రాజకీయపార్టీల్లో సైద్ధాంతిక ఆచరణ విధానం లోపించడం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని అంటున్నారు జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి. చట్టాల్లోని నిర్దేశిత సూత్రాలు వాస్తవ రాజకీయ ముఖచిత్రంలో కనిపించడం లేదని, ఎన్నికల్లో డబ్బు ఎరచూపి, పౌరుల హక్కులపై పార్టీలు దాడి చేయడం దుర్మార్గమన్నారు. పార్టీలిచ్చే పోటీ వాగ్దానాలు వేలం పాటలను తలపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. సంక్షేమం పేదవాడి అభ్యున్నతికి వెన్నుపూసలాంటిదని చెప్పారు.
మితిమిరిన హామీలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే కుదేలు చేస్తాయన్నారు. హామీల చక్రబంధంలో ఇరుక్కున్న ప్రజలు మేల్కోవాలని పిలుపునిచ్చారు. న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం పనిచేసిన నేపథ్యం ఆయనది. ఏపీఈఆర్‌సీ చైర్మన్‌గా విద్యుత్‌రంగాన్ని గాడిలో పెట్టిన అనుభవం ఆయన సొంతం. ఎన్నికల వేళ ‘సాక్షి’తో ఆయన అనేక అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఏమన్నారో ఆయన మాటల్లోనే...
ఆ సిద్ధాంతాలేవి?
అన్ని పార్టీల సిద్ధాంతాలు ఘనంగా ఉంటాయి. కానీ, అవన్నీ నేతల ఆచరణలో కనిపించకపోవడం విడ్డూరం. ఎన్నికల వ్యయాన్నే తీసుకోండి. దీనికి పరిమితి ఉంది కదా? ఏ పార్టీ నాయకుడైనా నిర్దేశించిన పరిమితిలోనే ఖర్చు చేస్తున్నారా? లేనే లేదు. విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. అలా చెయ్యకపోతే గెలవలేరు. అసలీ విషయంపై ఎవరూ మాట్లాడరేం? చట్ట విరుద్ధమని తెలిసినా మౌనంగా ఉంటారేం? తమ ఆకాంక్షలకు తగ్గవారిని ఎన్నుకోవడం ప్రజల హక్కు.
ఈ హక్కును డబ్బుతో ముడిపెడుతున్నారు. ఇది రానురాను దిగజారుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో నాయకుడు చెప్పినంత ఇవ్వలేదని ఓ గ్రామంలో ప్రజలు ధర్నా చేశారు. ఇది దౌర్భాగ్య పరిస్థితి కాదంటారా? ప్రజల నైతికతను డబ్బు అనైతికంగా కొనేస్తోందనడానికి ఇదే సాక్ష్యం. ఈ విషయంలో ప్రజలు జాగృతం కావాలి. డబ్బులకు ప్రలోభ పడొద్దు. ఓటును బలమైన ఆయుధంగానే భావించాలి.
వేలం వెర్రి హామీలు
అన్ని పార్టీలూ పోటీపడి హామీలిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే వేలం వెర్రిగా గుప్పిస్తున్నాయి. ఇది ఓ రకంగా ప్రజలను మోసం చేయడమే. అలవి కాని హామీలు ఎలా నెరవేరుస్తారు? గెలవడమే పార్టీలకు గీటురాయిగా మారింది. పార్టీల మేనిఫెస్టోకు ఎలాంటి చట్టబద్ధత ఉండదు. అందుకే ఇచ్చే హామీలు ఒకలా ఉంటాయి. అమలు వేరోలా ఉంటాయి. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలకు సవాలక్ష షరతులు పెడతారు.
లబ్దిపొందే వారి సంఖ్యను భారీగా కుదిస్తారు. దీన్ని మోసం కాదంటారా? 20 ఏళ్లక్రితం ఇలాంటి పరిస్థితి చాలా తక్కువ. ఇప్పుడే విపరీతమైన పరిస్థితి. హామీలివ్వడం నేతలకు అలవాటైంది. వాటికోసం ఎదురుచూడటం ఓటర్లకు రివాజు అయ్యింది. అంతిమంగా ప్రజలు హామీల చక్రబంధంలో ఇరుక్కుంటున్నారు. మితిమీరిన హామీలిస్తే ఆర్థిక పరిస్థితి ఎంత దెబ్బతింటుందనేది ఆలోచించడం లేదు. మోసపూరిత హామీలను నమ్మొద్దు.
పవర్ పాలిటిక్స్ మంచిది కాదు..
విద్యుత్ అంశం రాజకీయ ఆయుధమైంది. ఈ విషయంలో అన్ని పార్టీలూ పోటీ పడుతున్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించేకు ప్రయత్నిస్తున్నాయి. జనం వాస్తవాలు తెలుసుకునే అవకాశమే ఇవ్వడం లేదు. ఈ నేరం ముమ్మాటికీ రాజకీయ పార్టీలదే. 1969లో పరిశ్రమలకు యూనిట్‌కు 10 పైసల విద్యుత్ ఉండేది. కానీ వ్యవసాయానికి 11 పైసలుండేది. ఉచిత విద్యుత్ తెచ్చింది దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఇప్పుడు అన్ని పార్టీలూ వ్యవసాయ విద్యుత్‌ను రాజకీయ అస్త్రం చేసుకుంటున్నాయి. ఇవ్వొచ్చు. తప్పులేదు.
విద్యుత్ చట్టం ప్రకారం వాడే విద్యుత్‌ను లెక్కగట్టాలి. ఈ పని జరగకుండా నేతలు రాజకీయం చేస్తున్నారు. రైతులకు ఇచ్చే ఉచిత విద్యత్‌ను డిస్కమ్‌లకు ప్రభుత్వాలు ముందే చెల్లించాలి. అప్పుడే డిస్కమ్‌లు ఆర్థికంగా బాగుంటాయి. దీన్ని పక్కనబెడుతున్నారు. మీటర్లు.. మోటర్ల రాజకీయంతో ప్రజలను కరెంట్ వాస్తవాలు తెలియకుండా పక్కదారి పట్టిస్తున్నారు. మీటర్లు పెడితే తమ ఉచిత హక్కు హరించేస్తారనే భయం కల్పిస్తున్నారు. ఈ పాలిటిక్స్ మంచిది కానేకాదు.
యువతకు ఉపాధి కల్పన పార్టీల ఎజెండా కావాలి
ప్రభుత్వ ఉద్యోగాలు ఇక కలే. దీన్ని యువత గుర్తించేలా అన్ని పార్టీలు అవగాహన కల్పించాలి. ఉపాధి కల్పన పార్టీల ఎజెండా కావాలి. హైదరాబాద్ మౌలిక వసతుల కల్పనలోనూ మెరుగ్గా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉపాధి అవకాశాలు పెంచాలి. పరిశ్రమలు విస్తరించేలా చూడాలి. అన్నింటికన్నా ముందు విద్యావ్యవస్థలో మార్పు తేవాలి. పోటీ ప్రపంచంలో నెగ్గుకొచ్చే నైపుణ్యం అవసరం. ఇది విద్యార్థి దశ నుంచే జరగాలి.
చదువుకునేటప్పుడే ఏదో ఒక నైపుణ్యం కల్పించాలి. అమెరికాలోనైతే విద్యార్థి ఆసక్తిని గుర్తిస్తారు. అందులో మొదట్నుంచీ శిక్షణ ఇస్తారు. పార్టీలకతీతంగా యువతలో ‘సైంటిఫిక్ టెంపర్‌మెంట్’ తీసుకురావాలి. ఇందులో విజయవంతమయ్యే ప్రభుత్వాలే యువతను తమ వెంట ఉంచుకోగలవు. ఓటు ప్రతి ఒక్కరి ఆయుధం. సమాజానికి పనికొచ్చే వారిని గుర్తించి మరీ ఓటు వేయాలి. అప్పుడే రాష్ట్రానికి మేలు జరుగుతుంది.
-వనం దుర్గాప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment