హిందువులు ఆదర్శపురుషునిగా భావించే శ్రీరామునిపై మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత డాక్టర్ జితేంద్ర అవద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని షిర్డీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) నేత డాక్టర్ జితేంద్ర అవద్ మాట్లాడుతూ శ్రీరాముడు శాకాహారి కాదని, మాంసాహారేనని అన్నారు. 14 ఏళ్ల పాటు అడవిలో వనవాసం ఉన్న వ్యక్తి శాకాహారం కోసం ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. ఇది నిజమో కాదో ప్రజలే గ్రహించాలన్నారు.
దేశ స్వాతంత్ర్యం గురించి ప్రస్తావించిన ఆయన ఎవరెన్ని చెప్పినా గాంధీ, నెహ్రూల కారణంగానే మనకు స్వాతంత్య్రం వచ్చిందన్నది వాస్తవమన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ నేత గాంధీజీ ఓబీసీ అనే విషయాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌వారు గుర్తుంచుకోవాలన్నారు. గాంధీజీ హత్యకు అసలు కారణం కులతత్వమేనని జితేంద్ర అవద్ వ్యాఖ్యానించారు.
త్వరలో జరిగే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ముందు కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో వివాదం తలెత్తింది. 31 ఏళ్ల క్రితం రామమందిర ఆందోళనల్లో పాల్గొన్న శ్రీకాంత్ పూజారిని తాజాగా అరెస్ట్ చేయడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని బీజేపీ ఆరోపించింది. అయితే ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని, రామాలయ ప్రారంభోత్సవానికి ముందు ఇలా అరెస్ట్ చేయడం యాదృచ్ఛికమేనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
శ్రీకాంత్ పూజారి మద్యం అక్రమ విక్రయాలు, జూదంతో సహా 16 సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని సీఎం తెలిపారు. అలాంటి వారిని అరెస్టు చేయకపోతే రాముడు కూడా క్షమించడని పేర్కొన్నారు. ఇదిలావుండగా ఇటీవల సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర కూడా కొత్త వివాదం సృష్టించారు. భారత్ హిందూ దేశంగా మారితే అది ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్‌లా మారుతుందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment