ఆర్టీసీ ఉద్యోగుల విలీనం చరిత్రాత్మకం | RTC employees to be absorbed in Govt from Jan 1 | Sakshi
Sakshi News home page

ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం చరిత్రాత్మకం

Published Tue, Dec 17 2019 4:30 AM | Last Updated on Tue, Dec 17 2019 11:27 AM

RTC employees to be absorbed in Govt from Jan 1 - Sakshi

ఆర్టీసీలో రిటైర్మెంట్‌ వయసు 58 ఏళ్లే. దానిని 60 ఏళ్లకు పెంచాలని చంద్రబాబును వేడుకున్నారు. మా జీవితాలు కూడా బాగుపడతాయి, మేం కూడా ప్రభుత్వ రంగ సంస్థలోనే ఉన్నాం కదా, మాక్కూడా రిటైర్మెంట్‌ వయస్సు పెంచండి అని అంటే   చంద్రబాబు అస్సలు పట్టించుకోలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లు అడక్కపోయినా కూడా రిటైర్మెంట్‌ వయస్సు 60 సంవత్సరాలకు పెంచుతూ ముందుగానే ఆదేశాలు జారీ చేశాం. ఆ తర్వాతే విలీన ప్రక్రియ మొదలుపెట్టాం.

సాక్షి, అమరావతి: జనవరి 1వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులేనని ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చారిత్రాత్మకమని చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లుకు శాసన సభ సోమవారం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ.. సుమారు 52 వేల మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు తెలిపారు. వీరంతా జనవరి 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణి అవుతారని అన్నారు.

అధికారంలో ఉన్న అయిదేళ్లపాటు చంద్రబాబు ఆర్టీసీ కార్మికులను పట్టించుకోలేదని, ఇప్పుడు టీడీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం కాకుండా గతంలో చంద్రబాబు చట్టం తెచ్చిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. అందుకే ఆర్టీసీ విలీనం కోసం చారిత్రాత్మక బిల్లును ప్రవేశపెట్టామని తెలిపారు. ఇంకా సీఎం వై.ఎస్‌. జగన్‌ ఏమన్నారంటే..  సభలో ఇన్ని మేజర్‌ బిల్లులపై చర్చ జరుగుతుంటే చంద్రబాబు సభలో కనిపించరు.

వాళ్ల ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు కాళ్లా, వేళ్లా పడ్డారు. ‘కనికరించండయ్యా.. విలీనం చేయండయ్యా’ అని వేడుకున్నా, ఏమాత్రం కూడా కనికరించకుండా ఈ పెద్ద మనుషులు వాళ్లకు పూర్తిగా అన్యాయం చేశారు. ఈరోజు మైక్‌ పుచ్చుకుని ఆర్టీసీ కార్మికులే కాదు, ఆర్టీసీలో ఉన్న కాంట్రాక్టు కార్మికులను కూడా విలీనం చేయండి అని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. విలువలతో, విశ్వసనీయతతో కూడినదే రాజకీయం అంటారు. కానీ వీళ్ల మాటలు, వీళ్ల చేతలు చూసినప్పుడు రాజకీయాలు ఏ మేరకు దిగజారిపోయాయో అని బాధనిపిస్తోంది.

ఇది చరిత్రాత్మకమైన బిల్లు  
ఈ బిల్లు ఎందుకు ప్రవేశపెట్టాల్సి వస్తున్నదన్నది అందరూ ప్రశ్నించుకోవాలి. 1997లో చంద్రబాబు ఒక చట్టం చేశారు. దాని ప్రకారం ప్రభుత్వ రంగ సంస్ధల్లో ఉన్న ఏ ఒక్క ఉద్యోగీ ప్రభుత్వంలో విలీనం కావడానికి వీలు లేదు. అందుకే ఇవాళ విలీనం చేసేందుకు కొత్తగా ఇంకో బిల్లు తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. ఇది ఓ చరిత్రాత్మకమైన బిల్లు. దీని ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీలోని ఉద్యోగులందరూ ప్రభుత్వంలో విలీనం అవుతారు. ఏ రకంగా అయితే ఇరిగేషన్,  హోం డిపార్ట్‌మెంట్‌ ఉన్నాయో, ఏ రకంగా అయితే సివిల్‌ సఫ్లైస్, మున్సిపాల్టీ, పంచాయితీ రాజ్, అలా డిఫరెంట్, డిఫరెంట్‌ డిపార్ట్‌మెంట్స్‌ ఉన్నాయో అదే విధంగా ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కింద వీళ్లందరినీ తీసుకుంటాం.   

ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా ఆర్టీసీ సిబ్బంది
సాక్షి, అమరావతి: ఆర్టీసీ సిబ్బంది ప్రజా రవాణా శాఖ (పీటీడీ) ఉద్యోగులుగా మారనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన బిల్లును శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో ప్రస్తుతం ఆర్టీసీలోని అన్ని విభాగాల్లో పని చేస్తున్న 51,488 మంది జనవరి 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారతారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో భాగంగా ఆ సంస్థ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లో చేర్చుకోవటానికి సంబంధించిన బిల్లును రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (పేర్ని నాని) సోమవారం శాసన సభలో ప్రవేశపెట్టారు.

సభలో చర్చ అనంతరం సభ్యుల హర్షధ్వానాల మధ్య బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. పీటీడీలో అన్ని విభాగాల్లో మొత్తం 58,953 మంది ఉద్యోగులకు ఆమోదం లభించింది. ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు పీటీడీలో విలీనమైన వెంటనే చెల్లిస్తారు. విలీనం తర్వాత ప్రభుత్వంపై ఏడాదికి సుమారుగా రూ.3,600 కోట్లు (నెలకు రూ.300 కోట్లు) ఆర్ధిక భారం పడుతుంది. ప్రస్తుతం ఉన్న రూ.3,688 కోట్ల తక్షణ చెల్లింపుల బాకీలు 2019–20, 2020–21 సంవత్సరాల్లో తీరిపోతే, 2021–22 సంవత్సరానికి రూ.687 కోట్లు నికర మిగులు ఉంటుందని మంత్రి పేర్ని నాని అసెంబ్లీకి సమర్పించిన ఆర్ధిక మెమొరాండంలో వివరించారు.


ఆర్టీసీ ఉద్యోగుల విలీనం నభూతో..
ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లును ఆమోదించడం నభూతో.. అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. రూ. 6934 కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటే ఎంతో ధైర్యం, మానవత ఉండాలన్నారు.    ‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో దాదాపు రూ.3,600 కోట్లు వేతనాల రూపంలో ప్రభుత్వం భారం తీసుకుంది. చిరునవ్వుతో ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ఉద్యోగుల జీవితాల్లో ఈ రోజు వెలుగులు నింపాలి. వారందరికీ పండగ దినం కావాలి’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement