ఆరోగ్యం పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే అందులో ఫార్మసిస్ట్ పాత్ర అత్యంత ప్రధానం. ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పలెరిగిపోతున్న వ్యాధులను దృష్టిలో ఉంచుకొని, దానికి తగినట్లుగా కొత్త మందులను తయారు చేయడం, నివారణా మార్గాలు కనుగొనడంలో ఫార్మసిస్ట్ పాత్ర కీలకం. ఔషధాల తయారీ, వాటి నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించడం, తగిన సాంకేతిక పరిజ్ఞానంతో ఔషధాలను నిల్వచేయడం, వ్యాధి గ్రస్థులకు మందుల వినియోగ విధానం పట్ల తగిన సూచనలు, సలహాలు అందజేయడం, వాటి దుష్ఫలితాల పట్ల అవగాహన కల్పించడం లాంటి అనేక విషయాల్లో ఫార్మసిస్ట్ పాత్ర విస్మరించలేనిది.
వ్యాధిని గుర్తించి, దానికి తగిన మందును సూచించేవాడు వైద్యుడైతే, ఔషధ ఎంపిక, మోతాదు, వినియోగ విధానం సమస్తమూ అవగాహన కల్పించేది ఫార్మసిస్టు. నిజం చెప్పాలంటే తెర వెనుక వైద్యుడు ఫార్మసిస్టే. అందుకే ఆరోగ్యకేంద్రాల్లో అత్యవసర పరిస్థితుల్లో వైద్యాధికారులు అందుబాటులో లేనప్పుడు చికిత్స అందించే బాధ్యత ఫార్మసిస్టులదే. కేంద్ర ఆరోగ్యశాఖ ‘జాతీయ ఆరోగ్య విధానం–2017’ ఫార్మసిస్టులకు సామాజిక ఆరోగ్యంపై శిక్షణ ఇచ్చి వారి సేవలను క్షేత్రస్థాయిలో వినియోగించుకోవాలని సూచించింది. కొన్ని సమయాల్లో వైద్యులు రాసిన మందులను సమీక్షించే అధికారం కూడా ఫార్మసిస్టుకు ఉంటుంది.
మందుల వినియోగంలో ఫార్మసిస్టుల పాత్రను విస్మరించడంవల్ల వాటి వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. తద్వారా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టి ప్రాణాంతకమైన దుష్ప్రభావాలు సంభవిస్తున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ లాంటి యూరోపియన్ దేశాల్లో, సౌదీ అరేబియా లాంటి అరబ్ దేశాల్లో ఫార్మసిస్టులకు పెద్దపీట వేస్తారు. ఆ యా దేశాల్లోని వైద్యులు పరీక్షల అనంతరం వ్యాధిని గుర్తించి, ఫలానా వ్యాధి, ఫలానా మందు అని నిర్ధారణ చేస్తారు. ఆ వ్యాధికి ఏ ఔషధం సరిపోతుందో, అది ఏయే సమయాల్లో, ఏ మోతాదులో, ఏ విధంగా వినియోగించాలో ఫార్మసిస్టే రోగికి సూచిస్తాడు.
కొన్ని యూరప్ దేశాల్లో రోగి వ్యాధిని గుర్తించి, ఔషధాన్ని సిఫారసు చేసే అధికారం కూడా ఫార్మసిస్ట్‌దే. కానీ మనదేశంలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. భారత్‌లో ఫార్మసిస్టులకు సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక, సొంత ఫార్మసీలు పెట్టుకొనే స్థోమత లేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఫార్మసిస్టు పోస్టులను భర్తీ చేయాలి. నిరుద్యోగులైన ఫార్మసిస్టులకు ఫార్మసీలు ఏర్పాటు చేసు కోడానికి వడ్డీ రహిత రుణ సౌకర్యం కల్పించాలి. ఆ విధంగా ఫార్మసిస్ట్‌ల సేవలను మరింతగా ఉపయోగించుకోవచ్చు.
– ఎమ్.డి. ఉస్మాన్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్ – కెమిస్ట్
(చదవండి: భారత సంతతి చిన్నారికి అత్యంత అరుదైన కిడ్నీ మార్పిడి..! బ్రిటన్‌లోనే తొలిసారిగా..)
Comments
Please login to add a commentAdd a comment