
సాక్షి, చైన్నె : ‘నా గుండెల్లో గూడు కట్టుకున్న ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు’ అని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ వ్యాఖ్యానించారు. ఆయన ఇటీవల తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారంతా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కసరత్తుల్లో నిమగ్నమయ్యారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం విజయ్ రాష్ట్ర పర్యటనకు సైతం సిద్ధమవుతున్నారు. అదే సమయంలో విజయ్ రాజకీయ ప్రవేశంపై పలు పార్టీ నేతలు, సినీ రంగ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు స్పందించారు. శుభాకాంక్షలు తెలుపుతూ ఆహ్వానం పలికారు.
వీరందరికీ కృతజ్ఞతలు తెలిపే విధంగా విజయ్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడి హోదాలో తొలిసారి విజయ్ ఈ ప్రకటనను చేశారు. ఇందులో ‘నా గుండెల్లో గూడు కట్టుకుని ఉన్న అభిమానులు, శ్రేయోభిలాషులు అందరికీ అంటూ వ్యాఖ్యలను విజయ్ మొదలెట్టారు. తమిళ ప్రజల అశేషాభిమానం, పిలుపు మేరకే కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటన చేశానని గుర్తు చేశారు. ఈ సందర్భంగా తనను ఆదరించే విధంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. తన రాజకీయ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తోడ్పాటు అందిస్తున్న మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
అభిమాన నీరాజనం
పార్టీని ప్రకటించిన విజయ్‌కు అడుగడుగునా అభిమానులు నీరాజనాలు పడుతున్నారు. పుదుచ్చేరిలోని ఓ ప్రాంతంలో ఆయన తాజా చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సమాచారంతో తమిళనాడు, పదుచ్చేరి నుంచి వేలాదిగా అభిమానులు ఆ షూటింగ్ ప్రాంతం వద్దకు ఆదివారం సాయంత్రం పోటెత్తారు. ఎటు చూసినా జనం అన్నట్లుగా అభిమానులు చేరడంతో ఆ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో దీంతో షూటింగ్‌కు విరామం ఇచ్చి అక్కడున్న ఓ బస్సు మీదకు వచ్చి అభిమానులను పలకరించారు. అయితే అభిమానుల తాకిడి భారీగా పెరగడంతో గట్టి భద్రత నడుమ ఆయన అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లి పోయారు.
Comments
Please login to add a commentAdd a comment