రాజకీయ పార్టీ అన్నాక దానికో అధినేత ఉండాలి, కార్యకర్తలూ ఉండాలి. పార్టీకో సిద్ధాంతం, మేనిఫెస్టో వంటివి ఉండాలి. ఓటర్లను ఆకర్షించడం ఆషామాషీ పని కాదు. కాకలు తీరిన నేతలే ఒక్కోసారి బోల్తా పడతారు. అలాంటి అధినేతతో పనిలేని ఒక వింత రాజకీయ పార్టీ ఇటీవల డెన్మార్క్‌లో ప్రారంభమైంది. కృత్రిమ మేధ సూచనలతో పనిచేసే ఈ రాజకీయ పార్టీకి ‘డేనిష్ సింథటిక్ పార్టీ’ అని నామకరణం చేశారు.
‘మైండ్ ఫ్యూచర్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ ‘కంప్యూటర్ లార్స్’ ద్వారా సృష్టించిన కృత్రిమ మేధతో ఈ ఏడాది మే నెలలో కొత్త రాజకీయ పార్టీని– అదే డేనిష్ సింథటిక్ పార్టీని ప్రకటించింది. ఈ ఏడాది జరగనున్న డెన్మార్క్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కృత్రిమ పార్టీ పోటీకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.
డెన్మార్క్ ఎన్నికల్లో 1970ల నాటి నుంచి పోటీ చేస్తున్నా, ఇంతవరకు ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయిన చిల్లర రాజకీయ పార్టీల సిద్ధాంతాలన్నింటినీ వడగట్టి, ప్రోగ్రామ్ చేయడం ద్వారా ‘మైండ్ ఫ్యూచర్ ఫౌండేషన్’ ఈ కొత్త కృత్రిమ పార్టీకి రూపునిచ్చింది. ఎన్నికల్లో ఏనాడూ ఓటు వేయని 20 శాతం డెన్మార్క్ ఓటర్లకు ప్రత్యామ్నాయంగా ఉద్భవించడమే కాకుండా, పార్లమెంటులో కృత్రిమ మేధకు ప్రాతినిధ్యాన్ని దక్కించుకోవాలని ఈ పార్టీ ఉవ్విళ్లూరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment