కేజ్రీవాల్‌పై జైట్లీ రూ.10 కోట్ల దావా
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కేంద్ర ఆర్థిక, రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మరో పరువు నష్టం దావా వేశారు. తన ప్రతిష్టకు భంగంకలిగించే వ్యాఖ్యలు చేశారంటూ కేజ్రీవాల్‌పై రూ. 10 కోట్ల దావా వేశారు. కేజ్రీవాల్, మరో ఐదుగురు ఆప్ నేతల రాఘవ్ చద్దా, కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, దీపక్ బాజ్‌పాయిలపై వేసిన పరువు నష్టం కేసు ఢిల్లీ హైకోర్టులో ఈ నెల 15, 17 తేదీల్లో విచారణ సాగుతుండగా కేజ్రీవాల్ తరఫు సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని జైట్లీ పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 2000 నుంచి 2013 వరకు వ్యవహరించిన జైట్లీ అసోసియేషన్ ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలకు పాల్పడ్డారని కేజ్రీవాల్ ఆరోపించడంతో అప్పట్లో ఆయన దావా వేసిన విషయం తెలిసిందే. న్యాయవాద వృత్తిలో సంపాదనకు అవకాశాలున్నా వాటిని త్యాగం చేసి కేంద్రమంత్రిగా గౌరవప్రదంగా, నిజాయితీగా ఉంటూ ప్రజాసేవలో నిమగ్నమయ్యారని జైట్లీ తరఫు దావా వేసిన న్యాయవాది మాణిక్ దోగ్రా పేర్కొన్నారు.