తమ్ముళ్లు తలోదారి | Internal Differences In TDP | Sakshi
Sakshi News home page

తమ్ముళ్లు తలోదారి

Published Tue, Nov 26 2019 10:33 AM | Last Updated on Tue, Nov 26 2019 10:39 AM

Internal Differences In TDP - Sakshi

సాక్షి, ప్రతినిధి కడప : ఈ ఏడాది ఎన్నికల్లో జనమిచ్చిన తీర్పుతో చావు దెబ్బతిన్న జిల్లా టీడీపీ ఇప్పటికీ కోలుకోలేకపోయింది. ఎన్నికలనంతరం అంతర్గత విభేదాలతో పార్టీ మరింత పతనావస్థకు చేరింది. పార్టీలో కీలక భూమిక పోషించిన సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డి అధికారం అనుభవించి పార్టీని వదిలి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మరోపక్క అధికారికంగా పార్టీని వీడని మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, కె.విజయమ్మ తదితరులు మౌనముద్ర దాల్చారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వీరు నేడోరేపో పార్టీని వీడతారన్న ప్రచారంసాగుతోంది. మరికొందరు పార్టీలో ఉన్నా కార్యక్రమాలు పట్టనట్టు ఉంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అరకొరగా నేతలు కొనసాగుతున్నా అంతర్గత విబేధాలు పతాక స్థాయికి చేరాయి. కొందరు రోడ్డెక్కి మరీ పరస్పర ఆరోపణలుకు దిగుతున్నారు. పార్టీ పరువును బజారుకీడ్చుతున్నారు. రెండవ శ్రేణి క్యాడర్‌తోపాటు కార్యకర్తలు ఎప్పుడో పార్టీకి దూరమయ్యారు.

పార్టీకోసం త్యాగం చేసిన వారిని అధినేత చంద్రబాబు  పట్టించుకోకుండా ఓట్లులేని సీఎం రమేష్‌ను నెత్తి కెత్తుకోవడం, వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గా గెలిచిన ఆదినారాయణరెడ్డిని తెచ్చి మంత్రిని చేయడం వల్లే జిల్లాలో పార్టీకి ఈ గతి పట్టిందని పలువురు నేతలు బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. చంద్రబాబు వైఖరే జిల్లాలో ఆ పార్టీని భ్రష్టు పట్టిందన్నది వారివాదన. దీనికితోడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమం, అభివృద్ది పాలన జనరంజకంగా సాగుతుండడంతో  జిల్లా టీడీపీ నేతలకు ఎటూ పాలు పోవడం లేదు.  పార్టీలో ఉన్నా ప్రయోజనం లేదని నిర్ణయానికి వచ్చేశారు.  ఉన్న కొద్దిపాటి క్యాడర్‌ చేజారడంతో పార్టీ మనుగడ  ›ప్రశ్నార్థకంగా మా రింది. ఇప్పటికే గ్రామ, మండల స్థాయి నేతలు పెద్ద ఎత్తున ఆ పార్టీని వీడి వైఎస్సార్‌ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే స్థానిక ఎన్నికల నాటికి మిగిలిన వారు కూడా వీడే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే జిల్లాలో టీడీపీ కనుమరుగేనన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఈ నేపథ్యంలో చంద్రబాబు మంగళవారం నిర్వహించే నియోజకవర్గ సమీక్షల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని పార్టీలో లోలోపల వినిపిస్తున్న వ్యాఖ్య.

ఇదీ నియోజకవర్గాల పరిస్థితి..
జమ్మలమడుగు:  2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదినారాయణరెడ్డి  తర్వాత నైతిక విలువలకు తిలోదకాలిచ్చి టీడీపీలో చేరి మంత్రి అయ్యారు.  మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డితో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. తాను కడప పార్లమెంటుకు పోటీచేశారు. వీరి అనైతిక కలయికను జీర్ణించుకోలేని ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో రామసుబ్బారెడ్డిని..  కడప పార్లమెంటు ఓటర్లు ఆదినారాయణరెడ్డిని ఘోరంగా ఓడించారు.  ఆదినారాయణరెడ్డి పార్టీని వీడి షెల్టర్‌ జోన్‌ బీజేపీలో చేరారు.  రామసుబ్బారెడ్డి  టీడీపీ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.  క్యాడర్‌ అందుబాటులో ఉన్నా పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదు. ఇసుక ఆందోళన లోనూ ఆయన పాల్గొనలేదు.  ఎమ్మెల్సీ శివనాథరెడ్డి పేరుకు టీడీపీలో ఉన్నా  పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.

కమలాపురం:  వరుస  ఓటముల నేపథ్యంలో గత ఎన్నికల తర్వాత కమలాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డి టీడీపీ కార్యక్రమాల్లో హుషారుగా పాల్గొనడం లేదు. గతంలో ప్రతినెల పార్టీ క్యాడర్‌తో వరుస సమావేశాలు నిర్వహించి యాక్టివ్‌గా ఉండే ఈయన గత ఎన్నికల తర్వాత రెండు నెలల క్రితం ఒక్కసారి మాత్రమే ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి అసెంబ్లీ ఎన్నికల నుండి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.

 మైదుకూరు:  మైదుకూరులో ఓటమి పాలైన పుట్టా సుధాకర్‌యాదవ్‌ ఇప్పుడు ఆ పార్టీ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. హైదరాబాదులో నివాసముండే సుధాకర్‌యాదవ్‌ ఎన్నికల తర్వాత ఒకటి, రెండుమార్లు మాత్రమే నియోజకవర్గానికి వచ్చారు. మొక్కుబడిగా ప్రెస్‌మీట్లు పెట్టి వెళ్లిపోయారు. రెండవ శ్రేణి టీడీపీ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.

ప్రొద్దుటూరు: మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి గత ఎన్నికల నుండి టీడీపీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ ఈయన అధిష్ఠానంతోపాటు నిన్న మొన్నటి వరకు టీడీపీలో కొనసాగిన సీఎం రమేష్‌పై భారీ విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. పార్టీ మారుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. చంద్రబాబు సోమవారం జిల్లాకు వచ్చినా వరదరాజులరెడ్డి సమావేశానికి హాజరు కాలేదు. వరదరాజులరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డిల మధ్య వర్గ విబేధాలు ఉన్నాయి. ఓటమి పాలైన లింగారెడ్డి ప్రెస్‌మీట్లు, టీవీ చర్చావేదికలు, ప్రెస్‌మీట్లకే పరిమితమయ్యారు. పార్టీ కార్యక్రమాలు అంతంత మాత్రమే. రెండవ శ్రేణి, కార్యకర్తలు ఆ పార్టీకి దూరమయ్యారు.

బద్వేలు: గత ఎన్నికల్లో, అంతకుముందు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన విజయజ్యోతిని కాదని రాజశేఖర్‌కు టీడీపీ  టిక్కెట్‌ ఇచ్చారు. ఆయన భారీ ఓట్లతేడాతోదారు. రాజశేఖర్‌కు టిక్కెట్‌ ఇప్పించడంలో కీలకపాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఇప్పుడు ఆ పార్టీకి అంటీముట్టనట్లుగా ఉన్నారు. ఆమె పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. హైదరాబాదుకే పరిమితమయ్యారు. విజ యమ్మ పార్టీ వీడుతారన్న ప్రచారం సాగుతోంది.

రాజంపేట:  ఓటమి చెందిన బత్యాల చెంగల్రాయులు తిరుపతికే పరిమితమయ్యారు. నియోజకవర్గానికి అడపా దడపా వచ్చి పోతున్నారు. తెలుగు మహిళ జిల్లా అధ్యక్షులు మల్లెల శ్రీవాణి ఆ పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. అంతకుముందున్న మహిళా అధ్యక్షురాలు కూడా టీడీపీని వీడారు.. రెండవశ్రేణి కార్యడర్‌తోపాటు కార్యకర్తలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.

రైల్వేకోడూరు: ఎన్నికల్లో పోటీ చేసిన నరసింహాప్రసాద్‌ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు చేతిలో ఓటమి చెందారు. దివంగత చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్‌ అల్లుడైన నరసింహాప్రసాద్‌ తిరుపతికే పరిమితమయ్యారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న విశ్వనాథనాయుడు స్వంత వ్యాపారాలకే పరిమితమయ్యారు. ఉన్న అరకొర నేతలు, కార్యకర్తలు పార్టీకి దూరమయ్యారు.

పులివెందుల:   టీడీపీకి వరుస ఓటములు తప్పలేదు. సతీష్‌రెడ్డికి టిక్కెట్‌ ఇచ్చినా క్యాడర్‌ ఐక్యతతో  పనిచేసే పరిస్థితి లేదు. ఉన్న అరకొర మంది నేతల్లో వర్గ విబేధాలు ఉన్నాయి. ఆదిపత్య పోరుతో టీడీపీ క్యాడర్‌ చెల్లాచెదురైంది. గత ఎన్నికల్లో ఓటమితో ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో రెండవ శ్రేణి క్యాడర్‌ నుండి కార్యకర్త వరకు ఆ పార్టీ ఊసు ఎత్తే పరిస్థితి లేదు.

కడప:    కడపలో గత ఎన్నికల్లో అమీర్‌బాబుకు టీడీపీ టిక్కెట్‌ ఇవ్వగా, వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఎస్‌బీ అంజద్‌బాష చేతిలో పరాజయం పాలయ్యారు. అమీర్‌బాబుతో సుభాన్‌భాష తో సహా పలువురు టీడీపీ నేతలకు సఖ్యత లేదు. ఎన్నికల తర్వాత పార్టీలో వర్గ విబేధాలు రోడ్డున పడ్డాయి. పలు సమావేశాల్లోనూ అమీర్‌బాబు వ్యతిరేకవర్గం ఆయనను నిలదీసింది. దీంతో రెండవశ్రేణి నాయకులు పార్టీకి దూరమయ్యారు. పార్టీ కార్యక్రమాలు సైతం జిల్లాకేంద్రంలో నామమాత్రంగా జరగడం లేదు.

రాయచోటి:   రాయచోటిలో రమేష్‌రెడ్డికి టీడీపీ టిక్కెట్‌ ఇవ్వడంతో ఆ పార్టీకి పాత కాపులైన పాలకొండ్రాయుడు వర్గం దాదాపు దూరమైంది. పాలకొండ్రాయుడు కుమారుడు ప్రసాద్‌బాబు, ఆయన వర్గం టీడీపీకి దూరమైంది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. సోమవారం చంద్రబాబు వర్గం వారు దూరంగా ఉన్నారు.  పాలకొండ్రాయుడు వర్గం పార్టీ వీడుతారన్న ›ప్రచారం సాగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement