Internal differences
-
పార్టీ ఫిరాయింపులను చట్టాలు నిరోధించలేవు!
రాజకీయ పార్టీలో అంతర్గత విభేదాలు ఎప్పుడూ ఒక పద్ధతిని అనుస రిస్తాయి. వర్గ విభేదాలు బహిరంగంగా మారిన తర్వాత, ప్రతి ఒక్క పక్షం కూడా పార్టీపై నియంత్రణ సాధించడానికి ప్రయత్నిస్తుంది. మొదటగా, రెండు గ్రూపులూ తమతమ కార్యకర్తలను నియమిస్తాయి, పార్టీ స్థానాల నుండి ప్రత్యర్థులను తొలగిస్తాయి. అప్పుడు, రెండు వైపులా ప్రత్యర్థి సమూహానికి చెందిన చట్టసభ సభ్యుల సభ్యత్వం నుండి అనర్హులుగా ప్రకటించే ప్రక్రియను ప్రారంభిస్తాయి. చివరగా, పార్టీపై నియంత్రణను చేజిక్కించుకోవడానికి చట్టపరమైన తగాదాలు ప్రారంభమవుతాయి. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పార్టీ గుర్తు, దాని పేరు ఏ వర్గాని దన్న సంగతి నిర్ణయిస్తుంది. అనర్హత నిర్ణయించే క్రమంలో తెలుసుకున్న సమాచారం మేరకు శాసనసభ ప్రిసైడింగ్ అధికారి (స్పీకర్) ప్రతి వర్గానికి చెందిన చట్ట సభ సభ్యుల బలం ఎంతో నిర్ణయిస్తారు. ప్రతి దశలో, ప్రతి గ్రూపునకు చెందిన సంఖ్యా బలం, పార్టీ రాజ్యాంగం ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తాయి. మహారాష్ట్రను చుట్టుముట్టిన రాజకీయ నాటకంలో, శరద్ పవార్, అజిత్ పవార్ల నుండి మొదటి రెండు దశలు అంటే... టిట్–ఫర్–టాట్ తొలగింపులు, అనర్హతా పిటిషన్ల ధాఖలు చేయడం ఇప్పటికే పూర్తయ్యాయి. మూడవ దశ ప్రారంభం కావడానికి కొద్ది సమయం మాత్రమే ఉంది. ఎన్సీపీకి శాసనసభలో 53 మంది, శాసనమండలిలో తొమ్మిది మంది, లోక్‌సభలో ఐదుగురు, రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు. అయితే ఎవరి వర్గంలో గణనీయమైన సంఖ్యలో నాయకులు ఉన్నారనే విషయం తెలియడంలేదు. ఇది కీలకమైనది. శివసేన కేసులో, ఎన్నికల చిహ్నాలపై, ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునేటప్పుడు ఈసీఐ, స్పీకర్ ఇద్దరూ శాసనసభలో, పార్టీ సంస్థాగత విభాగాలలో వర్గ బలాలను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. సుప్రీంకోర్టు నొక్కిచెప్పిన రెండో అంశం పార్టీ రాజ్యాంగం. ఎన్సీపీ రాజ్యాంగం ఒక వివరణాత్మక పత్రం. ఇది పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల నియామకం, వారి పాత్ర, క్రమ శిక్షణా చర్యల ప్రక్రియను నిర్దేశిస్తోంది. చివరి నుంచి రెండో నిబంధన పార్టీని రద్దు చేయడం లేదా మరొక సంస్థలో విలీనం చేసే ప్రక్రియను తెలియజేస్తోంది. ఈ అంశంపై పార్టీ జాతీయ కమిటీ మాత్రమే నిర్ణయం తీసుకోగలదని అది పేర్కొంది. పార్టీ అధ్యక్షుడు ఈ కమిటీ సమావేశానికి నెల రోజుల ముందు నోటీస్ ఇస్తారు. కోరమ్, కమిటీలోని ఎన్నుకోబడిన సభ్యులలో 75 శాతం అని కూడా ఈ పత్రం నిర్దేశిస్తోంది. పార్టీని రద్దు చేయ డానికి లేదా విలీనం చేయడానికి 90 శాతం మంది అంగీకరించాలి. మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఫిరాయింపు పిటిషన్లపై విచారణ ప్రారంభించినప్పుడు, ఆయన ముందు ఈ పత్రం ఉంటుంది. గత సంవత్సరం నుండి పెండింగ్‌లో ఉన్న సేన పిటి షన్లతోపాటు రెండు ఎన్సీపీ వర్గాల ఫిరాయింపు అభ్యర్థనలు 11 వరకు ఆయన ముందు ఉన్నాయి. ఎన్సీపీ సంక్షోభం ముదిరితే, సేన మాదిరిగానే, దాదాపు ఎన్సీపీ శాసనసభ్యులందరూ ఏదో ఒక వర్గం నుండి అనర్హత ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. రాష్ట్రంలోని దాదాపు 100 మంది చట్టసభ సభ్యులు అంటే అసెంబ్లీ బలంలో మూడింట ఒక వంతు – ఫిరాయింపుల నిరో ధక చట్టంలో చిక్కుకునే పరిస్థితిని ఇది సృష్టించవచ్చు. దురదృష్టవశాత్తు, ఈ చట్టం తరచుగా పరిష్కారం కంటే సమస్యగానే ఉంటోంది. శాసనసభ అమాయకత్వం లేదా రాజకీయ వంచన 1985లో ఈ చట్టం ఆమోదం పొందడానికి దారి తీసింది. ఒక రాజకీయ పార్టీ టిక్కెట్‌పై ఎన్నికైన చట్టసభ సభ్యులు పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ప్రవర్తించినా లేదా ఓటు వేసినా రెండు మినహాయింపులతో తమ స్థానాన్ని కోల్పోతారని ఇది పేర్కొంది. మొదటి మినహాయింపు ఏమిటంటే, చట్టసభ సభ్యులలో మూడింట ఒక వంతు మంది పార్టీ నుండి విడిపోతే, దానిని ఫిరాయింపుగా పేర్కొనరు. ఈ నిబంధన ప్రభుత్వాలను పడగొట్టడానికి విస్తృతంగా ఉపయోగపడింది. చివరికి 2003లో పార్లమెంటు దానిని తొలగించింది. రెండవ మినహాయింపు – విలీన నిబంధన అని పిలవబడేది – ఒక రాజకీయ పార్టీ మరొక దానితో విలీనం అయితే, విలీనంలో భాగమైన చట్టసభ సభ్యు లను అనర్హులుగా ప్రకటించరు. పైగా పార్టీ శాసనసభ్యులలో మూడింట రెండొంతుల మంది అంగీకరించినట్లయితే అటు వంటి విలీనం జరిగినట్లు పరిగణిస్తారు. దీన్ని యథాతథంగా తీసుకుంటే, ఒక రాజకీయ పార్టీని మరొక దానితో విలీనం చేయడానికి కావాల్సిందల్లా దాని శాసన సభ్యులలో మూడింట రెండు వంతుల మందిని ఒప్పించడమే. ఉదాహరణకు, 2019 రాష్ట్ర ఎన్నికల తర్వాత, 10 మంది సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనం అయ్యారు. ఫలితంగా ఇంతకుముందు ఒక్క సభ్యుడు కూడా లేని బీజేపీ ఒక్కసారిగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. అయితే పార్టీ ఫిరాయింపులను నిరోధించే ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అర్థం చేసు కోవాలని సుప్రీం కోర్ట్ శివసేన కేసు విషయంలో భావించింది. పార్టీకి చెందిన చట్ట సభలకు ఎన్నికైన సభ్యులలో మూడింట రెండు వంతుల మంది విలీనం కావడానికి ముందు... ఆ రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తలు, సభ్యులు విలీనం అవ్వాలి. అప్పుడే ఒక పార్టీ మరో పార్టీలో విలీనం అయినట్లు పరిగణిస్తారు. విలీనాన్ని నిర్థారించ వలసిన చట్ట సభ స్పీకర్ విలీనానికి ఎంత మంది పార్టీ కార్యకర్తలు అనుకూలంగా ఉన్నారో ఎలా తెలుసుకుంటారు? అందుకే 1999లో లా కమిషన్ విలీన నిబంధనను తొలగించాలని సిఫార్సు చేసింది. కానీ అది అమలుకు నోచుకోలేదు. ఫిరాయింపుల నిరోధక చట్టం ఏనాడూ పని చేయలేదు. ఉదాహరణకు, సేన ఫిరాయింపు కేసు గత ఏడాది జూన్‌లో ప్రారంభమైంది, కానీ ఎక్కడా అది ముగింపునకు రాలేదు. ప్రస్తుత ఎన్సీపీ ఫిరాయింపు పిటిషన్లకు కూడా ఒక సంవత్సరం పట్టవచ్చు. అప్పటికి ఎన్నికలు సమీపిస్తాయి. దీంతో అప్పటి వరకు జరిగిన ప్రక్రియ అంతా–కనీసం రాజకీయంగా చూసినా నిష్ఫలమైనట్లే. రాజ్యాంగంలో కొన్ని చట్టపరమైన నిబంధనలను చేర్చినంత మాత్రాన రాజకీయ నైతికతను సాధించలేమని మనం గ్రహించాల్సిన సమయం ఇది. ఫిరాయింపుల సమస్యను ఎప్ప టికైనా పరిష్కరిస్తుందనే ఆశతో అంటిపెట్టుకోకుండా ‘ఫిరాయింపుల నిరోధక చట్టా’న్ని పూర్తిగా తొలగించడం మంచిది. ఫిరా యింపులు రాజకీయ సమస్యలు, వాటికి రాజకీయ పరిష్కారాలు అవసరం. ఈ విషయంలో చట్టం పరిమిత పాత్ర మాత్రమే పోషిస్తుంది. చక్షు రాయ్ వ్యాసకర్త లెజిస్లేటివ్, సివిక్ ఎంగేజ్మెంట్ హెడ్,పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
Karimnagar: టీఆర్ఎస్లో బయటపడ్డ అంతర్గత విభేదాలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గులాబీ పార్టీలో అంతర్గతపోరుతో కరీంనగర్ జిల్లా రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. ఓ వైపు టీఆర్ఎస్ జాతీయ పార్టీగా పరిణామం చెందుతున్న క్రమంలో జిల్లాలో ఇంటిపోరు రచ్చకెక్కడం పార్టీలో కలకలం రేపుతోంది. ప్రస్తుతం మంత్రి గంగుల కమలాకర్, మాజీ మేయర్ రవీందర్‌సింగ్ వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా రవీందర్‌సింగ్ అల్లుడు సోహన్‌సింగ్ మంత్రిపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. సోహన్ సింగ్ తీరును మంత్రి వర్గీయులతోపాటు జిల్లా పార్టీ కూడా తీవ్రంగా పరిగణించింది. ఈ కామెంట్లపై వివరణ ఇవ్వాలంటూ కమల్జిత్కౌర్ దంపతులకు పార్టీ షోకాజ్ జారీ చేసింది. మూడురోజుల్లో సమాధానం చెప్పాలంటూ డెడ్‌లైన్ విధించింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే..! వాస్తవానికి ఈ విభేదాలు రాత్రికి రాత్రి మొదలవలేదు. గతేడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వలేదని అలకబూనిన రవీందర్ సింగ్ తిరుగుబాటు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా రెబల్‌గా నామినేషన్ వేశారు. ఆ సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారిపై మంత్రివర్గీయులు కేసులు పెట్టిస్తూ కక్షసాధింపులకు పాల్పడుతున్నారని రవీందర్ సింగ్ ఆరోపించారు. పోలింగ్ రోజు సైతం రవీందర్‌సింగ్, ఆయన అన్న కూతురు కార్పొరేటర్ కమల్జిత్ కౌర్‌లు పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. టపాసులు కాల్చారన్న అభియోగంపై రవీందర్ సింగ్‌పై పోలీసు కేసు నమోదైంది. తరువాత ఆయన బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరిగినా.. వెంటనే పార్టీలోకి పునరాగమనం చేశారు. రీ ఎంట్రీ తరువాత కూడా రవీందర్‌సింగ్, మంత్రి వర్గాల మధ్య విభేదాలు ఏమాత్రం చల్లారలేదు. ఇటీవల కాలంలో కౌన్సిల్ సమావేశంలో నీటికొరతపై కమల్జిత్కౌర్ నిరసన తెలపడం, స్మార్ట్ సిటీ పనులపై రవీందర్‌సింగ్ ఆరోపణలతో మంత్రివర్గంతో అగాథం మరింత పెరిగింది. తాజాగా మంత్రి గంగుల కమలాకర్‌పై కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ భర్త సోహన్‌సింగ్ చేసిన వ్యాఖ్యల ఆడియో లీకవడం పార్టీలో చిచ్చురేపింది. మంత్రికి, పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారని మండిపడుతూ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి నేతత్వంలో పలువురు కార్పొరేటర్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామక్రిష్ణారావుకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌కు ఫిర్యాదుచేశారు. అయితే.. సీఎం కేసీఆర్ ఉత్తరభారతదేశ పర్యటనల నేపథ్యంలో తమకు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో మంత్రి వర్గం తమపై రాజకీయ దాడి చేస్తోందని రవీందర్‌సింగ్ వర్గం ఎదురుదాడికి దిగుతోంది. మూడురోజులే గడువు..! పార్టీ ప్రతిష్ట మసకబారేలా, మంత్రి కమలాకర్‌కు పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరిస్తూ మూడు రోజుల్లో సమాధానం చెప్పాలంటూ కార్పొరేటర్ కమల్జిత్ కౌర్, ఆమెభర్త సోహన్‌సింగ్‌లకు పార్టీ అధ్యక్షుడు జీవీ రామక్రిష్ణారావు బుధవారం జారీ చేసిన షోకాజుల్లో స్పష్టం చేశారు. దీంతో మూడురోజుల అనంతరం ఈ దంపతులు ఏమని వివరణ ఇస్తారు? ఆ సమాధానంతో జిల్లా పార్టీ అధ్యక్షుడు సంతృప్తి చెందుతారా? అన్న విషయం ఉత్కంఠ రేపుతోంది. (క్లిక్ చేయండి: కరీంనగర్ జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయాలు) -
కారు పార్టీలో ‘కయ్యం’.. టీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్..
వికారాబాద్: టీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు రోజురోజుకూ అధికమవుతున్నాయి. జిల్లాలోని నాలుగు నియోజకవర్గల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. స్వపక్షంలోనే ప్రతిపక్షం తయారవడంతో అధికారిక, పార్టీ కార్యక్రమాలు ఉద్రిక్తంగా సాగుతున్నాయి. తాండూరులో మొదలైన ఈ కుమ్ములాటలు అంతటా పాకాయి. రెండు వర్గాలుగా విడిపోయిన గులాబీ శ్రేణులు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. శుక్రవారం తాండూరులో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు.. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిపై అసహనం వ్యక్తంచేయడం స్థానిక పరిస్థితులకు అద్దం పట్టింది. చదవండి: అటు బుజ్జగింపులు.. ఇటు బాధ్యతలు! టీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్.. ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా.. ప్రస్తుతం జిల్లాలో ఇదే సీన్ కొనసాగుతోంది. అన్ని నియోజకవర్గాల్లోనూ వర్గపోరు జోరందుకుంది. పార్టీ కార్యక్రమాలకు విడివిడిగా హాజరుకావడం.. వ్యక్తిగత దూషణలకు దిగడం నేతలకు పరిపాటిగా మారింది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మాటల యుద్ధం సాధారణంగా ఎక్కడైనా పాలక, ప్రతిపక్షాలు గొడవలు పడుతుంటాయి. అధికార పక్షం అవునంటే.. ప్రతిపక్షం కాదంటుంది. అయితే అందరికీ అవసరమయ్యే కొన్ని పనుల విషయంలో.. మనవతా దృక్పథంతో పరస్పరం సహకరించుకుంటాయి. కానీ మన జిల్లాలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ తరపున పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఎక్కువవుతున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో సొంత పారీ్టకి చెందిన నేతలు పోటీ పడుతున్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో విడివిడిగా పాల్గొంటూ మాటల యుద్ధానికి తెరలేపుతున్నారు. పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ఒకరినొకరు బహిరంగంగా దూషించుకుంటున్నారు. నాలుగు చోట్లా అదే సీన్ తాండూరులో మొదలైన టీఆర్ఎస్ అంతర్గత కుమ్ములాటలు జిల్లా అంతటా వ్యాపించాయి. రెండేళ్ల క్రితం ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వర్గాల మధ్య ప్రారంభమైన గొడవలు వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయి. కొగంగల్లో ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ సాగుతోంది. వికారాబాద్‌లో మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు పట్నం వర్గంతో జత కట్టడంతో స్థానిక ఎమ్మెల్యేకు వర్గపోరు మొదలైంది. ఇక ఎమ్మెల్యే వర్గీయులు ఇటీవల జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి కాన్వాయ్‌ని అడ్డుకోవడంతో పార్టీ కేడర్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. పరిగి నియోజకవర్గంలో డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఇక్కడ కూడా అధికార పార్టీలో అంతర్గత పోరు మొదలైంది. ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్ రెండు వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దిగజారుతున్న ప్రతిష్ట అధికార పార్టీ నేతల తీరు ప్రజల్లో పార్టీ ప్రతిష్టను దిగజారుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో గతంలో నిర్వహించిన ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు కలిసి హాజరైన నేతలు ప్రస్తుతం ఎవరికి వారే అనే రీతిలో సాగుతున్నారు. వికారాబాద్, తాండూరులో జరిగిన పలు సంఘటనలు నేతల వ్యవహారాన్ని ప్రజలు ఈసడించుకునే స్థాయికి చేరింది. అధికార పార్టీ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు మొదలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ వరకు గులాబీ నేతల వ్యవహార శైలి నానాటికీ దిగజారుతోంది. అభివృద్ధి, ప్రజా సమస్యలను పక్కన పెట్టి మున్సిపల్ కార్యాలయాల సాక్షిగా చేస్తున్న రాజకీయాలు వెగటు పుట్టిస్తున్నాయి. ఆరు నెలల క్రితం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ అధికార పార్టీ జిల్లా సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత గొడవలు పెరిగానే తప్ప తగ్గుముఖం పట్టలేదు. మంత్రులు, ఎంపీలు చెబితేనే తెగని పంచాయితీలకు జిల్లా అధ్యక్షుడు పరిష్కారం చూపగలరా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పార్టీలో ఆయనే ఓ వర్గాన్ని నడుపుతుండగా ఇక నేతలను ఎలా సమన్వయం చేయగలరనే విమర్శలూ వినిపిస్తున్నాయి. -
అంతా ‘హస్త’వ్యస్తం!.. ఎవరికి వారే యమునా తీరే..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ పరిస్థితి జిల్లాలో ‘హస్త’వ్యస్తంగా తయారైంది. ఒకప్పుడు ఆ పార్టీకి కంచుకోటలా ఉన్న జిల్లా ప్రస్తుతం చిన్నాభిన్నమైంది. క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ ఉన్నప్పటికీ.. లీడర్ల మధ్య అంతర్గత విభేదాలు దెబ్బతీస్తున్నాయి. మహేశ్వరం, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నంలో పార్టీకి మంచి పట్టు ఉన్నప్పటికీ స్థానిక నేతల్లో అంతర్గత విభేదాలు వెంటాడుతున్నాయి. ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్కు మినహా మిగిలిన నియోజకవర్గాలకు ఇన్చార్జిలు లేకపోవడంతో కీలకమైన సమయంలో కేడర్‌ను సమన్వయం చేయలేకపోతున్నారు. ప్రజా సమస్యలపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపునకు జిల్లా అధ్యక్షుడు సహా ఒకరిద్దరు నేతలు మాత్రమే స్పందిస్తున్నారు. చదవండి👉: గవర్నర్ వ్యవస్థను దుర్మార్గంగా మార్చేశారు: సీఎం కేసీఆర్ ఇబ్రహీంపట్నంలో.. జిల్లాలోని ఇతర నియోజకవర్గాలతో పోలీస్తే ఇక్కడ క్షేత్రస్థాయిలో కేడర్ బలంగా ఉంది. ఆదిబట్ల, తుర్కయంజాల్, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలు ఆ పార్టీ అభ్యర్థులే గెలుచుకున్నారు. మంచాల, అబ్దుల్లాపూర్‌మెట్ జెడ్పీటీసీలు సహా అబ్దుల్లాపూర్‌మెట్ ఎంపీపీ కూడా ఆ పార్టీ అభ్యర్థే. ఇక్కడి నాయకులు రెండు వర్గాలుగా చీలిపోవడం తీరని నష్టాన్ని తెచ్చిపెడుతోంది. వీరిలో మల్రెడ్డి బ్రదర్స్ టీపీసీసీ చీఫ్ రేవంత్ వర్గంలో ఉంటే.. మిగిలిన వారు ఎంపీ కోమటిరెడ్డితో టచ్‌లో ఉంటున్నారు. ఒకరు హాజరైన కార్యక్రమానికి మరొకరు గైర్హాజరవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఎవరికి వారు తామే ఎమ్మెల్యే అభ్యర్థులమని చెప్పుకొంటుండటం పార్టీ శ్రేణులను ఇరకాటంలో పడేశాయి. మహేశ్వరంలో.. ఇది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. మంత్రి సబితా రెడ్డి గతంలో ఇక్కడి నుంచే పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత అధికారపార్టీలో చేరారు. ఆమెతో పాటే కేడర్ కూడా చాలా వరకు పార్టీని వీడింది. నియోజకవర్గ ఇన్చార్జి అంటూ ఇప్పటి వరకు ఎవరూ లేరు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి, సీనియర్ నాయకుడు దేప భాస్కర్‌రెడ్డి నియో జకవర్గంలో కలియతిరుగుతున్నారు. ఇద్దరి మధ్య పెద్దగా సయోధ్య లేనప్పటికీ సభ్యత్వ నమోదులో ఎవరికి వారే పోటీపడ్డారు. నియోజకవర్గంలో నా యకత్వ లోపం స్పష్టంగా కన్పిస్తోంది. ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో నిరాదరణకు గురైన కార్యకర్తలను కలుపుకొని వెళ్తే కానీ పార్టీ నిలబడలేని పరిస్థితి. చేవెళ్లలో.. మొదటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుంది. గతంలో ప్రస్తుత మంత్రి సబితారెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా తొలుత ఇదే పార్టీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన అధికార టీఆర్ఎస్లో చేరారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌కు అభిమానులు ఉన్నప్పటికీ.. నియోజవర్గస్థాయిలో కలుపుకొని వెళ్లే నేతలు లేకపోవడం పారీ్టకి మైనస్‌గా మారింది. ఇక్కడ ఉన్న లీడర్లు ఎవరికి వారే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజా సమస్యలపై ఆందోళనలు నిర్వహిస్తూ ఓటర్లకు పార్టీ కార్యకర్తలకు చేరువయ్యే ప్రయత్నం ఏ ఒక్కరూ చేయడం లేదనే విమర్శలున్నాయి. షాద్‌నగర్‌లో.. మాజీ ఎమ్మెల్యే చోళపల్లి ప్రతాప్‌రెడ్డి అధికారపార్టీలో చేరడంతో ఆయనతో పాటే కేడర్ కూడా కొంత వరకు ఆ పార్టీని వీడింది. ప్రస్తుతం నియోజకవర్గంలో వీర్లపల్లి శంకర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. ఆయనకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసమీకరణలో ఆయన ఇతరులకంటే ముందున్నారనే గుర్తింపు ఉంది. అంతర్గతంగా నెలకొన్న వర్గ విభేదాలు పార్టీకి నష్టదాయకంగా మారాయి. కల్వకుర్తిలో.. నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఇన్చార్జి అంటూ లేరు. గతంతో పోలీస్తే ప్రస్తుతం పార్టీ బలహీనపడింది. మాజీ ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులై, ఢిల్లీకే పరిమితం కావడంతో లీడర్లు అందుబాటులో లేకుండా పోయారు. కడ్తాల్ మినహా ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల మండలాల్లో పార్టీ అస్తవ్యస్తంగా తయారైంది. మాడ్గుల ఎంపీపీ, జెడ్పీడీసీలిద్దరూ కాంగ్రెస్ నుంచే గెలిచినా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదనే విమర్శ లేకపోలేదు. ఆ నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి.. ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు బలమైన కేడర్ ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సుధీర్‌రెడ్డి ఆ తర్వాత పార్టీని వీడి అధికార టీఆర్ఎస్లో చేరడంతో ఆయనతో పాటే కొంత కేడర్ వెళ్లిపోయింది. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జి కూడా ప్రజా సమస్యలపై పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఓటర్లు, కేడర్‌ను కలుపుకెళ్లే నేత లేకపోవడం పార్టీకి మైనస్ పాయింట్. ఇక రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా చెప్పుకొంటున్న నలుగురు లీడర్లు మినహా క్షేత్రస్థాయిలో పారీ్టకి పెద్దగా పట్టు లేదు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. -
నడి రోడ్డు మీద బీజేపీ నేతల కుమ్ములాట
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ బీజేపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయి చేరాయి. నడి రోడ్డు మీదే బీజేపీ నేతలు ఘర్షనకు దిగారు. తార్నాక డివిజన్ అధ్యక్షుడు రాముపై శారదా మల్లేష్ దాడి చేశారు. దీంతో నేతలిద్దరు రోడ్డుపైనే ఘర్షణకు దిగారు. ఒకరినొకరు దూషించుకుంటూ హంగామా చేశారు. ఈ పంచాయితీ కాస్త బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఇంటికి చేరింది. ఇరువర్గాల కార్యకర్తలు భారీగా రామచంద్రరావు ఇంటికి చేరుకున్నారు. తార్నాక డివిజన్ లాలాపేట్‌లో జరిగిన బీజేపీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో తార్నాక డివిజన్ అధ్యక్షుడు రాము ప్రోటోకాల్ ప్రకారం తనను స్టేజీపైకి ఆహ్వానించలేదనే కోపంతోనే శారదా మల్లేష్ ఆ దాడికి దిగినట్లు తెలుస్తోంది. -
తమ్ముళ్లు తలోదారి
సాక్షి, ప్రతినిధి కడప : ఈ ఏడాది ఎన్నికల్లో జనమిచ్చిన తీర్పుతో చావు దెబ్బతిన్న జిల్లా టీడీపీ ఇప్పటికీ కోలుకోలేకపోయింది. ఎన్నికలనంతరం అంతర్గత విభేదాలతో పార్టీ మరింత పతనావస్థకు చేరింది. పార్టీలో కీలక భూమిక పోషించిన సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డి అధికారం అనుభవించి పార్టీని వదిలి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మరోపక్క అధికారికంగా పార్టీని వీడని మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, కె.విజయమ్మ తదితరులు మౌనముద్ర దాల్చారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వీరు నేడోరేపో పార్టీని వీడతారన్న ప్రచారంసాగుతోంది. మరికొందరు పార్టీలో ఉన్నా కార్యక్రమాలు పట్టనట్టు ఉంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అరకొరగా నేతలు కొనసాగుతున్నా అంతర్గత విబేధాలు పతాక స్థాయికి చేరాయి. కొందరు రోడ్డెక్కి మరీ పరస్పర ఆరోపణలుకు దిగుతున్నారు. పార్టీ పరువును బజారుకీడ్చుతున్నారు. రెండవ శ్రేణి క్యాడర్‌తోపాటు కార్యకర్తలు ఎప్పుడో పార్టీకి దూరమయ్యారు. పార్టీకోసం త్యాగం చేసిన వారిని అధినేత చంద్రబాబు పట్టించుకోకుండా ఓట్లులేని సీఎం రమేష్‌ను నెత్తి కెత్తుకోవడం, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గా గెలిచిన ఆదినారాయణరెడ్డిని తెచ్చి మంత్రిని చేయడం వల్లే జిల్లాలో పార్టీకి ఈ గతి పట్టిందని పలువురు నేతలు బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. చంద్రబాబు వైఖరే జిల్లాలో ఆ పార్టీని భ్రష్టు పట్టిందన్నది వారివాదన. దీనికితోడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమం, అభివృద్ది పాలన జనరంజకంగా సాగుతుండడంతో జిల్లా టీడీపీ నేతలకు ఎటూ పాలు పోవడం లేదు. పార్టీలో ఉన్నా ప్రయోజనం లేదని నిర్ణయానికి వచ్చేశారు. ఉన్న కొద్దిపాటి క్యాడర్ చేజారడంతో పార్టీ మనుగడ ›ప్రశ్నార్థకంగా మా రింది. ఇప్పటికే గ్రామ, మండల స్థాయి నేతలు పెద్ద ఎత్తున ఆ పార్టీని వీడి వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే స్థానిక ఎన్నికల నాటికి మిగిలిన వారు కూడా వీడే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే జిల్లాలో టీడీపీ కనుమరుగేనన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఈ నేపథ్యంలో చంద్రబాబు మంగళవారం నిర్వహించే నియోజకవర్గ సమీక్షల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని పార్టీలో లోలోపల వినిపిస్తున్న వ్యాఖ్య. ఇదీ నియోజకవర్గాల పరిస్థితి.. జమ్మలమడుగు: 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదినారాయణరెడ్డి తర్వాత నైతిక విలువలకు తిలోదకాలిచ్చి టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డితో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. తాను కడప పార్లమెంటుకు పోటీచేశారు. వీరి అనైతిక కలయికను జీర్ణించుకోలేని ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో రామసుబ్బారెడ్డిని.. కడప పార్లమెంటు ఓటర్లు ఆదినారాయణరెడ్డిని ఘోరంగా ఓడించారు. ఆదినారాయణరెడ్డి పార్టీని వీడి షెల్టర్ జోన్ బీజేపీలో చేరారు. రామసుబ్బారెడ్డి టీడీపీ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. క్యాడర్ అందుబాటులో ఉన్నా పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదు. ఇసుక ఆందోళన లోనూ ఆయన పాల్గొనలేదు. ఎమ్మెల్సీ శివనాథరెడ్డి పేరుకు టీడీపీలో ఉన్నా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కమలాపురం: వరుస ఓటముల నేపథ్యంలో గత ఎన్నికల తర్వాత కమలాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డి టీడీపీ కార్యక్రమాల్లో హుషారుగా పాల్గొనడం లేదు. గతంలో ప్రతినెల పార్టీ క్యాడర్‌తో వరుస సమావేశాలు నిర్వహించి యాక్టివ్‌గా ఉండే ఈయన గత ఎన్నికల తర్వాత రెండు నెలల క్రితం ఒక్కసారి మాత్రమే ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి అసెంబ్లీ ఎన్నికల నుండి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. మైదుకూరు: మైదుకూరులో ఓటమి పాలైన పుట్టా సుధాకర్‌యాదవ్ ఇప్పుడు ఆ పార్టీ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. హైదరాబాదులో నివాసముండే సుధాకర్‌యాదవ్ ఎన్నికల తర్వాత ఒకటి, రెండుమార్లు మాత్రమే నియోజకవర్గానికి వచ్చారు. మొక్కుబడిగా ప్రెస్మీట్లు పెట్టి వెళ్లిపోయారు. రెండవ శ్రేణి టీడీపీ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ప్రొద్దుటూరు: మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి గత ఎన్నికల నుండి టీడీపీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. టిక్కెట్ ఆశించి భంగపడ్డ ఈయన అధిష్ఠానంతోపాటు నిన్న మొన్నటి వరకు టీడీపీలో కొనసాగిన సీఎం రమేష్‌పై భారీ విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. పార్టీ మారుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. చంద్రబాబు సోమవారం జిల్లాకు వచ్చినా వరదరాజులరెడ్డి సమావేశానికి హాజరు కాలేదు. వరదరాజులరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డిల మధ్య వర్గ విబేధాలు ఉన్నాయి. ఓటమి పాలైన లింగారెడ్డి ప్రెస్మీట్లు, టీవీ చర్చావేదికలు, ప్రెస్మీట్లకే పరిమితమయ్యారు. పార్టీ కార్యక్రమాలు అంతంత మాత్రమే. రెండవ శ్రేణి, కార్యకర్తలు ఆ పార్టీకి దూరమయ్యారు. బద్వేలు: గత ఎన్నికల్లో, అంతకుముందు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన విజయజ్యోతిని కాదని రాజశేఖర్‌కు టీడీపీ టిక్కెట్ ఇచ్చారు. ఆయన భారీ ఓట్లతేడాతోదారు. రాజశేఖర్‌కు టిక్కెట్ ఇప్పించడంలో కీలకపాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఇప్పుడు ఆ పార్టీకి అంటీముట్టనట్లుగా ఉన్నారు. ఆమె పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. హైదరాబాదుకే పరిమితమయ్యారు. విజ యమ్మ పార్టీ వీడుతారన్న ప్రచారం సాగుతోంది. రాజంపేట: ఓటమి చెందిన బత్యాల చెంగల్రాయులు తిరుపతికే పరిమితమయ్యారు. నియోజకవర్గానికి అడపా దడపా వచ్చి పోతున్నారు. తెలుగు మహిళ జిల్లా అధ్యక్షులు మల్లెల శ్రీవాణి ఆ పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. అంతకుముందున్న మహిళా అధ్యక్షురాలు కూడా టీడీపీని వీడారు.. రెండవశ్రేణి కార్యడర్తోపాటు కార్యకర్తలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. రైల్వేకోడూరు: ఎన్నికల్లో పోటీ చేసిన నరసింహాప్రసాద్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు చేతిలో ఓటమి చెందారు. దివంగత చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ అల్లుడైన నరసింహాప్రసాద్ తిరుపతికే పరిమితమయ్యారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న విశ్వనాథనాయుడు స్వంత వ్యాపారాలకే పరిమితమయ్యారు. ఉన్న అరకొర నేతలు, కార్యకర్తలు పార్టీకి దూరమయ్యారు. పులివెందుల: టీడీపీకి వరుస ఓటములు తప్పలేదు. సతీష్‌రెడ్డికి టిక్కెట్ ఇచ్చినా క్యాడర్ ఐక్యతతో పనిచేసే పరిస్థితి లేదు. ఉన్న అరకొర మంది నేతల్లో వర్గ విబేధాలు ఉన్నాయి. ఆదిపత్య పోరుతో టీడీపీ క్యాడర్ చెల్లాచెదురైంది. గత ఎన్నికల్లో ఓటమితో ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో రెండవ శ్రేణి క్యాడర్ నుండి కార్యకర్త వరకు ఆ పార్టీ ఊసు ఎత్తే పరిస్థితి లేదు. కడప: కడపలో గత ఎన్నికల్లో అమీర్‌బాబుకు టీడీపీ టిక్కెట్ ఇవ్వగా, వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎస్బీ అంజద్‌బాష చేతిలో పరాజయం పాలయ్యారు. అమీర్‌బాబుతో సుభాన్‌భాష తో సహా పలువురు టీడీపీ నేతలకు సఖ్యత లేదు. ఎన్నికల తర్వాత పార్టీలో వర్గ విబేధాలు రోడ్డున పడ్డాయి. పలు సమావేశాల్లోనూ అమీర్‌బాబు వ్యతిరేకవర్గం ఆయనను నిలదీసింది. దీంతో రెండవశ్రేణి నాయకులు పార్టీకి దూరమయ్యారు. పార్టీ కార్యక్రమాలు సైతం జిల్లాకేంద్రంలో నామమాత్రంగా జరగడం లేదు. రాయచోటి: రాయచోటిలో రమేష్‌రెడ్డికి టీడీపీ టిక్కెట్ ఇవ్వడంతో ఆ పార్టీకి పాత కాపులైన పాలకొండ్రాయుడు వర్గం దాదాపు దూరమైంది. పాలకొండ్రాయుడు కుమారుడు ప్రసాద్‌బాబు, ఆయన వర్గం టీడీపీకి దూరమైంది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. సోమవారం చంద్రబాబు వర్గం వారు దూరంగా ఉన్నారు. పాలకొండ్రాయుడు వర్గం పార్టీ వీడుతారన్న ›ప్రచారం సాగుతోంది. -
కొవ్వూరు టీడీపీలో వర్గ విభేదాలు
-
అవినీతి మంత్రి మాకొద్దంటూ టీడీపీ నేతల ర్యాలీ
సాక్షి, పశ్చిమ గోదావరి: జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గం టీడీపీలో నెలకొన్న వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య కుమ్ములాట రోడ్డుకెక్కింది. స్థానిక టీడీపీ నేతలు.. మంత్రి జవహర్ అనుకూల వర్గం, వ్యతిరేక వర్గంగా విడిపోయారు. టీడీపీ అధిష్టానం జవహర్‌కు టికెటు కేటాయించవద్దంటూ ఆయన వ్యతిరేక వర్గం బుధవారం భారీ ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగా అవినీతి మంత్రి మాకొద్దంటూ జవహర్‌కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు. జవహర్ నుంచి పార్టీని రక్షించాలని డిమాండ్ చేశారు. కొవ్వూరు పట్టణంతో పాటు రూరల్ గ్రామాల్లో జవహర్‌కు వ్యతిరేకంగా బైక్ ర్యాలీలు చేపడుతున్నారు. జవహర్ వ్యతిరేక వర్గానికి కొవ్వూరు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సూరపునేని రామ్మోహన్రావు, సీనియర్ నాయకులు ఉప్పులూటి నారాయణరావు నాయకత్వం వహిస్తున్నారు. జవహర్‌కు టికెట్ కేటాయిస్తే పార్టీ దారుణంగా ఓడిపోతుందని హెచ్చరిస్తున్నారు. కాగా, మంగళవారం రోజున ప్రజా దీవెన యాత్ర పేరుతో జవహర్ అనుకూల వర్గం ర్యాలీ నిర్వహించింది. అందులో జవహర్ కూడా పాల్గొన్నారు. అయితే నిన్న జవహర్ చేపట్టిన ర్యాలీకి వ్యతిరేకంగానే ఆయన వ్యతిరేక వర్గం నేతలు ఈ ర్యాలీ చేపట్టినట్టుగా తెలుస్తోంది. -
టీడీపీలో తెరపైకి మరో వివాదం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా అధికార పార్టీలో రోజుకో కొత్త వివాదం తెరపైకి వస్తోంది. ఇప్పటికే అలకలు, అసంతృప్తులతో, నియోజక వర్గాల్లో నేతలు, కార్యకర్తల మధ్య పెరిగిన దూరం, అంతర్గత విభేదాలతో సతమవుతున్న తరుణంలో తాజాగా ‘జోడు పదవుల’ జగడం తెరపైకి వచ్చింది. ఓ వర్గం టీడీపీ నగర అధ్యక్షుడు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి హవాకు చెక్ పెట్టేందుకు జోడు పదవుల వివాదాన్ని రగిల్చారు. టీడీపీ నగర అధ్యక్షుడిగా ఆనం జయకుమార్‌రెడ్డిని నియమించటానికి కసరత్తు పూర్తయింది. అయితే ఇదే తరుణంలో జిల్లాలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మొదలుకొని కీలక నేతలు అనేక మంది జోడు పదవుల సవారీ చేస్తున్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గురువారం జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరగనున్న క్రమంలో ఈ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. జిల్లా టీడీపీలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి.నారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో పాటు మరి కొంత మంది నేతలు జోడు పదవుల సవారీ చేస్తున్నారు. అటు పార్టీలో క్రియాశీలక పదవులతో పాటు ఇటు అధికారిక పదవుల్లోనూ ఉన్నారు. నాలుగేళ్ల అధికారిక పాలన తర్వాత ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాపై దృష్టి సారించారు. అది కూడా పార్టీలో అంతర్గత విభేదాలు తార స్థాయికి చేరటం, నిత్యం నియోజకవర్గాల్లో గందరగోళం నెలకొన్న పరిస్థితుల్లో నియోజకవర్గాల వారీగా సమీక్షలు, పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్యలతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల కర్తవ్యబోధ చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక మంది నేతలు నేరుగా చంద్రబాబు నాయుడు వద్ద పార్టీలో ప్రాధాన్యం, ఇతర అంశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పార్టీ వేదికపైనే నేతల తీరును తూర్పార బట్టారు. పార్టీ ప్రాధాన్యం లేదనే కారణంతో పార్టీ మారటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో టీడీపీ నేతలు ఆనం కుటుంబంలో చీలిక తీసుకు వచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఆనం సోదరుల్లో ఒకరైన ఆనం జయకుమార్‌రెడ్డిని నగర టీడీపీ అధ్యక్ష పదవిని ఆఫర్ చేసింది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం జయకుమార్‌రెడ్డి సీఎం చంద్రబాబునాయుడిని కలిశారు. మరికొద్ది రోజుల్లో జయకుమార్‌రెడ్డిని నగర అ«ధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది. కోటంరెడ్డినే ఎందుకు తప్పిస్తున్నాంటే... నగర టీడీపీలో లెక్కకు మించి గ్రూప్‌లు ఉన్నాయి. నెల్లూరురూరల్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డికి రూరల్‌లోని గ్రామాలతో పాటు నగరంలో సగం డివిజన్లు నియోజకవర్గ పరిధిలో ఉంటాయి. నగరంపై మంత్రులు సోమిరెడ్డి, నారాయణ ఎవరికి వారుగానే పట్టు సాధించటానికి కొంత కాలంగా వర్గ రాజకీయలను కొనసాగిస్తున్నారు. వీరిలో పాటు నుడా చైర్మన్ కోటంరెడ్డి కూడా నగరంలో పట్టు కోసం కసరత్తు చేస్తున్నారు. వీరందరి పోరుతో ప్రాధాన్యం విషయంలో నేతల మధ్య తరచూ బేధాభిప్రాయాలు వస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఆనం కుటంబానికి పార్టీ పరంగా ప్రాధాన్యం ఇస్తే నగరంలో పార్టీ పరిస్థితి కొంత మెరుగు అవుతుందనేది ముఖ్యుల ఆలోచన. దీంతో మాజీ మంత్రి ఆదాల, మరి కొందరు నేతలు ఆనం జయకుమార్‌రెడ్డి పేరు తెరపైకి తీసుకువచ్చారు. అయితే ఆనం వివేకానందరెడ్డి మరణించక ముందు వరకు కూడా ఆనం కుటంబానికే నగర అధ్యక్ష పగ్గాలు అప్పగించటానికి ప్రయత్నాలు సాగాయి. అయితే ఆనం కుటుంబానికి వాస్తవంగా చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి హామీ ఇచ్చి దానిని నిలుపుకోకపోవటంతో ఆనం వర్గంలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ క్రమంలో ఆనం సోదరుల్లో ఒకరినైనా పార్టీలో కొనసాగేలా చేసి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని హడావుడి చేస్తున్నారు. దీంతో జోడు పదవుల వ్యవహరం పేరుతో 2011 నుంచి నగర అధ్యక్షుడిగా ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని మార్చాలని నిర్ణయించారు. గత ఏడాది ఆయనకు నుడా చైర్మన్ పదవి రావటంతో దాన్ని కారణంగా చూపుతున్నారు. అయితే కోటంరెడ్డి వర్గీయులు పార్టీ మాట శిరోధార్యం అని చెబుతున్నప్పటికీ నియామకాన్ని ముందు నుంచే వ్యతిరేకిస్తున్నారు. ఇద్దరు మంత్రులకు రాష్ట్ర పార్టీ పదవులు, ఎమ్మెల్సీగా ఉన్న బీద రవిచంద్రకు జిల్లా పగ్గాలు కొనసాగిస్తుండగా నగర అధ్యక్షుడినే ఎందుకు మార్చాలనుకుంటున్నారనే వాదన బలంగా వినిపిస్తున్నారు. అయితే అంతర్లీనంగా ‘ఆనం’కు కాకుండా పార్టీలో సీనియర్ నేత మరొకరిని ఎంపిక చేస్తే బాగుంటుదనే డిమాండ్ బలంగా వినిపిస్తున్నారు. మొత్తం మీద పదవులు ఖరారు దశ నుంచే అధికార పార్టీలో వివాదాలు కొనసాగటం విశేషం. -
మాచర్లలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఫైటింగ్!
మాచర్ల: గుంటూరు జిల్లా మాచర్లలో తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు యాదంటి మల్లికార్జునరావుపై తెలుగు యువత విభాగానికి చెందిన నాయకుడు లచ్చయ్య చౌదరి వర్గం దాడి చేసింది. గతకొద్దికాలంగా అంతర్గత విభేధాలు ఉన్నాయని, అయితే వీరిద్దరి గ్రూపుల మధ్య రేషన్ షాపుల కేటాయింపు మరింత చిచ్చు పెట్టిందని ఆపార్టీకి చెందిన నేతలే అంటున్నారు. ఇటీవల యాదంటి అనుచరులకే రేషన్ షాపులు కేటాయించడంపై ఘర్షణ తీవ్రస్థాయికి చేరుకుంది. దాంతో లచ్చయ్య వర్గం యాదంటిపై దాడి చేసినట్టు సమాచారం. తనపై దాడి చేశారంటూ జిల్లా ఉపాధ్యక్షుడు యాదంటి పోలీసులకు ఫిర్యాదు చేశారు.