సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’ పత్రికపై ప్రభుత్వం సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) ఈ నెల 8వ తేదీన విచారణ చేపట్టనుంది. రాష్ట్ర రాజధాని నిర్మాణం పేరిట మం త్రులు, అధికార పార్టీ నేతలు సాగించిన భూదందాను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పత్రికలో రాసిన వార్తలకు ఆధారాలు చూపాలంటూ సంబంధిత విలేకరులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
దీనిపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) సెక్రెటరీ జనరల్ మార్చి 22న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ)కు లేఖ రాశారు. ఈ వ్యవహారంపై వాస్తవాలను నివేదిక రూపంలో ఇవ్వాలని ప్రెస్ కౌన్సిల్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై గుంటూరు అర్బన్ ఎస్పీ స్పందించారు. జూలై 11న కౌన్సిల్‌కు లేఖ రాశారు. ఎర్రబాలెం గ్రామస్తుల ఫిర్యాదు మేరకు విలేకరులకు నోటీసులు జారీ చేశామన్నారు. సాక్షి పట్ల సర్కారు తీరుపై 8న పీసీఐ విచారణ జరపనుంది.