సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ ఆర్టీసీకి మంచి బేరం దొరుకుతోంది. ఆర్టీసీ బస్సుల బుకింగ్ రాజకీయ పార్టీలకు మంచి వెసులుబాటుగా ఉంటుండగా, సంస్థకు సైతం లాభసాటిగా మారుతోంది. గత నెల రోజుల వ్యవధిలోనే రాజకీయ పార్టీలు తమ సభలకు దాదాపు 12 వేల వరకు బస్సులను బుక్ చేసుకున్నాయి.
భలే మంచి ఆదాయ మార్గం..
ఆర్టీసీ బస్సులకు పండుగ రోజులు, శుభ ముహూర్తాలున్న రోజుల్లోనే ఆక్యుపెన్సీ రేషియో మెరుగ్గా ఉంటుంది. మిగతా రోజుల్లో సగటున 62 శాతం నుంచి 65 శాతం వరకు ఉంటుంది. అయితే, రాజకీయ సభలకు బస్సులను అద్దెకిస్తే మంచి ఆదాయం వస్తుంది. వారికి అద్దెకిచ్చిన సమయంలో బస్సుల్లో ఎంతమంది ఎక్కారన్న సంఖ్యతో నిమిత్తం లేకుండా.. 100 శాతం ఆక్యుపెన్సీ రేషియోను లెక్కగడ తారు. అంటే.. ప్రతి సీటుకు టికెట్ జారీ చేసినట్టన్న మాట.
ఈ లెక్కన ఒక్కో బస్సుకు రూ.20 వేల నుంచి 24 వేల వరకు ఆదాయం వస్తుంది. ప్రస్తుతం దసరా పండుగ రద్దీ అధికంగా ఉంది. మరమ్మతుల కోసం డిపోలకే పరిమితమైన బస్సులను కూడా సిద్ధం చేసి ప్రయాణికుల కోసం పంపుతుంటారు. ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో తప్ప, సాధారణ రోజుల్లో వీలైనన్ని బస్సులను అధికారులు పార్టీలకు కేటాయిస్తున్నారు. పార్టీలకు అద్దెకివ్వటం ద్వారా ఆదాయం ఎక్కువగానే వస్తున్నా.. ఆర్టీసీ మాత్రం తొలి ప్రాధాన్యం ప్రయాణికుల సేవకే ఇస్తుండటం విశేషం.
గత నెల కొల్లాపూర్‌లో ముఖ్యమంత్రి పర్యటించిన సందర్భంలో భారీ బహిరంగసభ నిర్వహించారు. దానికి దాదాపు 2 వేల బస్సులను బుక్ చేశారు. ఆ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈనెల మొదటి వారంలో రెండు రోజుల తేడాతో రెండు పర్యాయాలు రాష్ట్రానికి వచ్చారు. ఆ సందర్భంలో మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో భారీ బహి రంగ సభలు నిర్వహించారు. వీటికి దాదాపు రెండు వేల బస్సులను బుక్ చేశారు.
రాహుల్‌గాంధీ ఇటీ వల తెలంగాణ పర్యటనలో నిర్వహించిన సభలకు కూడా ఆర్టీసీ బస్సులను బుక్ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తు న్నారు. ఈ సందర్భంగా సిరిసిల్ల, జడ్చర్ల, భువనగిరి, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేశారు. వీటిల్లో కొన్నింటికి ప్రైవేటు వాహనాలను బుక్ చేస్తే, కొన్నింటికి ఆర్టీసీ బస్సు లను బుక్ చేశారు. ఇటీవల కేంద్రమంత్రులు రాజ్ నాథ్‌సింగ్, అమిత్‌షాలు బహిరంగ సభలు నిర్వ హించారు. గత నెల రోజుల్లో అన్ని పార్టీలు దాదాపు 12 వేలకుపైగా బస్సులను బుక్ చేసుకున్నట్టు సమాచారం.
ఒక్కో బస్‌కు సగటున రూ.20 వేల చొప్పున చెల్లిస్తుండటంతో వీలైనన్ని బస్సులను అద్దెకివ్వటం ద్వారా ఆదాయాన్ని పొందే ప్రయ త్నంలో ఆర్టీసీ ఉంది. దసరా, దీపావళి, క్రిస్‌మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి లాంటి పండుగల వేళ ఎక్కువ మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా ఆ సంస్థ 100 రోజుల ఫెస్టివల్ చాలెంజ్ పేరుతో సిబ్బందికి ప్రత్యేక టార్గెట్‌లను కేటాయించింది. ఇందులో ఎన్నికల అంశాన్ని కూడా చేర్చటం విశేషం. రాజకీయ పార్టీలకు బస్సులను అద్దెకివ్వటం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందాలన్న ఆదేశాలు మౌఖికంగా వెలువడ్డాయి.
పార్టీలకు కూడా సౌలభ్యమే..
పెద్ద నేతలు పాల్గొన్న బహిరంగ సభలకు పార్టీ నేతలు భారీగా జనాన్ని సమీకరిస్తున్నారు. ఇందుకు వారికి వందల సంఖ్యలో వాహనాలు అవసరమవుతాయి. ప్రైవేటు వాహనాలను సమీకరించుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. అదే ఆర్టీసీ బస్సులయితే కావాల్సినన్ని సిద్ధంగా ఉంటాయి. దీంతో ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకోవటం వారికి వెసులు బాటుగా మారింది. పైగా వ్యాన్లు లాంటి ప్రైవేటు వాహనాల ఖర్చుతో పోలిస్తే, ఆర్టీసీ బస్సుల ఛార్జీనే తక్కువగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment