ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై కాంగ్రెస్ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయా? కారు దిగాలనుకున్న నేతలు రూట్ మార్చారా? కాంగ్రెస్‌కు హ్యాండిచ్చినట్లేనా? అధికార పార్టీ వ్యూహాలకు హస్తం పార్టీ కంగు తినిందా ? అసలు కారు దిగాలనుకున్న నేతలేవరు ? ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను వారు ఎందుకు కాదనుకుంటున్నారు ?
హైదరాబాద్ మహానగరం చుట్టూ విస్తరించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై పట్టు బిగించాలని కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. కారు పార్టీ ఓవర్ లోడ్ కావడంతో కొందరైనా కిందికి దిగకపోతారా అని ఎదురు చూసింది. ఇప్పటివరకు అంటువంటి సంకేతాలే వచ్చాయి. దీంతో హస్తం పార్టీని పటిష్టం చేసుకోవచ్చని నాయకులు భావించారు. జిల్లాలో అసంతృప్తితో ఉన్న గులాబీ నేతలకు పార్టీ అధినాయకత్వం కారులోనే సర్ధుబాటు చేస్తోంది.
గత కొంతకాలంగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి... కాంగ్రెస్ గూటికి వెళ్తారని ప్రచారం జరిగింది. ఇందుకోసం తెరవెనక మంత్రాంగం భారీగా జరిగిందని కార్యకర్తల గుసగుసలు వినిపించాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై పట్టు జారకుండా.. సీఎం కేసీఆర్ చకచకా పావులు కదిపినట్లు సమాచారం అసంతృప్తితో రగిలిపోతున్న నేతలతో మంత్రి కేటీఆర్ చర్చించారు. అసమ్మతి నేతల రాజకీయ ఉనికికి ఇబ్బంది లేకుండా కేటీఆర్ పరిష్కార మార్గాలను చూపించడంతో వారంతా చల్లబడ్డట్లు ప్రచారం సాగుతోంది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన పట్నం మహేందర్ రెడ్డికి.. బీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. తాండూరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన పైలెట్ రోహిత్ రెడ్డి.. గులాబీ కండువా కప్పుకోవడం.. పట్నం మహేందర్ రెడ్డికి ఇబ్బందికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో పైలెట్ రోహిత్ రెడ్డికే బీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామంతో పట్నం చేసేది లేక కాంగ్రెస్ గూటికి వెళ్తారనే వార్తలు తెరపైకి వచ్చాయి.
అనూహ్యంగా గులబీ పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగి పట్నం మహేందర్‌రెడ్డికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపెట్టడంతో చల్లబడ్డట్లు తెలుస్తోంది. తీగల కృష్ణారెడ్డి 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున మహేశ్వరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ వెంటనే ఆయన కోడలు తీగల అనితారెడ్డికి బీఆర్ఎస్ తరపున జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా అవకాశమిచ్చారు.
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బీఆర్ఎస్ గూటికి చేరి మంత్రి వర్గంలో ఛాన్స్ దక్కించుకున్నారు. సబిత కారెక్కడం.. తీగలకు ఇబ్బందిగా మారింది. తీగల కృష్ణారెడ్డి అనేకమార్లు మంత్రి సబితారెడ్డిపై ఆరోపణలు గుప్పించారు.
చదవండి: బీఆర్‌ఎస్ టికెట్ల లొల్లిలో రాసలీలల ట్విస్ట్!
వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రకటించారు. అసంతృప్తితో ఉన్న తీగల కాంగ్రెస్ కు వెళ్లడం ఖాయమని అందరూ అనుకున్నారు. పార్టీ హైకమాండ్ సర్ది చెప్పడం, తీగలకు ఆల్టర్ నేట్ సొల్యూషన్ చూపెట్టడంతో కారులోనే ఉండాలని ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే గులాబీ పార్టీ అభ్యర్థుల చిట్టా కూడా లీకైంది. కొద్ది రోజుల్లోనే కేసీఆర్ అధికారికంగా అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని చెబుతున్నారు. సర్దుబాట్లన్నీ పూర్తయ్యాకే జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరి జాబితా అధికారికంగా ప్రకటిస్తే గాని కారులో ఉండేదెవరో దిగేదెవరో తేలుతుంది. ప్రస్తుతానికి గులాబీ నేతల మధ్య సర్దుబాట్లు బాగానే ఉన్నా.. ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేస్తారా ? వెన్నుపోట్లు పొడుచుకుంటారా ? అన్నది చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment