Defamation claim
-
రూ.1400 కోట్ల స్కాం: ఆప్ నేతలపై ఎల్జీ పరువునష్టం దావా!
సాక్షి, న్యూఢిల్లీ: రూ.1,400 కోట్లు అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసిన ఆమ్ ఆద్మీ నేతలపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా. తనపై తప్పుడు, గౌరవానికి భంగం కలిగించే విధంగా అవినీతి ఆరోపణలు చేసిన ఎమ్మెల్యేలు అతిష్, సౌరభ్ భరద్వాజ్‌లతో పాటు పలువురు ఆప్ నేతలపై పరువునష్టం దావా వేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది ఎల్జీ కార్యాలయం. 2016 నోట్ల రద్దు సమయంలో ఎల్జీ సక్సెనా సుమారు రూ.1,400 కోట్లు రద్దు చేసిన నోట్లు మార్పిడి చేయించారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఖాదీ విభాగనికి ఛైర్మన్‌గా ఉండి ఆ కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. అయితే, ఆ ఆరోపణలను తిప్పికొట్టారు సక్సేనా. ఎమ్మెల్యేలతో పాటు ఢిల్లీ డెవలప్మెంట్ కమిషన్ ఛైర్మన్ జాస్మిన్ షాపైనా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ‘ఒకరిపై ఆరోపణలు చేసేందుకు గంతులేస్తూ వచ్చే లక్షణం కేజ్రీవాల్ అండ్ కోది. ఆప్ నేతలు చేసిన తప్పుడు, పరువునష్టం కలిగించే ఆరోపణలపై ఎల్జీ ప్రత్యేక దృష్టి సారించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఆప్ నేతలు తప్పించుకోలేరు.’ అని ఎల్జీ సక్సేనా కార్యాలయం పేర్కొంది. ఇదీ చదవండి: Delhi Liquor Policy: ఎల్జీ దెబ్బకు వెనక్కి తగ్గిన కేజ్రీవాల్.. మరో 6 నెలలు..! -
వారి పేర్లు బయటపెడతా: వర్మ
‘‘మా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాని ఆపడానికి చాలామంది ప్రయత్నించారు. ఎవరెవరు ఆపడానికి ప్రయత్నించారో వారి వివరాలన్నీ త్వరలోనే బయటపెడతా. సినిమా ఆపడానికి ప్రయత్నించినవారిపై పరువు నష్టం దావా కూడా వేస్తాం. 2019 మే నుంచి సెప్టెంబర్ మధ్యలో జరిగిన సంఘటనల ఆధారంగానే ఈ సినిమా తీశాం. ఇదంతా ఫన్నీగా ఉంటుంది’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ. ప్రస్తుతం ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ సినిమా పనుల నిమిత్తం చైనాలో ఉన్నారు వర్మ. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆన్లైన్ ద్వారా ఆయన పై విధంగా మాట్లాడారు. రామ్‌గోపాల్ వర్మ తన టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై అందిస్తున్న చిత్రం ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’. రామ్‌గోపాల్ వర్మతో కలసి సిద్దార్థ తాతోలు దర్శకత్వం వహించారు. టి.అంజయ్య సమర్పణలో అజయ్ మైసూర్, టి. నరేష్కుమార్, టి.శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రానికి నట్టి క్రాంతి, నట్టి కరుణ సహ నిర్మాతలు. వర్మ ఆన్లైన్ ప్రసంగం ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాతలు నట్టికుమార్, అంజయ్య మాట్లాడుతూ – ‘‘మా సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 థియేటర్లలో గురువారం విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదల కోసం 15 రోజులుగా యుద్ధం చేశాం. ఆ యుద్ధంలో విజయం సాధించాం. సినిమాని ఆపడానికి ఎవరు ప్రయత్నించారో గురువారం మధ్యాహ్నానానికల్లా ప్రతి ప్రేక్షకుడి ఊహకు తెలుస్తుంది. ఆపాలని ప్రయత్నించినవారిపై వర్మ చెప్పినట్లుగానే పరువు నష్టం దావా వేస్తాం. ఈ సినిమాకు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికెట్‌ను ఇచ్చింది’’ అన్నారు. -
ఎన్డీటీవీపై రిలయన్స్ ఇన్ఫ్రా కేసు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇతరులు కలిసి తమకు వ్యతిరేకంగా రూ.10 వేల కోట్లకు పరువు నష్టం దావాను దాఖలు చేసినట్లు ఎన్డీటీవీ వార్తా సంస్థ తెలియజేసింది. అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఇది దాఖలైందని, ఈ మేరకు అక్కడి నుంచి తమకు ఈ నెల 18న నోటీసులు అందాయని ఈ సంస్థ తెలిపింది. కంపెనీతోపాటు, ఎగ్జిక్యూటివ్ కో చైర్పర్సన్, మేనేజింగ్ ఎడిటర్లను బాధ్యులను చేస్తూ ఈ వ్యాజ్యం దాఖలైనట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు వెల్లడించింది. ఈ వ్యవహారాన్ని కోర్టులో ఎదుర్కొంటామని పేర్కొంది. ‘‘ప్రతీ వారం నిర్వహించే ‘ట్రూత్ వర్సెస్ హైప్ (వాస్తవం/కల్పితం)’ షోలో భాగంగా సెప్టెంబర్ 29న ప్రసారం చేసిన ‘ఐడియల్ పార్ట్నర్ ఇన్ రఫేల్ డీల్ (రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో సరైన భాగస్వామి)’ కథనానికి సంబంధించి ఈ వ్యాజ్యం దాఖలైనట్టు ఎన్డీటీవీ తెలిపింది. ఆరోపణలను తాము పూర్తిగా తిరస్కరిస్తున్నామని, ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారాన్ని కోర్టుకు సమర్పిస్తామని సంస్థ తెలిపింది. ఈ వ్యాజ్యం ఈ నెల 26న విచారణకు రానుంది. -
ఎంజె అక్బర్ కేసులో గెలుపెవరిది?
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని విదేశాంగ శాఖ సహాయ మంత్రి, మాజీ సీనియర్ జర్నలిస్ట్ ఎంజె అక్బర్ సోమవారం నాడు ప్రియా రమణిపై నేరపూరిత పరువు నష్టం దావా వేసిన విషయం తెల్సిందే. అందులో ఆయన తన తరపున వాదించడానికి 30 మంది మహిళలు సహా 97 మంది న్యాయవాదులను పేరు పేరున పేర్కొనడం గమనార్హం. అక్బర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన 14 మంది మహిళల్లో ప్రియా రమణి మొదటి వారు. 2017, అక్టోబర్ నెలలో ‘వోగ్ ఇండియా’లో ఓ ఎడిటర్ నీచ ప్రవర్తన గురించి ప్రియా రమణి ఓ ఆర్టికల్ రాశారు. అయితే ఆ వ్యాసంలో ఆమె ఆ ఎడిటర్ పేరును ప్రస్తావించలేదు. ఏడాది అనంతరం అక్టోబర్ 8వ తేదీన ఆ ఎడిటరే ఎంజె అక్బర్ అంటూ ట్వీట్ చేశారు. దాంతో మరో 13 మంది మహిళా జర్నలిస్టులు బయటకు వచ్చి తాము కూడా అక్బర్ లైంగిక వేధింపులకు గురయ్యామని ఆరోపించడం తెల్సిందే. అప్పుడప్పుడు మీడియాను వేధించేందుకు రాజకీయ నాయకులు పరువు నష్టం దావాలు వేయడం మామూలే. ఇప్పుడు తనపై వచ్చిన ఆరోపణలకు అక్బర్ ఏకంగా నేరపూరిత పరువు నష్టం దావా వేశారు. దీని కింద దోషికి జరిమానా లేదా రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. అక్బర్ తన పిటిషన్లో ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు. ఒకటి సమాజంలో తన పరువు, ప్రతిష్టను దెబ్బతీయడానికి నిరాధార ఆరోపణలు చేశారని, దీని వెనక రాజకీయ కోణం ఉందన్నది. రెండోది 20 ఏళ్ల క్రితం నిజంగా లైంగిక వేధింపులు జరిగి ఉంటే ఇంతకాలం ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నది. ‘మీటూ’ ఉద్యమంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మగవాళ్లందరు కూడా ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పటి వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న అంశాన్నే నొక్కి ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు అక్బర్ పెట్టుకున్న 97 మంది న్యాయవాదులకన్నా ఎక్కువ మంది న్యాయవాదులు సమాధానం చెప్పగలరు. ఇందులో ముడివడి ఉన్న మొట్టమొదటి అంశం ‘పవర్ ఈక్వేషన్’. అంటే, ఎవరి అధికారం ఎక్కువ, ఎవరిది తక్కువన్నది. సహజంగా బాధితుల అధికారమే తక్కువుంటుంది. వేధింపుల గురించి ఫిర్యాదు చేస్తే కక్ష సాధింపు చర్యలు ఉంటాయన్న భయం, వ్యక్తిగత, వృత్తి జీవితాలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందన్న ఆందళన వారిని వెంటాడుతోంది. అందుకనే వారు ఫిర్యాదు చేయడానికి సాహసించలేరు. ఎందుకు కేసు పెట్టరంటే..... ఫిర్యాదు చేయాలన్నా అప్పటికి ‘సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్, రిడ్రెసల్) యాక్ట్’ లేదు. దీన్ని యూపీఏ ప్రభుత్వం 2013లో తీసుకొచ్చింది. ఈ చట్టం రాకముందు లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చే యాలంటే పోలీసుల వద్దకు వెళ్లడం ఒక్కటే మార్గం. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులపై ఫిర్యాదు చేయాలంటే ఎంతో ఒత్తిడి గురికావాల్సి వస్తుంది. వ్యక్తిగత పరువు, ప్రతిష్టలు దెబ్బతీస్తారన్న భయం ఉంటుంది. ఫిర్యాదు చేసిన పెద్దవారిపై చర్యలు తీసుకుంటారన్న నమ్మకం ఉండదు. పలుకుబడిగల వ్యక్తులపై ఫిర్యాదు కోసం పోలీసు స్టేషన్‌కు వెళితే ఫిర్యాదును తిరస్కరించిన ఉదంతాలను ఇప్పటికీ వింటుంటాం. పైగా చట్టానికూడా పరిమితులు ఉన్నాయి. ఫలానా కేసుకు ఫలానా కాల పరిమితిలోగా ఫిర్యాదులు చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. లైంగిక వేధింపుల కేసే తీసుకుంటే సంఘటన జరిగిన నాటి నుంచి మూడేళ్లలోపే ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. జరిగిన సంఘటన నుంచి తేరుకొని, పోరాడే మనస్తత్వాన్ని సంతరించుకొని, ఫిర్యాదు దాఖలుచేసే ధైర్యాన్ని కూడదీసుకునే వరకే ఈ మూడేళ్ల సమయం గడచిపోవచ్చు. కేసు పెట్టక పోవడం కూడా హక్కే! కేసు దాఖలు చేయడానికి కాల పరిమితి ముగిసి పోయినందున తనపై కేసు కొట్టివేయాలన్నది కూడా అక్బర్ పిటిషన్లో ఓ వాదన. కేసు కొట్టివేస్తే ఆయన నిర్దోషన్నమాట. ఇదంతా తప్పుడు వాదనే అవుతుంది. కేసు పెట్టడం, పెట్టకపోవడమన్నది బాధితురాలి ఇష్టమే కాదు, ఆమె హక్కు కూడా. ఆమె జరిగిన సంఘటన గురించి కేసు దాఖలు చేయలేదు కనుక ఆ సంఘటన గురించి ఆమెకు వెల్లడించే హక్కు లేదంటే ఎలా? నేరాన్ని రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనప్పుడు నేరస్థుడు విడుదలవుతాడు, అలాంటప్పుడు తనకు జరిగిన అన్యాయం గురించి బాధితుడు లేదా బాధితరాలు మాట్లాడకూడదంటే ఎట్లా! జరిగిన సంఘటన నిజమైనప్పుడు పరువు నష్టం దావాను శంకించాల్సిందే! గెలుపోటములు అంతిమంగా ప్రియా రమణి లైంగిక ఆరోపణలు నిజమవుతాయా, ఎంజె అక్బర్ పరువు నష్టం దావా నెగ్గుతుందా? అన్నది ప్రశ్న. ఏ కేసులోనైనా సరే నిజా నిజాలు తేల్చాలంటే చట్ట ప్రకారం అందుకు తగిన ఆధారాలు ఉండాల్సిందే. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించిన ఆధారాలు ఆమె చూపించలేకపోవచ్చు. పైగా సకాలంలో ఫిర్యాదు చేయలేదు. అక్బర్ నమ్ముతున్నది కూడా ఇదే. ఆ తర్వాత ఏకంగా 13 మంది మహిళలు ఆయనపై ఆరోపణలు చేయడం చిన్న విషయమేమీ కాదు. వారు కూడా కోర్టు వర కు వచ్చి సాక్ష్యాలిస్తే కేసు బలపడుతుంది. మొట్టమొదటి సారిగా తన పేరు బయటపెట్టి పరువు తీసిందన్న అక్కసుతోపాటు ఇంకెవరు తనకు వ్యతిరేకంగా బయటకు రావద్దనే ఉద్దేశంతో అక్బర్ పరువు నష్టం దావా వేసినట్లు కనిపిస్తోంది. ఆయన పరువు నష్టం దావాను కూడా ఆయనే నిరూపించుకోవాలి కనుక అది నిలబడే అవకాశం లేదు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు, అందులోనూ జర్నలిస్టులు రాజకీయంగా తనను దెబ్బతీయడానికి కుట్రపన్నారని నిరూపించడం అంత సాధ్యమయ్యే పనేమీ కాదు. -
ముదిరిన ‘మీ టూ’ వ్యవహారం
న్యూఢిల్లీ/ముంబై: భారత సినీ, రాజకీయ, మీడియా రంగాల్లో ‘మీ టూ’ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. పనిప్రదేశంలో తమను వేధించినవారి వివరాలను పలువురు మహిళలు ‘మీ టూ’ పేరుతో వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇలా ఆరోపణలు ఎదుర్కొన్నవారిలో మాజీ జర్నలిస్ట్, విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్, నటులు అలోక్‌నాథ్, నానా పటేకర్, బాలీవుడ్ దర్శకులు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్ ఉన్నారు. తమను ఎంజే అక్బర్ వేధించాడని జర్నలిస్ట్ ప్రియా రమణి సహా 11 మంది మహిళా జర్నలిస్టులు ఆరోపించగా, సీనియర్ నటుడు అలోక్‌నాథ్ తనపై అత్యాచారం చేశాడని దర్శకురాలు, రచయిత్రి వినతా నందా ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రియా రమణిపై కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ సోమవారం ప్రైవేటు క్రిమినల్ పరువునష్టం దావాను దాఖలు చేశారు. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో దాఖలు చేసిన ఈ పిటిషన్లో అక్బర్ న్యాయవాది సందీప్ కుమార్ స్పందిస్తూ.. ‘అక్బర్ జర్నలిస్టుగా సుదీర్ఘకాలం పనిచేశారు. దేశంలో తొలి రాజకీయ వారపత్రికను ఆయనే ప్రారంభించారు. జర్నలిస్ట్ ప్రియా రమణి ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశంతో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం నా క్లయింట్ తనను వేధించాడని ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ఆయన రాజకీయ జీవితాన్ని, పేరు ప్రతిష్టలను దెబ్బతీసేందుకు మీడియాలో ఈ విద్వేషపూరిత ప్రచారం సాగుతోంది. ప్రియా రమణి చర్యలతో అక్బర్ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లడంతో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహచరులతో ఆయన సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అంతేకాకుండా ప్రియా రమణి ఆరోపణలతో నా క్లయింట్ తీవ్ర మానసిక వేదన, ఒత్తిడికి లోనయ్యారు’ అని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా అక్బర్ తరఫున వాదించేందుకు సిద్ధంగా ఉన్న 97 మంది లాయర్ల పేర్లను సందీప్ కుమార్ కోర్టుకు అందజేశారు. మరోవైపు అక్బర్ పరువునష్టం దావా దాఖలు చేయడంపై స్పందించిన ప్రియా రమణి.. తానూ న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. మరోవైపు తనపై అలోక్‌నాథ్ పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపించిన రచయిత్రి వినతా నందాపై సివిల్ పరువునష్టం దావా దాఖలైంది. వినతా నందా తనకు బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు నష్టపరిహారంగా రూ.1 చెల్లించాలని కోరుతూ ముంబైలోని దిన్దోషి సెషన్స్ కోర్టులో అలోక్‌నాథ్ పిటిషన్ దాఖలు చేశారు. గొంతు నొక్కేయాలని చూస్తున్నారు.. లైంగికవేధింపులకు గురైన బాధితుల భయాన్ని, బాధను అక్బర్ ఏమాత్రం పట్టించుకోలేదని ప్రియా రమణి దుయ్యబట్టారు. బెదిరించడం, వేధింపులకు గురిచేయడం ద్వారా బాధితుల గొంతును నొక్కేసేందుకు అక్బర్ యత్నిస్తున్నారని ఆరోపించారు. ఎంజే అక్బర్‌కు వ్యతిరేకంగా గతంలో గళమెత్తినవారు వృత్తి, వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రియా రమణి అన్నారు. మరోవైపు ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకూ అక్బర్ పదవి నుంచి తప్పుకోవాలని ఇండియన్ వుమెన్స్ ప్రెస్ కోర్(ఐడబ్ల్యూపీసీ), ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా(పీసీఐ), ప్రెస్ అసోసియేషన్ అండ్ సౌత్ ఏషియన్ వుమెన్ ఇన్ ఇండియా సంయుక్తంగా డిమాండ్ చేశాయి. నిష్పాక్షిక విచారణ జరిగేందుకు వీలుగా అక్బర్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కోరాయి. లైంగిక వేధింపులపై మహిళా ఉద్యోగులు చేసే ఫిర్యాదులను సీరియఎస్‌గా తీసుకోవాలనీ, వాటిని ఉద్దేశ్యపూర్వక ఫిర్యాదులుగా పరిగణించరాదని విజ్ఞప్తి చేశాయి. కేంద్ర మంత్రి అక్బర్ తక్షణం పదవి నుంచి తప్పుకోవాలని ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఇంటిముందు ఆందోళనకు దిగారు. జర్నలిస్ట్ దువాపై ఆరోపణలు ది వైర్ వెబ్సైట్ కన్సల్టింగ్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా తనను లైంగికంగా వేధించాడని డాక్యుమెంటరీ దర్శకురాలు నిష్టా జైన్ ఆరోపించింది. తాను 1989లో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వినోద్‌కు కలుసుకున్నాననీ, తాను కుర్చీలో కూర్చోకముందే అతను సెక్స్ జోక్ వేశాడని తెలిపారు. ‘‘ఓ రోజు కారు పార్కింగ్ ప్రదేశంలో దువా కనిపించాడు. ‘నీతో మాట్లాడాలి. నా కారులో కూర్చో’ అని కోరాడు. తన ప్రవర్తనకు క్షమాపణలు కోరతాడనుకొని కారులో కూర్చోగానే నా మీద పడిపోయి ముఖమంతా ముద్దులు పెట్టాడు. ఎలాగోలా తప్పించుకున్నా’’ అని తెలిపారు. మిత్రపక్షాల అసంతృప్తి సెగ.. సాక్షి ప్రతినిధి న్యూఢిల్లీ: అక్బర్‌ను తప్పించేందుకు కేంద్రం చొరవ తీసుకోని నేపథ్యంలో మిత్రపక్షాలే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రిగా ఉన్న అక్బర్ వెంటనే పదవి నుంచి దిగిపోవాలనీ, లైంగిక వేధింపు ఆరోపణలపై విచారణను ఎదుర్కోవాలని ఎన్డీయే మిత్రపక్షం జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) డిమాండ్ చేసింది. ‘ఈ విషయంలో అక్బర్ సొంతంగా ఓ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నా. ఒకవేళ తప్పుకోకుంటే ప్రభుత్వమే మంత్రి బాధ్యతల నుంచి తొలగించాలి’ అని∙జేడీయూ నేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళలపై అక్బర్ న్యాయపోరాటానికి దిగడం కేంద్ర ప్రభుత్వానికి ప్రతికూలంగా మారే అవకాశముందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
మంత్రి పరిటాల వర్గానికి ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం: మంత్రి పరిటాల సునీత వర్గానికి అనంతపురం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి 2011లో దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణ పూర్తి అయింది. మంత్రి సునీత సమీప బంధువు ఎల్. నారాయణ చౌదరి రూ. 10 లక్షలు, ఆంధ్రజ్యోతి సిబ్బంది లక్ష రూపాయలు చెల్లించాలని కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్ కారుబాంబు కేసులో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ప్రకాశ్‌రెడ్డికి, ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదని తీర్పు ఇచ్చింది. అనవసరంగా ఆయనపై దుష్ప్రచారం చేసినందుకు తగిన మూల్యం చెల్లించాలని తీర్పు వెలువరించింది. తీర్పు పట్ల తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
'సీఎం చెప్పారని ఆయన నన్ను దూషించారు'
న్యూఢిల్లీ: తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడంపై లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అందుకు కేజ్రీవాల్‌కు నాలుగు వారాలు గడువిచ్చింది. తనను దూషించాలని, తనపై అసభ్య పదజాలం వాడాలని కేజ్రీవాల్ తన లాయర్ రామ్ జెఠ్మాలానీకి సూచించినట్లు అరుణ్ జైట్లీ కోర్టుకు బుధవారం మరోసారి తెలిపారు. కేజ్రీవాల్‌పై గతంలో దాఖలైన పిటిషన్ విచారణ గత మే 15, 17 తేదీల్లో విచారణ సాగుతుండగా సీనియర్ లాయర్ రాం జెఠ్మలానీ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని జైట్లీ తన రెండో పిటిషన్లో పేర్కొన్న విషయం తెలిసిందే. తన ప్రతిష్టకు భంగంకలిగించే వ్యాఖ్యలు చేశారంటూ కేజ్రీవాల్‌పై జైట్లీ రూ. 10 కోట్ల దావా వేశారు. అయితే కేసు విచారణ కొనసాగుతుండగా జెఠ్మలానీ తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ కేసు వాదించారని జైట్లీ ఢిల్లీ హైకోర్టుకు విన్నవించారు. కేజ్రీ చెబితేనే తాను అసభ్య పదజాలం వాడినట్లు జెఠ్మలానీ తనకు ఓ లేఖ ద్వారా తెలిపినట్లు కోర్టులో జైట్లీ వెల్లడించారు. దీనిపై స్పందించిన కోర్టు.. ఆప్ అధినేత కేజ్రీకి నాలుగు వారాలు గడువిస్తూ లిఖిత పూర్వకంగా తప్పుడు అఫిడవిట్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జైట్లీని దూషించాలని కేజ్రీవాల్ తనకు సూచించారని జెఠ్మలానీ వెల్లడించడంతో కేజ్రీ కష్టాలు మొదటికొచ్చాయి. తాను జెఠ్మాలానీకి ఇలాంటి విషయాలు సూచించలేదని కేజ్రీవాల్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయగా.. ఢిల్లీ సీఎం అబద్ధాలు చెప్తున్నారని, ఈ కేసులో తాను, కేజ్రీవాల్ చర్చించుకున్న విషయాలు ఉన్న లేఖను బయటపెడతానని జెఠ్మలానీ హెచ్చరించిన విషయం తెలిసిందే. వివాదం ముదరడంతో ఈ పరువునష్టం కేసులో ఇక ఎంతమాత్రం కేజ్రీవాల్ తరఫున వాదించబోనంటూ జెఠ్మలానీ స్పష్టం చేశారు. కేసు వాదన నుంచి జెఠ్మలానీ తప్పుకోవడం, ఆయన సూచించిన కారణంగా తనపై జెఠ్మలానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారని జైట్లీ కోర్టులో పేర్కొనడంతో కేజ్రీ చుట్టు ఉచ్చు మరింత బిగుసుకున్నట్లు కనిపిస్తోంది. -
కేజ్రీవాల్‌పై జైట్లీ రూ.10 కోట్ల దావా
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కేంద్ర ఆర్థిక, రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మరో పరువు నష్టం దావా వేశారు. తన ప్రతిష్టకు భంగంకలిగించే వ్యాఖ్యలు చేశారంటూ కేజ్రీవాల్‌పై రూ. 10 కోట్ల దావా వేశారు. కేజ్రీవాల్, మరో ఐదుగురు ఆప్ నేతల రాఘవ్ చద్దా, కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, దీపక్ బాజ్‌పాయిలపై వేసిన పరువు నష్టం కేసు ఢిల్లీ హైకోర్టులో ఈ నెల 15, 17 తేదీల్లో విచారణ సాగుతుండగా కేజ్రీవాల్ తరఫు సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని జైట్లీ పిటిషన్లో పేర్కొన్నారు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 2000 నుంచి 2013 వరకు వ్యవహరించిన జైట్లీ అసోసియేషన్ ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలకు పాల్పడ్డారని కేజ్రీవాల్ ఆరోపించడంతో అప్పట్లో ఆయన దావా వేసిన విషయం తెలిసిందే. న్యాయవాద వృత్తిలో సంపాదనకు అవకాశాలున్నా వాటిని త్యాగం చేసి కేంద్రమంత్రిగా గౌరవప్రదంగా, నిజాయితీగా ఉంటూ ప్రజాసేవలో నిమగ్నమయ్యారని జైట్లీ తరఫు దావా వేసిన న్యాయవాది మాణిక్ దోగ్రా పేర్కొన్నారు. -
పవన్‌పై పరువునష్టం దావా వేస్తా: హరీశ్
సాక్షి, హైదరాబాద్: పీసీసీ మాజీ అధ్యక్షులు బొత్సతో తనకు వ్యాపార సంబంధాలున్నాయని ఆరోపించిన పవన్‌కల్యాణ్‌పై పరువు నష్టం దావా వేస్తానని టీఆర్ఎస్ నేత తన్నీరు హరీశ్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బొత్సతో కేబుల్ వ్యాపార సంబంధాలున్నట్లు చేసిన ఆరోపణలను ఖండించారు. ఆయన చేసిన ఆరోపణలను 24 గంటలల్లోగా నిరూపించాలని, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. లేని పక్షంలో దావాతో పాటు క్రిమినల్ కేసు పెడతానని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ నాయకుల ప్రతిష్టను దిగజార్చడానికి ఇలాంటి తప్పుడు ఆరోపణలు గతంలోనూ చేశారని, ఇప్పుడు కూడా అదే పద్దతి కొనసాగిస్తున్నారన్నారు