
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను రాజకీయ విరోధులపైకి ఉసిగొల్పుతోందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని వారు మంగళవారం నూతన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు రాసిన లేఖలో కోరారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని ఈడీ ప్రశిస్తున్న సమయంలో వారీ లేఖ రాయడం గమనార్హం.
ధరల పెరుగుదల, జీఎస్టీ వంటి అంశాలపై తక్షణమే చర్చ చేపట్టాలన్న తమ డిమాండ్‌ను పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తుండటం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై ప్రభావం చూపుతోందని వివరించారు. ఈ లేఖపై కాంగ్రెస్, డీఎంకే, ఎస్‌పీ, ఆప్, ఆర్జేడీ, సీపీఎం నేతలు సంతకాలు చేశారు. ‘చట్టం ముందు అందరూ సమానమే. కానీ, ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీల నేతలకు వ్యతిరేకంగా ఏకపక్షంగా, పక్షపాత ధోరణితో చట్టాలను అమలు చేస్తున్నారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.