కంపెనీలకూ బిట్‌కాయిన్‌ కిక్‌! | More pending approval at Roc | Sakshi
Sakshi News home page

కంపెనీలకూ బిట్‌కాయిన్‌ కిక్‌!

Published Wed, Dec 27 2017 12:18 AM | Last Updated on Wed, Dec 27 2017 12:18 AM

More pending approval at Roc - Sakshi

న్యూఢిల్లీ: బిట్‌కాయిన్లు, ఇతరత్రా వర్చువల్‌ కరెన్సీలతో మనీలాండరింగ్, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు మళ్లడం వంటి రిస్కులున్నాయి కనక వీటి జోలికి వెళ్లొద్దంటూ వివిధ నియంత్రణ సంస్థలు హెచ్చరిస్తున్నప్పటికీ... ఇన్వెస్టర్లకు మాత్రం క్రిప్టోకరెన్సీలపై మోజు తగ్గడం లేదు. తాజాగా ఔత్సాహిక వ్యాపారవేత్తలు కూడా వర్చువల్‌ కరెన్సీ బూమ్‌ను తమకు అనుకూలంగా మరల్చుకునేందుకు రంగంలోకి దిగుతున్నారు. తమ సంస్థల పేర్లలో ఎక్కడో ఓచోట బిట్‌కాయిన్‌ లేదా క్రిప్టో పదాన్ని చేర్చి కంపెనీలను ఆరంభిస్తున్నారు. గత కొన్ని వారాల్లోనే పేరులో ఎక్కడో ఓ చోట బిట్‌కాయిన్‌ పదం ఉన్న సంస్థలు డజనుకు పైగా పుట్టుకొచ్చాయి. ఈ కోవకే చెందిన మరిన్ని సంస్థల దరఖాస్తులు రిజిస్ట్రార్స్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌వోసీ) దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. ఇక క్రిప్టో అన్న పదాన్ని పేరులో వాడుకుంటున్న కంపెనీల సంఖ్యకు లెక్కే లేదు. ఇంకా కొన్ని సంస్థలు ‘కాయిన్‌’ అన్న పదానికి దేశం పేరు జోడించి మరింత సృజనాత్మకంగా ‘ఇండికాయిన్‌’, ‘భారత్‌కాయిన్‌’ లాంటి కొత్త పేర్లు సృష్టిస్తున్నాయి. మరో సంస్థ ఇంకాస్త ముందుకెళ్లి ఏకంగా ‘స్వచ్ఛకాయిన్‌’  పేరు పెట్టుకుంది. కొత్త కంపెనీలు.. డెంటిస్ట్రీ మొదలుకుని సెక్స్‌ ట్రేడ్‌ దాకా అన్నింటా క్రిప్టోకరెన్సీలను విస్తరిస్తున్నాయి. ఆడిటర్లు, అకౌంటెంట్ల కథనాల ప్రకారం కొత్తగా వచ్చేవే కాకుండా.. పలు లిస్టెడ్‌ కంపెనీలు సైతం తమ పేర్లకు, ‘ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోసియేషన్‌’ నిబంధనల్లోనూ బిట్‌కాయిన్‌ లేదా ఇతరత్రా క్రిప్టోకరెన్సీలను జోడించుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాయి. 

వీటి వ్యాపారమేంటంటే..
పేరులో బిట్‌కాయిన్‌ ఉన్నప్పటికీ.. ఈ కొత్త సంస్థల కార్యకలాపాలు దానితో పొంతన లేకుండా ఉంటున్నాయి. ఆర్‌వోసీ దగ్గర దరఖాస్తు చేసుకున్న సంస్థల్లో ఒకటి.. రిటైల్‌ వ్యాపారం, వస్తువుల రిపేర్లు చేసేది కాగా, మరొకటి ఆర్థిక సేవలందించే కేటగిరీకి చెందినది. ఇంకోటి ‘ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం’ను ప్రోత్సహించే సంస్థ కేటగిరీలో దరఖాస్తు చేసుకుంది. ఇక కొన్ని సంస్థలు ప్రపంచవ్యాప్తంగా దంతచికిత్స కోసం ఉపయోగపడే ‘క్రిప్టో కాయిన్స్‌’ ని అందిస్తామని ప్రచారం చేసుకుంటున్నాయి. వీటితో మధ్యవర్తులకు సంబంధించిన ఖర్చులు తగ్గుతాయని, బీమా క్లెయిమ్‌లు కూడా సులభతరంగా ఉంటాయని చెబుతున్నాయి. ఇవే కాదు.. అడల్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం, సెక్స్‌ వ్యాపారంలోనూ రహస్యంగా చెల్లింపులు జరిపేందుకు ఉపయోగపడతాయంటూ ‘సెక్స్‌ కాయిన్స్‌’ ని కూడా అందించే సంస్థలు మరికొన్ని ఉంటున్నాయి. 

ఆర్‌వోసీ దగ్గర నమోదైన పేర్లలో కొన్ని..
బిట్‌కాయిన్‌ బజార్, బిట్‌కాయిన్‌ ఎక్సే్చంజ్, బిట్‌కాయిన్‌ ఫిన్‌కన్సల్టెంట్స్, బిట్‌కాయిన్‌ ఇండియా సాఫ్ట్‌వేర్‌ సర్వీసెస్, బిట్‌కాయిన్‌ సర్వీసెస్‌ ఇండియా, బిట్‌కాయినర్స్‌ ఇండియా, బిట్‌కాయిన్స్‌ ఇండియా, బిట్‌కాయిన్‌ ఇన్ఫోటెక్‌ అనే పేర్లతో ఆర్‌వోసీకి దరఖాస్తులు వచ్చాయి. ఇక క్రిప్టో కరెన్సీల విషయానికొస్తే.. క్రిప్టో అడ్వైజర్స్, క్రిప్టో ఫ్యూచరిస్టిక్‌ ట్రేడ్స్, క్రిప్టో ఇన్ఫోటెక్, క్రిప్టో ఐటీ సర్వీసెస్, క్రిప్టో ల్యాబ్స్, క్రిప్టో మైనింగ్, క్రిప్టో యో కాయిన్‌ ఇండియా, క్రిప్టోకాయిన్‌ సొల్యూషన్స్‌ మొదలైనవి ఉన్నాయి. 

పోంజీ స్కీముల భయాలు..
వర్చువల్‌ కరెన్సీల పేరిట చాలా మంది ఆపరేటర్లు ‘ఈ–పోంజీ’ స్కీములు లేదా చట్టవిరుద్ధమైన మనీ పూలింగ్‌ పథకాలు నడుపుతుండవచ్చన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వివిధ నియంత్రణ సంస్థలు, దర్యాప్తు ఏజెన్సీలు ఇప్పటికే బిట్‌కాయిన్ల క్రేజ్‌పై దృష్టి పెట్టాయి. పలు వర్చువల్‌ కరెన్సీల ఎక్సే్చంజీల్లో సోదాలు నిర్వహించి లక్షల మంది ఇన్వెస్టర్ల వివరాలు సేకరించాయి. కొన్ని బోగస్‌ సంస్థలపై ఇప్పటికే చర్యలు కూడా చేపట్టాయి. ఒకవైపున నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ విభాగాలు కూడా ఈ కొత్త కరెన్సీలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండగా.. మరోవైపు ఎంట్రప్రెన్యూర్స్‌ మాత్రం రిస్కుల అంశాల గురించి ఏమాత్రం వెరవడం లేదు. ఘాజియాబాద్, కాన్పూర్, డార్జిలింగ్, జైపూర్, అహ్మదాబాద్‌ నుంచి ఢిల్లీ, ముంబైల దాకా ఇలాంటి కొత్త సంస్థలు పుట్టుకొస్తున్నాయి.

‘క్రిప్టో’ కథ ఇదీ..
ప్రభుత్వాల నియంత్రణ లేకుండా సాంప్రదాయ విధానాలతో పోలిస్తే తక్కువ లావాదేవీ వ్యయాలతో ప్రపంచంలో ఎక్కడైనా చెల్లింపులు జరిపే వెసులుబాటు కల్పించే ప్రత్యామ్నాయ క్రిప్టో కరెన్సీగా 2009లో బిట్‌కాయిన్‌ తెరపైకొచ్చింది. ఇన్వెస్టర్లు దీనివైపు ఆకర్షితులు కావడంతో.. ఒక్కో బిట్‌కాయిన్‌ విలువ అంతకంతకూ పెరిగి ఈ ఏడాది డిసెంబర్‌లో ఏకంగా 20,000 డాలర్ల స్థాయికి (రూ. 10 లక్షల పైచిలుకు) చేరింది. తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే గుణం ఉన్న బిట్‌కాయిన్‌ విలువ అంతలోనే సగానికి సగం 10,000 డాలర్ల స్థాయికి కూడా పడిపోయింది. ప్రస్తుతం మళ్లీ పుంజుకుని సుమారు 15,000 డాలర్ల స్థాయి దగ్గర తిరుగాడుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement