investigating agencies
-
కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను రాజకీయ విరోధులపైకి ఉసిగొల్పుతోందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని వారు మంగళవారం నూతన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు రాసిన లేఖలో కోరారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని ఈడీ ప్రశిస్తున్న సమయంలో వారీ లేఖ రాయడం గమనార్హం. ధరల పెరుగుదల, జీఎస్టీ వంటి అంశాలపై తక్షణమే చర్చ చేపట్టాలన్న తమ డిమాండ్‌ను పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తుండటం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై ప్రభావం చూపుతోందని వివరించారు. ఈ లేఖపై కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, ఆప్, ఆర్జేడీ, సీపీఎం నేతలు సంతకాలు చేశారు. ‘చట్టం ముందు అందరూ సమానమే. కానీ, ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీల నేతలకు వ్యతిరేకంగా ఏకపక్షంగా, పక్షపాత ధోరణితో చట్టాలను అమలు చేస్తున్నారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. -
నిఘా నేత్రాల నీడలో...
కనిపించని కళ్ళేవో గమనిస్తున్నాయి. తెలియకుండానే మాటల్నీ, కదలికల్నీ కనిపెడుతున్నాయి. మన చేతిలోని మొబైల్‌ఫోన్ నిజానికి నిఘావాళ్ళ చేతిలో సాధనం. ఈ మాట ఎవరన్నా అంటే, ఉలిక్కిపడతాం. ‘పెగసస్’ అనే నిఘా సాఫ్ట్‌వేర్‌తో దేశంలో ప్రముఖుల ఫోన్లు సుదూరం నుంచే హ్యాకింగ్‌కు గురయ్యాయంటూ ఆదివారం వెలువడ్డ కథనాలు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది అందుకే! ఇజ్రాయెలీ సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘ఎన్ఎస్ఓ గ్రూపు’ నిఘా టెక్నాలజీని విక్రయిస్తుంటుంది. ఆ సంస్థకు చెందిన నిఘా సాఫ్ట్వేర్– ‘పెగసస్’. దాన్ని వినియోగించుకొని, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతల మొదలు ప్రముఖ జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల దాకా అందరి మొబైల్ ఫోన్లపైనా నిఘా పెట్టారనేది తాజా ఆరోపణ. తమ పరిశోధనలో ఆ సంగతి బయటపడిందని ‘వాషింగ్టన్ పోస్ట్’, ‘గార్డియన్’ సహా పలు అంతర్జాతీయ వార్తా సంస్థల కన్సార్టియమ్ వెల్లడించింది. అయితే, ఈ ఆరోపణలు వాస్తవ విరుద్ధమనీ, ఈ స్పైవేర్‌ను ఆయా దేశాల ప్రభుత్వాలకు అమ్ముతామే తప్ప, దాన్ని నిర్వహించట్లేదనీ, డేటా వివరాలు తమకు తెలియవనీ ఇజ్రాయెలీ సంస్థ చెప్పుకొస్తోంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మటుకు ‘పెగసస్’ నిఘా సాయంతో పెద్దయెత్తున సాంకేతిక భద్రతా ఉల్లంఘనలు జరిగినట్టు తమ డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణలో బయటపడినట్టు పేర్కొంటోంది. పరస్పర విరుద్ధ వాదనలతో ఈ వివాదం ఇప్పుడు ప్రపంచవ్యాప్త డిజిటల్ నిఘాపై చర్చ రేపుతోంది. ఈ నిఘా సాఫ్ట్వేర్ ‘పెగసస్’ మాట కొన్నేళ్ళ క్రితమే తొలిసారిగా వినిపించింది. మళ్ళీ ఇప్పుడు తెర మీదకొచ్చింది. 2019లో ఈ స్పైవేర్‌ను చూసి, ఆ ప్రయత్నాలను నిర్వీర్యం చేసినట్టు సాక్షాత్తూ మెసేజింగ్ వేదిక ‘వాట్సప్’ సారథే ఒప్పుకున్నారు. దాదాపు 53 కోట్ల మంది వాట్సప్ వాడుతున్న దేశం మనది. ఆ ఏడాది డిసెంబర్లో సాక్షాత్తూ అప్పటి మన కేంద్ర మంత్రి దేశంలోని అనేక వాట్సప్ ఖాతాల సమాచారం హ్యాకింగ్‌కు గురైనట్టు అంగీకరించడం గమనార్హం. ఈసారేమో సాక్షాత్తూ కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, జలశక్తి మంత్రి ప్రహ్లద్ జోషీ కూడా ఈ స్పైవేర్ బాధితుల జాబితాలో ఉన్నట్టు వార్త. రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా 2019 లోక్‌సభ ఎన్నికల వేళ ఇలాంటి బాధితులే కావచ్చనీ కథనం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిశోధనాత్మక జర్నలిస్ట్‌లకూ, సామాజిక కార్యకర్తలకూ ఈ అవస్థ తప్పలేదు. వాళ్ళందరి డేటా స్పైవేర్ వద్ద ఉన్నట్టు బయటపడిందంటున్నారు కానీ, వారి సమాచారం పూర్తిగా హ్యాకింగ్ అయిందా, లేదా అన్నది తేలాల్సి ఉంది. నిజానికి, ఇంటెలిజెన్స్ బ్యూరో సహా అనేక ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు మన దేశంలో అనుమాని తులపై నిఘా పెట్టే వీలుంది. అధికారిక నిఘా ఏమీ పెట్టలేదని ప్రభుత్వ పెద్దలే చెబుతున్నారు. మరి, ఇప్పుడీ విదేశీ స్పైవేర్‌తో అనధికారికంగా, చట్టవిరుద్ధమైన నిఘా సాగుతోందా అన్నది వెంటనే తలెత్తే ప్రశ్న. దానికి ఇంకా జవాబు రావాల్సి ఉంది. సమాజంలోని ప్రముఖుల ఫోన్లపై తీవ్రవాదుల లాగా ఇలా చట్టవిరుద్ధంగా నిఘా ఏమిటన్నది ప్రతిపక్షాల ప్రశ్న. అలాగే, విదేశీ నిఘావేర్‌ను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వినియోగించిందా, లేదా అనీ విమర్శకులు సూటిగా అడుగుతున్నారు. ఆ ప్రశ్నలు వట్టి అన్యాయమని అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. ఇప్పటికి సుమారు 45 దేశాలు ఈ ‘పెగసస్’ స్పైవేర్‌ను వినియోగిస్తున్నట్టు ఓ లెక్క. కానీ, మోదీ సర్కార్ మాత్రం తాము అలాంటి సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయలేదంటోంది. నిఘా బాధితుల జాబితాలో పేరున్నట్టు వార్తలొచ్చిన సాక్షాత్తూ కేంద్ర ఐటీ శాఖ మంత్రే సోమవారం లోక్‌సభ సాక్షిగా ఈ మొబైల్ నిఘావేర్ వివాదాన్ని కొట్టిపారేయడం గమనార్హం. ‘సంచలనం సృష్టించడమే ఈ ఆరోపణల ధ్యేయం. గతంలోనూ ఇలాంటి ఆరోపణలు చేశారు’ అని ఆయన సభాముఖంగా తేల్చేశారు. ‘సరిగ్గా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం ముందు రోజునే ఓ వెబ్సైట్ ఈ నివేదికను లీక్ చేయడం యాదృచ్ఛికం కాదు’ అని కూడా మంత్రివర్యులు అనడం కొసమెరుపు. ఎవరైనా ఏమైనా ఆరోపణలు చేయవచ్చు. కానీ, వాటికి బలమైన ఆధారాలు ఏవీ అన్నది ప్రభుత్వ, పాలకపక్షాల వాదన. ఆరోపణలకు తగిన ఆధారాలు కోరడం కచ్చితంగా సమంజసమే. దాన్ని తప్పుపట్టలేం. కానీ, తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు వాటిపై సమగ్ర దర్యాప్తు జరపడానికి ఎవరికైనా అభ్యంతరం ఉండనక్కర లేదు. అందులోనూ అధికారంలో ఉన్నవారు చేయాల్సింది అదే కదా! ప్రతిపక్షాలు కోరుతున్నదీ అదే! నిజానిజాల నిగ్గు తేల్చడానికైనా సరే ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే రంగంలోకి దిగాలి. ఒకవేళ ఆరోపణలే గనక నిజమైతే, దేశ పౌరుల ప్రైవేట్ డేటాపై ఇలా విదేశీ నిఘాను ఉపయోగించడం దిగ్భ్రాంతికరం. మరీ ముఖ్యంగా మంత్రులతో సహా పలువురు ప్రముఖుల సంభాషణలు, కాంటాక్ట్ వివరాలు, ఇ–మెయిల్స్, నెట్లో ఏవేం వెతికారనే చరిత్ర, ఫోటోలు, కెమేరా, మైక్రోఫోన్లతో సహా అన్నీ విదేశీ నిఘా నేత్రం కింద ఉన్నాయంటే – అది దేశభద్రతకే పెనుముప్పు. అణుమాత్రమైనా అనుమానం రాకుండా, కనీసం ఆనవాళ్ళయినా లేకుండా తన పని కానిచ్చే ‘పెగసస్’ నిఘా నేత్రం విషయంలో వెంటనే అప్రమత్తం కావాల్సింది కూడా అందుకే! తాజా ఆరోపణలన్నీ భారత ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చే ప్రయత్నమని కేంద్ర మంత్రి అన్నారు కానీ, రేపు ఈ ఆరోపణలే గనక నిజమని తేలితే... ఈ దుర్మార్గపు నిఘా ఏ ప్రజాస్వామ్యానికైనా మాయని మచ్చ అని గ్రహించాలి. ఇప్పటికీ నత్తనడక సాగుతున్న ప్రైవేట్ సమాచార భద్రత బిల్లును ఇకనైనా చట్టం చేయాల్సిన అవసరాన్ని ఇప్పుడిక అందరూ గుర్తించాలి. -
నెట్టింట్లో పోలీస్!
-
కంప్యూటర్లపై దర్యాప్తు సంస్థల నిఘా కన్ను
-
వందలాది సాక్షులు అవసరమా?: సుప్రీం
న్యూఢిల్లీ: దర్యాప్తు సంస్థలు కేసుల విచారణలో భాగంగా లెక్కలేనంత మంది సాక్షులను ఎందుకు విచారిస్తాయోనంటూ సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 2008లో జరిగిన వరుస పేలుళ్ల కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు 1,500 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం దీనిపై స్పందిస్తూ ‘ప్రతి కేసులోనూ కనీసం వంద నుంచి 200 మంది సాక్షులు ఉంటున్నారు. ఇటీవల వచ్చిన ఓ రోడ్డు ప్రమాద కేసులోనూ దాదాపు 200 మంది సాక్షులున్నారు. కానీ వారిలో ఒక్కరు కూడా ప్రత్యక్ష సాక్షి లేరు. ఇంతమంది సాక్షులెందుకో మాకు అర్థం కాదు’ అని వ్యాఖ్యానించింది. -
కంపెనీలకూ బిట్‌కాయిన్ కిక్!
న్యూఢిల్లీ: బిట్కాయిన్లు, ఇతరత్రా వర్చువల్ కరెన్సీలతో మనీలాండరింగ్, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు మళ్లడం వంటి రిస్కులున్నాయి కనక వీటి జోలికి వెళ్లొద్దంటూ వివిధ నియంత్రణ సంస్థలు హెచ్చరిస్తున్నప్పటికీ... ఇన్వెస్టర్లకు మాత్రం క్రిప్టోకరెన్సీలపై మోజు తగ్గడం లేదు. తాజాగా ఔత్సాహిక వ్యాపారవేత్తలు కూడా వర్చువల్ కరెన్సీ బూమ్‌ను తమకు అనుకూలంగా మరల్చుకునేందుకు రంగంలోకి దిగుతున్నారు. తమ సంస్థల పేర్లలో ఎక్కడో ఓచోట బిట్‌కాయిన్ లేదా క్రిప్టో పదాన్ని చేర్చి కంపెనీలను ఆరంభిస్తున్నారు. గత కొన్ని వారాల్లోనే పేరులో ఎక్కడో ఓ చోట బిట్‌కాయిన్ పదం ఉన్న సంస్థలు డజనుకు పైగా పుట్టుకొచ్చాయి. ఈ కోవకే చెందిన మరిన్ని సంస్థల దరఖాస్తులు రిజిస్ట్రార్స్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. ఇక క్రిప్టో అన్న పదాన్ని పేరులో వాడుకుంటున్న కంపెనీల సంఖ్యకు లెక్కే లేదు. ఇంకా కొన్ని సంస్థలు ‘కాయిన్’ అన్న పదానికి దేశం పేరు జోడించి మరింత సృజనాత్మకంగా ‘ఇండికాయిన్’, ‘భారత్కాయిన్’ లాంటి కొత్త పేర్లు సృష్టిస్తున్నాయి. మరో సంస్థ ఇంకాస్త ముందుకెళ్లి ఏకంగా ‘స్వచ్ఛకాయిన్’ పేరు పెట్టుకుంది. కొత్త కంపెనీలు.. డెంటిస్ట్రీ మొదలుకుని సెక్స్ ట్రేడ్ దాకా అన్నింటా క్రిప్టోకరెన్సీలను విస్తరిస్తున్నాయి. ఆడిటర్లు, అకౌంటెంట్ల కథనాల ప్రకారం కొత్తగా వచ్చేవే కాకుండా.. పలు లిస్టెడ్ కంపెనీలు సైతం తమ పేర్లకు, ‘ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్’ నిబంధనల్లోనూ బిట్‌కాయిన్ లేదా ఇతరత్రా క్రిప్టోకరెన్సీలను జోడించుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాయి. వీటి వ్యాపారమేంటంటే.. పేరులో బిట్‌కాయిన్ ఉన్నప్పటికీ.. ఈ కొత్త సంస్థల కార్యకలాపాలు దానితో పొంతన లేకుండా ఉంటున్నాయి. ఆర్వోసీ దగ్గర దరఖాస్తు చేసుకున్న సంస్థల్లో ఒకటి.. రిటైల్ వ్యాపారం, వస్తువుల రిపేర్లు చేసేది కాగా, మరొకటి ఆర్థిక సేవలందించే కేటగిరీకి చెందినది. ఇంకోటి ‘ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం’ను ప్రోత్సహించే సంస్థ కేటగిరీలో దరఖాస్తు చేసుకుంది. ఇక కొన్ని సంస్థలు ప్రపంచవ్యాప్తంగా దంతచికిత్స కోసం ఉపయోగపడే ‘క్రిప్టో కాయిన్స్’ ని అందిస్తామని ప్రచారం చేసుకుంటున్నాయి. వీటితో మధ్యవర్తులకు సంబంధించిన ఖర్చులు తగ్గుతాయని, బీమా క్లెయిమ్‌లు కూడా సులభతరంగా ఉంటాయని చెబుతున్నాయి. ఇవే కాదు.. అడల్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం, సెక్స్ వ్యాపారంలోనూ రహస్యంగా చెల్లింపులు జరిపేందుకు ఉపయోగపడతాయంటూ ‘సెక్స్ కాయిన్స్’ ని కూడా అందించే సంస్థలు మరికొన్ని ఉంటున్నాయి. ఆర్వోసీ దగ్గర నమోదైన పేర్లలో కొన్ని.. బిట్‌కాయిన్ బజార్, బిట్‌కాయిన్ ఎక్సే్చంజ్, బిట్‌కాయిన్ ఫిన్కన్సల్టెంట్స్, బిట్‌కాయిన్ ఇండియా సాఫ్ట్వేర్ సర్వీసెస్, బిట్‌కాయిన్ సర్వీసెస్ ఇండియా, బిట్కాయినర్స్ ఇండియా, బిట్‌కాయిన్స్ ఇండియా, బిట్‌కాయిన్ ఇన్ఫోటెక్ అనే పేర్లతో ఆర్వోసీకి దరఖాస్తులు వచ్చాయి. ఇక క్రిప్టో కరెన్సీల విషయానికొస్తే.. క్రిప్టో అడ్వైజర్స్, క్రిప్టో ఫ్యూచరిస్టిక్ ట్రేడ్స్, క్రిప్టో ఇన్ఫోటెక్, క్రిప్టో ఐటీ సర్వీసెస్, క్రిప్టో ల్యాబ్స్, క్రిప్టో మైనింగ్, క్రిప్టో యో కాయిన్ ఇండియా, క్రిప్టోకాయిన్ సొల్యూషన్స్ మొదలైనవి ఉన్నాయి. పోంజీ స్కీముల భయాలు.. వర్చువల్ కరెన్సీల పేరిట చాలా మంది ఆపరేటర్లు ‘ఈ–పోంజీ’ స్కీములు లేదా చట్టవిరుద్ధమైన మనీ పూలింగ్ పథకాలు నడుపుతుండవచ్చన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వివిధ నియంత్రణ సంస్థలు, దర్యాప్తు ఏజెన్సీలు ఇప్పటికే బిట్కాయిన్ల క్రేజ్‌పై దృష్టి పెట్టాయి. పలు వర్చువల్ కరెన్సీల ఎక్సే్చంజీల్లో సోదాలు నిర్వహించి లక్షల మంది ఇన్వెస్టర్ల వివరాలు సేకరించాయి. కొన్ని బోగస్ సంస్థలపై ఇప్పటికే చర్యలు కూడా చేపట్టాయి. ఒకవైపున నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ విభాగాలు కూడా ఈ కొత్త కరెన్సీలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండగా.. మరోవైపు ఎంట్రప్రెన్యూర్స్ మాత్రం రిస్కుల అంశాల గురించి ఏమాత్రం వెరవడం లేదు. ఘాజియాబాద్, కాన్పూర్, డార్జిలింగ్, జైపూర్, అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ, ముంబైల దాకా ఇలాంటి కొత్త సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ‘క్రిప్టో’ కథ ఇదీ.. ప్రభుత్వాల నియంత్రణ లేకుండా సాంప్రదాయ విధానాలతో పోలిస్తే తక్కువ లావాదేవీ వ్యయాలతో ప్రపంచంలో ఎక్కడైనా చెల్లింపులు జరిపే వెసులుబాటు కల్పించే ప్రత్యామ్నాయ క్రిప్టో కరెన్సీగా 2009లో బిట్‌కాయిన్ తెరపైకొచ్చింది. ఇన్వెస్టర్లు దీనివైపు ఆకర్షితులు కావడంతో.. ఒక్కో బిట్‌కాయిన్ విలువ అంతకంతకూ పెరిగి ఈ ఏడాది డిసెంబర్లో ఏకంగా 20,000 డాలర్ల స్థాయికి (రూ. 10 లక్షల పైచిలుకు) చేరింది. తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే గుణం ఉన్న బిట్‌కాయిన్ విలువ అంతలోనే సగానికి సగం 10,000 డాలర్ల స్థాయికి కూడా పడిపోయింది. ప్రస్తుతం మళ్లీ పుంజుకుని సుమారు 15,000 డాలర్ల స్థాయి దగ్గర తిరుగాడుతోంది. -
మాల్యాను వెనక్కి రప్పిస్తాం
న్యూఢిల్లీ: రుణాలు ఎగ్గొట్టి తప్పించుకు తిరుగుతున్న వ్యాపార వేత్త విజయ మాల్యా వ్యవహారంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. అతణ్ణి దేశానికి తిరిగి రప్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోమవారం మీడియాతో మాట్లాడిన జైట్లీ మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను తిరిగి దేశానికి తీసుకురావడానికి దర్యాప్తు సంస్థలు అన్ని ప్రయత్నాలు చేస్తాయన్నారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోనున్నట్టు స్పష్టం చేశారు. ఆయన్ని ఇండియాకు రప్పించడానికి రెండు ప్రత్యేక మార్గాలు ఉన్నాయన్నారు. , ఒకటి బహిష్కరణ మరొకటి రప్పించడమని తెలిపారు. ఈ విషయంలో బ్రిటన్ తమకు సహాయపడేలా లేదన్నారు. ఒకసారి ఎవరైనా చట్టబద్ధంగా వారి దేశంలోకి ప్రవేశించిన వ్యక్తిని ఆదేశం బహిష్కరిందని జైట్లీ అన్నారు. పాస్ పోర్ట్ రద్దు చేయడం దేశ బహిష్కరణ కింద రాదనే వైఖరిని బ్రిటన్ ప్రభుత్వం తీసుకుందన్నారు. మరోవైపు కోర్టులో అభియోగాలు నమోదై చార్జిషీటు దాఖలైన తరువాత మాల్యాను దేశానికి రప్పించే ప్రయత్నాలు చట్ట ప్రకారం చేయొచ్చన్నారు. అందుబాటులో ఉన్న ఈ అవకాశాన్ని వినియోగించుకొని యూకే ..మాల్యా ను అప్పగించే దిశగా దర్యాప్తు సంస్థలు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇదే విషయంలో పార్లమెంటులో కూడా ప్రస్తావించిన జైట్లీ ఛార్జిషీట్ దాఖలైన తర్వాత భారతదేశానికి రప్పించే ప్రక్రియ ప్రారంభకానుట్టుతెలిపారు. కాగా బ్యాంకుల కన్సార్టియానికి 9 వేలకు కోట్లకు పైగా బాకీ పడ్డ విజయ్ మాల్యా గత మార్చి 2 న భారతదేశం విడిచి బ్రిటన్ కు పారిపోయిన సంగతి తెలిసిందే.