సాక్షి, అమరావతి: ‘మాది పరిశ్రమలకు అనుకూల ప్రభుత్వం. రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తాం.. మన పిల్లలకే ఉద్యోగాలు ఇస్తాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విస్పష్టంగా ప్రకటించారు. పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని గర్వంగా చెబుతున్నామన్నారు. మా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టండి.. మా పిల్లలకు పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇవ్వండి అని మాత్రమే తిరిగి కోరుతామని తమ ప్రభుత్వ విధానాన్ని వెల్లడించారు. స్థానికులకు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు కల్పించే బిల్లుపై శాసనసభలో బుధవారం జరిగిన చర్చలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని ఇలా ప్రసంగించారు.
స్థానికుల సమ్మతితోనే పారిశ్రామికీకరణ
‘ఈ చట్టం తేవడం వల్ల పారిశ్రామికీకరణ ఆగిపోతుందని, పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు పడతారని, పరిశ్రమలు రావని, ఉన్నవి మూతపడతాయని కొన్ని రోజులుగా టీడీపీతోపాటు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా దుష్ప్రచారం చేస్తోంది. ఈ సందర్భంగా నేను రెండు విషయాలపై స్పష్టత ఇవ్వదలిచాను. పాదయాత్రలో ప్రజల సమస్యలను పూర్తిగా ఆకళింపు చేసుకున్నాను. అందుకే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలనే బిల్లును తీసుకువచ్చాం. ఫ్యాక్టరీలు పెట్టేటప్పుడు స్థానిక ప్రజలను మభ్యపెడతారు. భూములు తీసుకుంటారు. ఆ తరువాత అక్కడ ఉన్న వాళ్లకు ఉద్యోగాలు మాత్రం ఇవ్వరు. ఉద్యోగాలు ఇవ్వాలని అక్కడి రాజకీయ నాయకులు అడిగితే పట్టించుకోరు. పైగా ఆ రాజకీయ నాయకుడు వారి పార్టీ తరఫున పోరాటం చేయడానికి వచ్చారని ముద్ర వేస్తారు. ఇంకా వ్యతిరేక ప్రభుత్వం ఉంటే వారిపై తిరిగి కేసులు పెట్టడం కూడా మనం చూశాం.
ఫ్యాక్టరీలు రావడం వల్ల ఎంతో కొంత కాలుష్యం వస్తుంది. పర్యావరణానికి ఇబ్బంది వస్తుంది. కాలుష్యం ఎక్కువా తక్కువా అన్నది ఫ్యాక్టరీని బట్టి ఆధారపడి ఉంటుంది. స్థానికులు దాన్ని అంగీకరించే పరిస్థితి ఉండాలి. అప్పుడే అభివృద్ధి జరుగుతుంది. మన రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు. చదువులు పూర్తి చేసి, డిగ్రీలు చేతికి వచ్చాక మన పిల్లలు ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్లాల్సి వస్తోంది. అక్కడా ఉద్యోగాలు లేకపోతే దుబాయ్, కువైట్ పోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితి పోవాలి. అందుకు మనం ఓ అడుగు ముందుకు వేస్తేనే పరిశ్రమలు వస్తాయి. ఉద్యోగాలు ఇస్తామంటేనే స్థానికులు పరిశ్రమలు రావడానికి, భూములు ఇవ్వడానికి అంగీకరిస్తారు.
పార్లమెంటు నియోజకవర్గానికో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్
ప్రభుత్వమే స్థానికులకు శిక్షణ ఇచ్చి మరీ పరిశ్రమలకు అవసరమైన నిపుణులను అందిస్తుంది. అందుకోసం ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓ ఇంజనీరింగ్ కాలేజీని ఎంపికచేసి అందులో ఓ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం. కలెక్టర్ నేతృత్వంలో బృందం పరిశ్రమల యజమానులతో మాట్లాడి ఎలాంటి శిక్షణ ఇవ్వాలన్నది నిర్ణయిస్తుంది. దాని ప్రకారం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను తీర్చిదిద్దుతాం. ఆ నియోజకవర్గ పరిధిలో పెట్టే పరిశ్రమల్లో పనిచేసేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంచుతాం. పరిశ్రమలకు మూడేళ్లు గడువు ఇస్తున్నాం. ఈ మూడేళ్లలో అందరం కలిసి మన పిల్లలను నిపుణులుగా తయారు చేసుకుందాం.
స్థానికులు నిర్వచనం ఇలా..
‘స్థానికులు’ అనే అంశాన్ని ఈ బిల్లులో సరిగ్గా నిర్వచించాం. పరిశ్రమలు పెట్టేందుకు ఎక్కడైతే భూములు తీసుకుంటారో ఆ భూములకు సంబంధించిన వారిని మొదటి ప్రాధాన్యత కింద స్థానికులు అని చెప్పాం. అక్కడ పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యం కలిగిన మానవవనరులు దొరక్కపోతే ‘స్థానికత’ పరిధి మరింత పెరుగుతుంది. చుట్టుపక్కల ఊళ్లు కూడా వచ్చి మండల స్థాయికి చేరుతుంది. అక్కడా తగిన నైపుణ్యం ఉన్న వారు పూర్తిగా దొరక్కపోతే జిల్లా స్థాయికి పెరుగుతుంది. అక్కడా దొరక్కపోతే రాష్ట్ర స్థాయికి పెరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో కూడా దొరకని పరిస్థితి అయితే ఉండదు.
గర్వంగా చెబుతున్నా..ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు
ఈ రాష్ట్రంలో లంచాలు ఉండవని గర్వంగా చెబుతున్నాను. పరిశ్రమలు పెట్టాలంటే ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రతి పారిశ్రామికవేత్తకూ చెబుతున్నాను. ఉన్నతస్థాయిలో ఎవ్వరూ లంచాలు అడగరు. కిందిస్థాయిలో కూడా లంచాలు లేని వ్యవస్థను తీసుకువస్తున్నాం. మా ప్రభుత్వ విధానం అంతా పారదర్శకంగా ఉంటుంది. పరిశ్రమల ఏర్పాటుకు అన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పరిశ్రమలు పెట్టండి.. మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండని మాత్రమే తిరిగి కోరుతున్నాం. దాంతో అందరికీ అంతా మంచే జరుగుతుంది’ అని సీఎం పేర్కొన్నారు.
పీపీఏల సమీక్షతో పరిశ్రమలకే ప్రయోజనం
విద్యుత్ కొనుగోలు ఒప్పందా(పీపీఏ)లపై ఇటీవల కాలంలో టీడీపీ నానా ప్రచారం చేసింది. పీపీఏలను పునఃపరిశీలిస్తున్నామని, దాంతో ఆంధ్రప్రదేశ్‌కు పారిశ్రామికవేత్తలు ఎవరూ రారని, విద్యుత్తు ఉత్పత్తి సంస్థలకు బ్యాంకులు రుణాలు ఇవ్వవని దుష్ప్రచారం చేస్తోంది. మేము వేసే ప్రతి అడుగు పారిశ్రామికీకరణకు అనుకూలమేనని స్పష్టం చేస్తున్నాం. ప్రభుత్వం ప్రైవేటు విద్యుత్తు సంస్థల నుంచి తాను కరెంటు కొనుగోలు చేసే ధర కంటే కొంచెం ఎక్కువ వేసుకుని తిరిగి ఆ కరెంటును పరిశ్రమలకు అమ్ముతుంది. అలా వచ్చే డబ్బును వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వడానికి, ఇతర రాయితీలకు ఖర్చు చేస్తాం. దీన్నే క్రాస్ సబ్సిడీ అంటారు. ప్రభుత్వం ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి ఎక్కువ ధరకు కరెంటు కొంటే దానిపై మరికొంత లాభం వేసుకుని మరీ పరిశ్రమలకు అమ్మాల్సి ఉంటుంది. దాంతో పరిశ్రమలకు అమ్మే కరెంటు రేటు పెరుగుతుంది. అలాంటప్పుడు మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు ఎవరు ముందుకు వస్తారు? తక్కువ ధరకు కరెంటు వస్తోందని వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతారు. అందుకే మనం పరిశ్రమలకు అనుకూలంగా ప్రతి అడుగు వేస్తున్నాం. ప్రభుత్వం తక్కువ ధరకు కరెంటు కొంటే పరిశ్రమలకు కూడా తక్కువ ధరకు కరెంటు ఇవ్వగలం. అందుకే పీపీఏలను సమీక్షించాలని నిర్ణయించాం. మన రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి. మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నదే ప్రభుత్వ విధానం.
Comments
Please login to add a commentAdd a comment