2 నిమిషాలు వార్తలు ఆపేయండి
న్యూఢిల్లీ: జర్నలిస్టులపై రోజురోజుకు పెరుగుతున్న దాడులపై భారత ప్రెస్ కౌన్సిల్(పీసీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. పాత్రికేయులపై దాడి చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టడంలో విఫలమవుతున్న ప్రభుత్వాల తీరును వ్యతిరేకించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి ఏడాది నవంబర్ 2న రెండు నిమిషాల పాటు వార్తలు నిలిపివేయాలని(న్యూస్ సైలెన్స్) పీసీఐ పేర్కొంది.
'జర్నలిస్టులపై హింసకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. దీనికి నిరసనగా నవంబర్ 2న దేశవ్యాప్తంగా 2 నిమిషాల పాటు వార్తలు ప్రసారం ఆపేయాలని సూచిస్తున్నామ'ని పీసీఐ తెలిపింది. ఉత్తరప్రదేశ్ జర్నలిస్ట్ జగేంద్ర సింగ్ హత్య కేసులో సుప్రీంకోర్టు సమర్పించిన అఫిడవిట్ లో ఈ మేరకు పేర్కొంది.
భావప్రకటన స్వేచ్ఛకు భంగం కలగకుండా ఉండాలంటే జర్నలిస్టుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పీసీఐ సూచించింది. గడచిన రెండు దశాబ్దాల్లో 80 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారని, దాదాపు అన్ని కేసులు విచారణ దశలోనే పెండింగ్ లో ఉన్నాయని పీసీఐ తెలిపింది.