అప్పుడేం చేశారు..?  ఇప్పుడేం చేస్తారు?  గల్లీ ప్రశ్నిస్తోంది..! | Gully people are questioning political parties during elections | Sakshi
Sakshi News home page

అప్పుడేం చేశారు..?  ఇప్పుడేం చేస్తారు?  గల్లీ ప్రశ్నిస్తోంది..!

Published Sun, Oct 22 2023 3:39 AM | Last Updated on Sun, Oct 22 2023 3:39 AM

Gully people are questioning political parties during elections - Sakshi

సాక్షి హైదరాబాద్‌: నగరంలో ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. ప్రధాన పార్టీలు సమరభేరి మోగించి కదన రంగంలో ప్రచారస్త్రలను సంధిస్తున్నాయి. సభలు, సమావేశాలు, భారీ ప్రదర్శనలు సమరోత్సాహంతో ఉన్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏళ్లకు ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధికి, సంక్షేమానికి నోచుకోని ఓటర్లు కూడా  తమ వద్ద ఉన్న ఏకైక  పాశుపతాస్త్రాన్ని సంధించేందుకు  సన్నద్ధమవుతున్నారు.

మౌలిక సమస్యలపై నిలదీసేందుకు, ప్రశ్నించేందుకు బస్తీ సంక్షేమ సంఘాలు సరికొత్త ప్రశ్నావళితో ముందుకొస్తున్నాయి. బస్తీలు, మురికివాడల్లో నివసించే  ప్రజలను కేవలం ఓటు బ్యాంకులుగా భావించే పార్టీల  ధోరణి మారాలంటున్నాయి. స్థానిక నాయకులు మొదలుకొని బరిలోకి దిగిన అభ్యర్థుల వరకు బస్తీల్లోకొచ్చే వారిపై ఈ ప్రశ్నిస్త్రాలను సంధించనున్నారు. 

బస్తీలపై వివక్ష ఎందుకు?  
బస్తీలు అంటే వెంటనే గుర్తుకొచ్చేది కంకర తేలిన సిమెంట్‌ రోడ్లు, ఇరుకు గల్లీలు. ఒకదానికొకటి అతికించినట్లుగా ఉండే  అగ్గిపెట్టెల్టాంటి ఇళ్లు. వాటిని ఆనుకొని నురగలు కక్కుతూ ప్రవహించే నాలాలు. ముక్కుపుటాలదిరే దుర్గంధం గుర్తుకొస్తుంది. దోమల స్వైరవిహారం కళ్ల మందు కనిపిస్తుంది. ఫుట్‌పాత్‌లు, పేవ్‌మెంట్‌లను ఆశ్రయించుకొని జీవనం సాగించే చిరువ్యాపారులు కనిపిస్తారు. దశాబ్దాలుగా అనేకసార్లు ఎన్నికలొచ్చాయి.

కానీ బస్తీ ముఖచిత్రం మారలేదు. మరోసారి ఎన్నికలు వచ్చాయి. అన్ని గల్లీల్లో ఇప్పుడు పార్టీల జెండాలు ఎగురుతున్నాయి. మైకుల్లో  ప్రచారం హోరెత్తుతోంది. నాయకులు హామీలు గుప్పిస్తున్నారు. ఈ హామీలు అప్పుడు, ఇప్పుడు, భవిష్యత్‌లోనూ ఉంటాయని  బస్తీవాసులకు తెలుసు. అందుకే ‘గత ఎన్నికల్లో  ఓటేస్తే  ఏం చేశారు. ఇప్పుడు  ఓటెందుకు వేయాలి’ అనే  మౌలికమైన ప్రశ్నతో వివిధ పార్టీల నాయకులను నిలదీసేందుకు  బస్తీ సంఘాలు, కాలనీ సంఘాలు  సన్నద్ధమవుతున్నాయి.  

గ్రేటర్‌లో సుమారు 1,500కు పైగా మురికి వాడలు, బస్తీలు ఉన్నాయి. లక్షలాది మంది నివసించే  ఈ మురికివాడలే అన్ని  రాకీయ పార్టీలకు ప్రధాన ఓటుబ్యాంకులు. బాధ్యతగా ఓటు వేసేది కూడా వాళ్లే. ఈ నేపథ్యంలో అనేక సంవత్సరాలుగా బస్తీ ప్రజల  సమస్యల పరిష్కారం కోసం, వారి నివాస హక్కుల  కోసం పోరాడుతున్న హైదరాబాద్‌ బస్తీ ప్రజల సమాఖ్య  వివిధ పార్టీల అభ్యర్థులపై  ఈ అ్రస్తాలను సంధిస్తోంది. ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ఎమ్మెల్యే  కావాలి? అని హైదరాబాద్‌ బస్తీ ప్రజల సమాఖ్య ప్రతినిధి బ్రదర్‌ వర్గీస్‌ అన్నారు.  

ఇప్పటి వరకు ఏం చేశారు? 
స్థానిక సమస్యల పట్ల ప్రజల్లో  చైతన్యం తెచ్చేందుకు  బస్తీసంఘాలు విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. కరపత్రాలను పంపిణీ చేస్తున్నాయి. ఇప్పటి వరకు గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు బస్తీల్లో పర్యటించారు. ఏయే సమస్యలను పరిష్కరించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలేంటి అనే  అంశాలపై చర్చిస్తున్నారు. బస్తీ  ప్రజలు ఎదుర్కొంటున్న  సమస్యలపై ఎమ్మెల్యేలకు ఏ మేరకు అవగాహన ఉందనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని బస్తీ సంఘాలు భావిస్తున్నాయి. డబుల్‌బెడ్రూం ఇళ్ల మంజూరుపైనా ప్రశ్నించనున్నారు. 

ఈ ప్రశ్నలకు బదులేదీ?

  • బస్తీల్లో  ప్రచారానికి వచ్చే నాయకులను, పార్టీలను నిలదీసేందుకు  బస్తీ సంఘాలు  సిద్ధం చేస్తున్న  ప్రశ్నావళి ఇలా ఉంది.  
  • బస్తీ ప్రజల ఉపాధి కోసం  ఎలాంటి అవకాశాలు కల్పిస్తారు. ఎప్పటి వరకు ఇళ్లు కట్టించి ఇస్తారు. బ్యాంకుల నుంచి రుణసదుపాయం కల్పిస్తారా? 
  • వర్షాకాలంలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి మీ వద్ద ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి. బస్తీలు నీటమునగకుండా  ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు?  
  • నగరంలో  నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో పేదప్రజలకు ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు మీరు సిద్ధమేనా? 
  • బస్తీల్లోని యువతను నిర్విర్యం చేసేందుకు మోహరించి ఉన్న  మాదకద్రవ్యాల అమ్మకాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? 
  • నాలాలను కబ్జా చేసిన వాళ్లను, బస్తీల్లో  ప్రజలపై దౌర్జన్యం చేసే వారిని కట్టడి చేయగలరా? 
  • వరదల నివారణకు ఎలాంటి కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తారు? 
  • వివిధ రకాల  అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం మంజూరు చేసే నిధులను పారదర్శకంగా ప్రజల ముందు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారా? 
  • గత ఎన్నికల్లో మీ పార్టీ ఇచ్చిన హామీలు గుర్తున్నాయా? ఇప్పుడు కొత్తగా ఎలాంటి  హామీలు ఇస్తున్నారు? హామీలను నిలబెట్టుకోలేని పార్టీలకు ఓటెందుకు వేయాలి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement