Flipkart Health Plus Program Launched In India - Sakshi
Sakshi News home page

ప్లిప్‌ కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్‌లే కాదు..మెడిసిన్‌ కూడా కొనుగోలు చేయొచ్చు

Published Sat, Nov 20 2021 1:49 PM | Last Updated on Sat, Nov 20 2021 4:09 PM

Flipkart Health+ launched in India  - Sakshi

ఈ–కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ తాజాగా హెల్త్‌కేర్‌ రంగంలోకి ప్రవేశించింది. ఫ్లిప్‌కార్ట్‌ హెల్త్‌+ సర్వీసులు ఆవిష్కరించింది. ఈ క్రమంలో కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న ఆన్‌లైన్‌ ఫార్మసీ సేవల సంస్థ సస్తాసుందర్‌ మార్కెట్‌ప్లేస్‌ లిమిటెడ్‌లో (ఎస్‌ఎంఎల్‌) మెజారిటీ వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ డీల్‌ విలువ ఎంతన్నది వెల్లడి కాలేదు. ఈ సంస్థ ఆన్‌లైన్‌ ఫార్మసీ, డిజిటల్‌ హెల్త్‌కేర్‌ ప్లాట్‌ఫాం సస్తాసుందర్‌డాట్‌కామ్‌ను నిర్వహిస్తోంది. నాణ్యమైన వైద్య సేవలను చౌకగా అందించేందుకు ఫ్లిప్‌కార్ట్‌ హెల్త్‌+ తోడ్పడగలదని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

ఈ–ఫార్మసీతో మొదలుపెట్టి ఈ–డయాగ్నోస్టిక్స్, ఈ–కన్సల్టేషన్‌ వంటి కొత్త హెల్త్‌కేర్‌ సర్వీసులు క్రమంగా అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్‌ హెల్త్‌+ కార్యకలాపాలను సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజయ్‌ వీర్‌ యాదవ్‌ పర్యవేక్షిస్తారు. తమకు దేశవ్యాప్తంగా ఉన్న కార్యకలాపాలు, సాంకేతిక సామర్థ్యాలు..హెల్త్‌–టెక్నాలజీ రంగంలో వినియోగదారులకు సర్వీసులు అందించడంలో సస్తాసుందర్‌కు ఉన్న అనుభవం ఫ్లిప్‌కార్ట్‌ హెల్త్‌+కు తోడ్పడగలవని ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో ఆరోగ్యంపై శ్రద్ధ మరింతగా పెరిగిందని కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రవి అయ్యర్‌ తెలిపారు. చౌకగా హెల్త్‌కేర్‌కు డిమాండ్‌ నెలకొన్న నేపథ్యంలో సస్తాసుందర్‌డాట్‌కామ్‌ ద్వారా ఈ విభాగంలో అవకాశాలు అందిపుచ్చుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.  

2013లో ప్రారంభం.. 
బీఎల్‌ మిట్టల్, రవి కాంత్‌ శర్మ 2013లో సస్తాసుందర్‌ను ప్రారంభించారు. దీనికి 490 పైచిలుకు ఫార్మసీల నెట్‌వర్క్‌ ఉంది. జపాన్‌కు చెందిన దిగ్గజాలు మిత్సుబిషి కార్పొరేషన్, రోటో ఫార్మా మొదలైనవి ఇందులో ఇన్వెస్ట్‌ చేశాయి. ప్రస్తుతం సస్తాసుందర్‌ వెంచర్స్‌ అనుబంధ సంస్థ ఎస్‌హెచ్‌బీఎల్‌ (సస్తాసుందర్‌ హెల్త్‌బడ్డీ) .. ఎస్‌ఎంఎల్‌లో తనకున్న వాటాలు విక్రయిస్తోంది. 2021 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎస్‌ఎంఎల్‌ స్టాండెలోన్‌ టర్నోవరు రూ. 2.58 కోట్లుగాను, నికర విలువ రూ. 4.17 కోట్లుగాను నమోదయ్యాయి. కస్టమర్లకు సులభతరంగా, సౌకర్యవంతంగా నిఖార్సయిన ఔషధాలు, వైద్యపరీక్షలు తదితర సర్వీసులు అందించేందుకు వినూత్న ఆవిష్కరణలపై దృష్టి పెడుతున్నామని సంస్థ వ్యవస్థాపకులు బీఎల్‌ మిట్టల్, రవి కాంత్‌ శర్మ తెలిపారు.  

చదవండి: ఆంధ్రప్రదేశ్‌లో అమెజాన్‌ డెలివరీ స్టేషన్‌, ఎక్కడంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement