సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ పరిస్థితి జిల్లాలో ‘హస్త’వ్యస్తంగా తయారైంది. ఒకప్పుడు ఆ పార్టీకి కంచుకోటలా ఉన్న జిల్లా ప్రస్తుతం చిన్నాభిన్నమైంది. క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ ఉన్నప్పటికీ.. లీడర్ల మధ్య అంతర్గత విభేదాలు దెబ్బతీస్తున్నాయి. మహేశ్వరం, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నంలో పార్టీకి మంచి పట్టు ఉన్నప్పటికీ స్థానిక నేతల్లో అంతర్గత విభేదాలు వెంటాడుతున్నాయి. ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్‌కు మినహా మిగిలిన నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలు లేకపోవడంతో కీలకమైన సమయంలో కేడర్‌ను సమన్వయం చేయలేకపోతున్నారు. ప్రజా సమస్యలపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపునకు జిల్లా అధ్యక్షుడు సహా ఒకరిద్దరు నేతలు మాత్రమే స్పందిస్తున్నారు.
చదవండి👉: గవర్నర్ వ్యవస్థను దుర్మార్గంగా మార్చేశారు: సీఎం కేసీఆర్
ఇబ్రహీంపట్నంలో..
జిల్లాలోని ఇతర నియోజకవర్గాలతో పోలీస్తే ఇక్కడ క్షేత్రస్థాయిలో కేడర్ బలంగా ఉంది. ఆదిబట్ల, తుర్కయంజాల్, పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలు ఆ పార్టీ అభ్యర్థులే గెలుచుకున్నారు. మంచాల, అబ్దుల్లాపూర్‌మెట్ జెడ్పీటీసీలు సహా అబ్దుల్లాపూర్‌మెట్ ఎంపీపీ కూడా ఆ పార్టీ అభ్యర్థే. ఇక్కడి నాయకులు రెండు వర్గాలుగా చీలిపోవడం తీరని నష్టాన్ని తెచ్చిపెడుతోంది. వీరిలో మల్‌రెడ్డి బ్రదర్స్ టీపీసీసీ చీఫ్ రేవంత్ వర్గంలో ఉంటే.. మిగిలిన వారు ఎంపీ కోమటిరెడ్డితో టచ్‌లో ఉంటున్నారు. ఒకరు హాజరైన కార్యక్రమానికి మరొకరు గైర్హాజరవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఎవరికి వారు తామే ఎమ్మెల్యే అభ్యర్థులమని చెప్పుకొంటుండటం పార్టీ శ్రేణులను ఇరకాటంలో పడేశాయి.
మహేశ్వరంలో..
ఇది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. మంత్రి సబితా రెడ్డి గతంలో ఇక్కడి నుంచే పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత అధికారపార్టీలో చేరారు. ఆమెతో పాటే కేడర్ కూడా చాలా వరకు పార్టీని వీడింది. నియోజకవర్గ ఇన్‌చార్జి అంటూ ఇప్పటి వరకు ఎవరూ లేరు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి, సీనియర్ నాయకుడు దేప భాస్కర్‌రెడ్డి నియో జకవర్గంలో కలియతిరుగుతున్నారు. ఇద్దరి మధ్య పెద్దగా సయోధ్య లేనప్పటికీ సభ్యత్వ నమోదులో ఎవరికి వారే పోటీపడ్డారు. నియోజకవర్గంలో నా యకత్వ లోపం స్పష్టంగా కన్పిస్తోంది. ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో నిరాదరణకు గురైన కార్యకర్తలను కలుపుకొని వెళ్తే కానీ పార్టీ నిలబడలేని పరిస్థితి.
చేవెళ్లలో..
మొదటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుంది. గతంలో ప్రస్తుత మంత్రి సబితారెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా తొలుత ఇదే పార్టీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన అధికార టీఆర్‌ఎస్‌లో చేరారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌కు అభిమానులు ఉన్నప్పటికీ.. నియోజవర్గస్థాయిలో కలుపుకొని వెళ్లే నేతలు లేకపోవడం పారీ్టకి మైనస్‌గా మారింది. ఇక్కడ ఉన్న లీడర్లు ఎవరికి వారే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజా సమస్యలపై ఆందోళనలు నిర్వహిస్తూ ఓటర్లకు పార్టీ కార్యకర్తలకు చేరువయ్యే ప్రయత్నం ఏ ఒక్కరూ చేయడం లేదనే విమర్శలున్నాయి.
షాద్‌నగర్‌లో..
మాజీ ఎమ్మెల్యే చోళపల్లి ప్రతాప్‌రెడ్డి అధికారపార్టీలో చేరడంతో ఆయనతో పాటే కేడర్ కూడా కొంత వరకు ఆ పార్టీని వీడింది. ప్రస్తుతం నియోజకవర్గంలో వీర్లపల్లి శంకర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. ఆయనకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసమీకరణలో ఆయన ఇతరులకంటే ముందున్నారనే గుర్తింపు ఉంది. అంతర్గతంగా నెలకొన్న వర్గ విభేదాలు పార్టీకి నష్టదాయకంగా మారాయి.
కల్వకుర్తిలో..
నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఇన్‌చార్జి అంటూ లేరు. గతంతో పోలీస్తే ప్రస్తుతం పార్టీ బలహీనపడింది. మాజీ ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులై, ఢిల్లీకే పరిమితం కావడంతో లీడర్లు అందుబాటులో లేకుండా పోయారు. కడ్తాల్ మినహా ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల మండలాల్లో పార్టీ అస్తవ్యస్తంగా తయారైంది. మాడ్గుల ఎంపీపీ, జెడ్పీడీసీలిద్దరూ కాంగ్రెస్ నుంచే గెలిచినా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదనే విమర్శ లేకపోలేదు.
ఆ నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి..
ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు బలమైన కేడర్ ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సుధీర్‌రెడ్డి ఆ తర్వాత పార్టీని వీడి అధికార టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆయనతో పాటే కొంత కేడర్ వెళ్లిపోయింది. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌చార్జి కూడా ప్రజా సమస్యలపై పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఓటర్లు, కేడర్‌ను కలుపుకెళ్లే నేత లేకపోవడం పార్టీకి మైనస్ పాయింట్. ఇక రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా చెప్పుకొంటున్న నలుగురు లీడర్లు మినహా క్షేత్రస్థాయిలో పారీ్టకి పెద్దగా పట్టు లేదు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి.
Comments
Please login to add a commentAdd a comment