సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఫార్మసీ కాలేజీల్లో హడావుడి మొదలైంది. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) గురువారం నుంచి తనిఖీలు ప్రారంభించనుండటంతో కాలేజీ యాజ మాన్యాలు నానా హైరానా పడుతున్నాయి. పీసీఐ నిబంధనలకు అనుగుణంగా ఫ్యాకల్టీ, మౌలిక వసతులు ఉన్నాయని చూపించేందుకు రకరకాల మార్గాలను అనుసరిస్తున్నాయి. దీనికోసం రికార్డులను కూడా తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పీసీఐ సిబ్బంది ప్రతి కాలేజీనీ పరిశీలించి వాస్తవ పరిస్థితిపై నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే కాలేజీలకు గుర్తింపు ఇస్తుంటారు. గత రెండేళ్లు కరోనా వల్ల పెద్దగా తనిఖీలు జరగలేదు. ఈసారి ప్రత్యక్ష తనిఖీలను పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు కాలేజీలకు అధికారికంగా ఆదేశాలు కూడా జారీ చేశారు.
అద్దె లేబొరేటరీలు
చాలా ఫార్మసీ కాలేజీల్లో ఇప్పటికీ పీసీఐ నిబంధనల ప్రకారం లేబొరేటరీలు లేవనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లేబొరేటరీల తనిఖీపై పీసీఐ ప్రధానంగా దృష్టి పెట్టింది. దీంతో ఇప్పటికప్పుడు కెమికల్ లేబొరేటరీలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. లేబొరేటరీలు ఉన్న కాలేజీలతో మాట్లాడుకొని, తనిఖీ సమయంలో వాటిని తీసుకొచ్చి కాలేజీలో అమర్చుకుని తర్వాత తిరిగిచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని యాజమాన్యాలకు ఒక టి కన్నా ఎక్కువ కాలేజీలున్నాయి. వీళ్లు ఏదో ఒక కాలేజీలోనే లేబొరేటరీని కలిగి ఉన్నారు. ఇలాంటి వాళ్లు తనిఖీ సమయంలో మాయ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఫ్యాకల్టీ కోసం పాట్లు
చాలా కాలేజీల్లో సబ్జెక్టులో నిష్ణాతులైన అధ్యాపకులను నియమించట్లేదని ఆరోపణలున్నాయి. రికార్డుల్లో పీజీ, పీహెచ్‌డీ చేసిన అధ్యాపకులు అని పేర్కొంటున్నా విద్యార్థులకు బోధించే అధ్యాపకులు మాత్రం తక్కువ విద్యార్హతలు ఉన్నవాళ్లు ఉంటున్నారని విమర్శలున్నాయి. కాలేజీలో ఎవరు పనిచేస్తున్నారు, వారి అర్హతలేంటో పీసీఐ తనిఖీ చేయాల్సి ఉంది. దీని కోసం అన్ని రికార్డులు, ఫ్యాకల్టీ అందుబాటులో ఉండా లని తెలియజేసింది. దీంతో కాలేజీల యాజమాన్యాలు రికార్డుల్లో పేర్కొన్న వ్యక్తులను తనిఖీ సమయంలో రావాలని చెప్పినట్టు తెలిసింది. దీని కోసం కొంత ముట్టజెప్పేందుకు ఒప్పందమూ చేసుకున్నాయని సమాచారం. ఫ్యాకల్టీ పాన్ కార్డు ఆధారంగా వాళ్లు ఇంకెక్కడైనా ఉపాధి పొందుతున్నారా అని వివరాలు సేకరిస్తే కాలేజీల అసలు బాగోతం బయటపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
నిబంధనల అమలేదీ?
ఫార్మా కాలేజీలు నిలువు దోపిడీ చేస్తున్నాయి. పీసీఐ నిబంధనలు ఎక్కడా అమలు కావట్లేదు. వేతన సంఘం జీతాలు కాదు కదా కనీసం రూ. 20 వేలు ఇచ్చే అవకాశం లేదు. కరోనా సమయంలో ఉద్యోగుల జీతాలు ఇప్పటికీ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. అలాంటప్పుడు డిజిటల్ చెల్లింపులు ఎలా చూపిస్తారు. చిత్తశుద్ధితో తనిఖీలు చేస్తే అవకతవకలు వెలుగు చూస్తాయి.
– అయినేని సంతోష్‌కుమార్, ప్రైవేటు సాంకేతిక కాలేజీల అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment