సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గత నెల ఆరో తేదీన ఈమేరకు ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపగా, అందులో కొన్ని సందేహాలను నివృత్తి చేసుకుని గత గురువారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దానిపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ బిల్లును చట్టరూపంగా ఇప్పుడు అమలులోకి తెస్తూ, సెప్టెంబరు 15వ తేదీతో మంగళవారం గెజిట్ నోటిఫికేషన్‌ను న్యాయ శాఖ కార్యదర్శి జారీ చేశారు. దీంతో 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా మారినట్టయింది.
ఇక విలీన విధివిధానాలను ఖరారు చేసేందుకు కమిటీని నియమిస్తూ ప్రభుత్వం త్వరలో ఉత్తర్వు జారీ చేయనుంది. ఆ కమిటీ కూలంకుషంగా పరిశీలించి, ఆర్టీసీ ఉద్యోగులు– ప్రభుత్వంలో ఏయే కేడర్‌లతో సమంగా ఉండాలి, వారి పే స్కేల్ ఎలా ఉండాలి, రిటైర్మెంట్ వయసు, పింఛన్ విధానం, ప్రస్తుతం ఆర్టీసీలో కొనసాగుతున్న ప్రత్యేక ఆర్థిక బెనిఫిట్స్ ఉండాలా వద్దా.. వంటి చాలా అంశాలపై స్పష్టతనిస్తూ ప్రభుత్వానికి సిఫారసులు అందించనుంది. వాటిని ఏ రోజు నుంచి అమలులోకి తేవాలో ఓ అపాయింటెడ్ డేæను కూడా ఖరారు చేయాల్సి ఉంది.
ఈ నెల జీతాలు ఆర్టీసీ నుంచేనా?
గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో.. వచ్చే నెల జీతాలను ప్రభుత్వం చెల్లిస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు. కానీ, ట్రెజరీ వేతనాలు ఎప్పటి నుంచి చెల్లించాలో స్పష్టం చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వు జారీ చేయాల్సి ఉన్నందున, అప్పటి వరకు ఆర్టీసీ నుంచే యథావిధిగా జీతాలు చెల్లించాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. వీలైనంత తొందరలో ఉత్తర్వు జారీ అయితే ఆ సందిగ్ధం వీడుతుందంటున్నారు. కాగా ప్రస్తుతం ఆర్టీసీ ఎంత చెల్లిస్తుందో, ప్రభుత్వం కూడా అంతే చెల్లిస్తుందని, విధివిధానాలు ఖరారయ్యాక అసలు జీతాలపై స్పష్టత వస్తుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment