార్‌కే’ అని ముగ్గురు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. మరోవైపు ప్రస్తుతం పరిణామాలపై చర్చించేందుకు సాయంత్రం నాలుగన్నర గంటలకు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో శరద్‌ పవార్‌ సమావేశం కానున్నారు. కాగా ఈ శివసేన, ఎన్సీపీ ఉమ్మడి పత్రికా సమావేశానికి కాంగ్రెస్‌ పార్టీ నేతలెవరూ హాజరుకాకపోవడం గమనార్హం. 

ఎన్నికలు జరగాల్సిన అవసరం లేదేమో: ఉద్ధవ్‌ ఠాక్రే
మహారాష్ట్ర తాజా పరిణామాలపై స్పందించిన ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడుతూ.. బీజేపీ అన్ని సిద్ధాంతాలను విస్మరించింది. పార్టీలను చీల్చి అధికారం చేపట్టిందని ధ్వజమెత్తారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను కూడా ఆయన శత్రువులు వెన్నుపోటు పొడిచిన విషయం అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటును ప్రజాస్వామ్యం మీద సర్జికల్‌ స్ట్రైక్‌గా ఆయన అభివర్ణించారు. ‘తొలుత ఈవీఎంలతో ఆటలాడారు. ఇప్పుడు కొత్త ఆట మొదలుపెట్టారు. ఇవన్నీ చూస్తుంటే ఇక ముందు ఎన్నికలు జరపాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది’ అని అసహనం వ్యక్తం చేశారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement