డ్వాక్రా రుణ మాఫీ రూ. 10 వేలు కాదు.. ప్రస్తుతం మూడు వేలే
కోర్టు వద్దంటున్నా..ఆధార్ కావాలంటున్న ప్రభుత్వం
ఆధార్ లేదని దాదాపు 18 వేల మందికి ఎగనామం
లోటు బడ్జెట్ పేరుతో.. విడతలుగా ఇచ్చేందుకు నిర్ణయం
చంద్రబాబు తీరుపై మండి పడుతున్న మహిళలు
సాక్షి, కడప : అధికారంలోకి రావడమే తరువాయి అన్ని సమస్యలు తీరుస్తాం...తొలి సంతకంతో రైతు రుణమాఫీ...రెండవ సంతకంతో డ్వాక్రా రుణాల మాఫీ...చేస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే మాఫీ చేస్తున్నారు. డ్వాక్రా రుణాలు పూర్తి స్థాయిలో మాఫీ చేస్తామని తెలుగుదేశం నేతలు ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పటంతో చాలా మంది డ్వాక్రా గ్రూపుల్లోని సభ్యులు రుణాలు చెల్లించలేదు. బాబు ప్రమాణం స్వీకారం రోజు రుణాలు మాఫీ చేస్తామని పేర్కొన్నా.. ఆ తర్వాత మాట మార్చారు. మొత్తం మాఫీ కాదు..కేవలం గ్రూపునకు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు. తీరా ప్రస్తుతం బాబు రూటు మార్చారు.
రూ. 10 వేలు కాదు....రూ. 3 వేలే!
ఒకేసారి గ్రూపు మొత్తం మీద ఉన్న రుణం మాఫీ చేస్తామని అందులో భాగంగా ఒక్కొక్కరికి రూ. 10 వేలు మాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు లోటు బడ్జెట్ పేరుతో విడతల వారీగా ఇస్తామని ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే విషయాన్ని ఇటీవల కమలాపురంలో జరిగిన బహిరంగ సభలోనూ బహిర్గతం చేశారు. మొదటి విడతలో రూ. 3 వేల చెక్కును డ్వాక్రా గ్రూపులోని ఒక్కొక్క సభ్యురాలికి అందజేయాలని నిర్ణయించడం వారిని ఆగ్రహావేశాలకు గురి చేస్తోంది. ఇచ్చే పిసురంతకు ఎన్నికల నుంచి ఇప్పటివరకు ఇంత ఆర్భాటం అవసరమా? అని పలువురు మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఇచ్చే రూ. 10 వేలను సైతం ఒకేసారి కాకుండా మూడు విడతలుగా ఇస్తామని ప్రకటించడం పట్ల డ్వాక్రా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
18 వేల మంది సభ్యులకు ఎగనామం
సుప్రీం కోర్టు పదేపదే అక్షింతలు వేస్తున్నా....ప్రభుత్వ తీరులో మాత్రం మార్పు రాలేదు. ప్రతి దానికి ఆధార్ అవసరం లేదని ఇప్పటికే కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆధార్ తప్పకుండా అవసరమని చెబుతుండటం ఆందోళన కలిగించే పరిణామం. ఎందుకంటే జిల్లాలో పట్టణ ఇందిర క్రాంతి పథం కింద సుమారు 12,300 గ్రూపులు ఉండగా, అందులో 1,23,000 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం సభ్యులకు సంబంధించి ఇప్పటివరకు 91 శాతం ఆధార్ అనుసంధానం అయినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మరో 10 వేల మందికి ఆధార్ అనుసంధానం కావాల్సి ఉంది. అంతేకాకుండా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో మొత్తం 34,016 గ్రూపులు ఉండగా, సుమారు 3,29,458 మంది సభ్యులుగా ఉన్నారు. ఇందులో 4200 మంది ఆధార్ సమర్పించలేదు. మరో నాలుగు వేల మంది సమర్పించినా ఆధార్‌డేటా బేస్‌లో ఫెయిల్ అని వస్తోంది. ఇందిరాక్రాంతి పథం పరిధిలో పది వేల మంది, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో సుమారు 8 వేల మందికి కలిపి మొత్తం 18 వేల మంది సభ్యులకు ఆధార్ నెపంతో రుణమాఫీకి ఎగనామం పెడుతున్నారు.ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అందించే అరకొర సాయాన్ని జూన్ 3 నుంచి 8వ తేదీ వరకు అందించే ప్రక్రియను చేపట్టి పూర్తి చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
హామీ ఇచ్చి మోసం చేశారు
ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. ఇప్పటికీ రుణమాఫీ వర్తించకపోవడంతో బ్యాంకులో రుణాలు చెల్లించి తిరిగి తీసుకున్నాం. మరో మారు ఇలాంటి బూటకపు మాటలు నమ్మే పరిస్థితి ఉండదు.
సందడి నాగరత్నమ్మ,
డ్వాక్రా మహిళ లీడర్, ప్రొద్దుటూరు
ఈసారికి... ఇంతే..!
Published Fri, May 15 2015 4:34 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement