ముంబై: కార్యాలయ ఉద్యోగుల నియామకాలు (వైట్ కాలర్) జూన్ నెలలో 3 శాతం తక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా ఐటీ, బీఎఫ్‌ఎస్‌ఐ, తయారీ రంగాలు నియామకాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించినట్టు మానవ వనరుల ప్లాట్‌ఫామ్ ‘ఫౌండిట్’ ఓ నివేదిక విడుదల చేసింది. ఐటీలో 19 శాతం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగంలో 13 శాతం, గృహోపకరణాల రంగంలో 26 శాతం, తయారీ రంగంలో 14 శాతం మేర నియామకాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చినప్పుడు తగ్గాయి.
వీటిల్లో కొన్ని రంగాలు నియామకాల విషయంలో మే నెలతో పోల్చిచూసినప్పుడు కాస్త మెరుగైన పనితీరు చూపించాయి. నెలవారీగా జాబ్ పోస్టింగ్‌ల డేటా ఆధారంగా ఫౌండిట్ ఇన్‌సైట్స్ ట్రాకర్ (గతంలో మాన్‌స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్) ఈ వివరాలు ప్రకటించింది. ఈ ఏడాది మే నెలతో పోలిస్తే కార్యాలయ ఉద్యోగుల నియామకాలు జూన్ నెలలో 2 శాతం పెరిగాయి. హెల్త్‌కేర్‌లో 11 శాతం, బీపీవోలో 7 శాతం, తయారీలో 5 శాతం, లాజిస్టిక్స్‌లో 9 శాతం మేర నియామకాల్లో వృద్ధి కనిపించింది.
ముఖ్యంగా మెట్రోల్లో 3 శాతం మేర అధిక నియామకాలు నమోదయ్యాయి. టైర్–2 పట్టణాల్లో 2 శాతం మేర క్షీణత కనిపించింది. 0–2 ఏళ్ల అనుభవం ఉన్న ఫ్రెషర్లకు డిమాండ్ నెలకొనగా, మేనేజ్‌మెంట్ ఉద్యోగుల నియామకాలు 4 శాతం పెరిగాయి. 11–15 ఏళ్ల అనుభవం కలిగి సీనియర్ ఉద్యోగుల నియామకాలు ఒక శాతం, 7–10 ఏళ్ల అనుభవం ఉన్న విభాగంలో 2 శాతం, 4–6 ఏళ్ల అనుభవం కలిగిన విభాగంలో 2 శాతం మేర అధిక నియామకాలు నమోదయ్యాయి.
రానున్న త్రైమాసికంలో మెరుగు..
‘‘మేము ట్రాక్ చేస్తున్న మెజారిటీ రంగాల్లో నియామకాల్లో సానుకూల ధోరణి కనిపించడం ప్రోత్సాహకరంగా అనిపించింది. హెల్త్‌కేర్, తయారీ, ఐటీలోనూ కొంత మేర నియామకాలు పుంజుకున్నాయి. రానున్న త్రైమాసికంలో నియామకాలు మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నాం. కంపెనీలు తమ నైపుణ్య అవసరాలను తిరిగి సమీక్షించుకోనున్నాయి’’అని ఫౌండిట్ సీఈవో శేఖర్ గరీష తెలిపారు. నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకోవడం, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మార్పును స్వీకరించడం అనేవి ప్రస్తుత మార్కెట్ వాతావరణంలో ఉద్యోగంలో రాణించేందుకు అవసరమని సూచించారు.
ఐటీ రంగంలో కూడా తగ్గాయంటున్న నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్
కార్యాలయ ఉద్యోగుల నియామకాలు (వైట్ కాలర్) జూన్ నెలలో మూడు శాతం తగ్గినట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ సర్వేలో తేలిసింది. ఐటీ, రిటైల్, బీపీవో, ఎడ్యుకేషన్, ఎఫ్‌ఎంసీజీ, ఇన్సూరెన్స్ నియామకాల విషయంలో అప్రమ్తత ధోరణి వ్యవహరించడమే ఇందుకు కారణంగా ఉంది. ముఖ్యంగా ఐటీ రంగంలో గణనీయంగా తగ్గాయి. జూన్ నెలలో 2,795 ఉద్యోగాలకు పోస్టింగ్‌లు పడ్డాయి. 2022 జూన్ నెలలో ఇవి 2,878గానే ఉన్నాయి.
ఇక ఈ ఏడాది మే నెల నియామకాలతో పోల్చి చూసినా జూన్‌లో 2 శాతం తగ్గాయి. నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ ప్రతి నెలా ఉద్యోగ మార్కెట్ ధోరణులు, నియామకాల వివరాలను విడుదల చేస్తుంటుంది. కార్యాలయ ఉద్యోగ మార్కెట్ దీర్ఘకాలం తర్వాత నిర్మాణాత్మక మార్పును చూస్తున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. ప్రధానంగా ఈ ఉద్యోగాలకు మెట్రో పట్టణాలు కీలక చోదకంగా ఉంటున్నట్టు గుర్తు చేసింది. రియల్ ఎస్టేట్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, బీఎఫ్‌ఎస్‌ఐ ఎక్కువ ఉద్యోగాలకు కల్పించినట్టు నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ వెల్లడించారు.
ఐటీలో ఆందోళనకరం
ఐటీ రంగంలో నియామకాల ధోరణి ఇప్పటికీ ఆందోళనకరంగా ఉన్నట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. గతేడాది జూన్ నెలతో పోల్చిచూసినప్పుడు, ఈ ఏడాది జూన్‌లో ఐటీ నియామకాలు 31 శాతం తక్కువగా నమోదైనట్టు వివరించింది. అన్ని రకాల ఐటీ కంపెనీల్లోనూ ఇదే ధోరణి కనిపించినట్టు తెలిపింది. సాఫ్ట్‌వేర్ డెవలపర్స్, సిస్టమ్ అనలిస్టులకు డిమాండ్ క్షీణత కొనసాగినట్టు వెల్లడించింది. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఏఐ స్పెషలిస్ట్‌ల నియామకాలు సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో బుల్లిష్ ధోరణి కొనసాగిందని, జూన్‌లో కొత్త ఉద్యోగ నియామకాలు ఈ రంగంలో క్రితం ఏడాది ఇదే మాసంతో పోల్చినప్పుడు 40 శాతం పెరిగాయని పేర్కొంది.
పెద్ద ఎత్తున రిఫైనరీ సామర్థ్యాల విస్తరణ, దేశీయ డిమాండ్ అవసరాలను చేరుకునేందుకు కంపెనీల వ్యూహాలు నియామకాలకు మద్దతునిస్తున్నట్టు వివరించింది. ఫార్మా రంగంలో నియామకాలు 14 శాతం పెరిగాయి. ఆటోమొబైల్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్‌లోనూ నియామకాల గణాంకాలు సానుకూలంగా ఉన్నాయి. అత్యధికంగా అహ్మదాబాద్‌లో కార్యాలయ ఉద్యోగ నియామకాలు జూన్‌లో 23 శాతం వృద్ధి చెందాయి. వదోదరలో 14 శాతం, జైపూర్‌లో స్థిరంగా ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment