న్యూఢిల్లీ: పత్రికా రంగంలో అత్యుత్తమ సేవలందించిన జర్నలిస్టులకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయిలో అవార్డులు అందజేయనుంది. నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్సీ ఇన్ జర్నలిజం పేరిట అవార్డులను అందించనుంది. పత్రికా రంగానికి చెందిన ఆరు కేటగిరీల్లో అందజేసే ఈ అవార్డులకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దరఖాస్తులను ఆహ్వానించింది. రాజా రామ్మోహన్‌రాయ్ నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్సీ ఇన్ జర్నలిజం కింద రూ.లక్ష నగదు పురస్కారం, ప్రశంసా పత్రం అందజేస్తారు.
గ్రామీణ జర్నలిజం, డెవలప్‌మెంటల్ రిపోర్టింగ్, స్త్రీ శక్తి, ఫొటో జర్నలిజం(సింగిల్ న్యూస్ ఫొటో, ఫొటో ఫీచర్), ఉర్దూ జర్నలిజంలో అవార్డులు అందజేస్తారు. వీటికి ఒక్కోదానికి రూ. 50 వేల నగదు పురస్కారం కూడా అందిస్తారు. న్యూస్ పేపర్, న్యూస్ ఏజన్సీల్లో పనిచేసే జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులు ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 10లోగా దరఖాస్తులు ద సెక్రెటరీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సూచనా భవన్, లోధీ రోడ్, న్యూఢిల్లీ-110003కి చేరాలి. మరిన్ని వివరాలకు (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ప్రెస్‌కౌన్సిల్.ఎన్‌ఐసీ.ఇన్) వెబ్ సైట్‌ను చూడవచ్చు.