కేజ్రీవాల్, అరుణ్‌జైట్లీ (ఫైల్)
న్యూఢిల్లీ : పంజాబ్ నేత బిక్రం సింగ్‌తో మొదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. కేజ్రీవాల్‌పై ముప్పైకి పైగా పరువు నష్టం దావా కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా పలు బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కేజ్రీవాల్ క్షమాపణలు చెబుతూ లేఖలు రాయడంలో బిజీగా ఉన్నారు. తాజాగా ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్, బీజేపీ ఎంపీ రమేశ్ బిదూరికి కూడా క్షమాపణలు చెప్పారు. నేడో, రేపో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కూడా కేజ్రీ లేఖ అందనుంది. కానీ ఈ విషయంపై అరుణ్ జైట్లీ ఎలా స్పందిస్తారో అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
పరువు నష్టం కేసు..
13ఏళ్ల పాటు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన జైట్లీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కేజ్రీతో సహా పలువురు ఆప్ నేతలు ఆయనపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో జైట్లీ వారిపై పరువు నష్టం దావా కేసు వేశారు. ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేసిన జైట్లీ పరువు నష్టం కింద రూ. 10 కోట్లు చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. త్వరలోనే విచారణకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కేజ్రీవాల్ క్షమాపణలు తెలిపారు.
అంత తేలిగ్గా వదలరు..
ఈ విషయాన్ని జైట్లీ అంత తేలికగా వదిలిపెట్టరని, ఆప్ కన్వీనర్‌ను క్షమించే అవకాశం లేదని జైట్లీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. కేజ్రీతో పాటు.. తనపై ఆరోపణలు చేసిన ఆప్ నేతలు రాఘవ్ చద్దా, విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, దీపక్ బాజ్‌పేయిలు కూడా క్షమాపణలు చెబితే జైట్లీ ఈ విషయం గురించి పునరాలోచిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment