సాక్షి, అమరావతి/గాంధీనగర్ (విజయవాడ): స్వార్థ రాజకీయాలకు వంతపాడబోమని, అందుకే తామెవ్వరం సమ్మెలో పాల్గొనడం లేదని ఆర్టీసీ ఉద్యోగులు స్పష్టం చేశారు. పీఆర్సీ సాధన సమితి చేస్తున్న రాజకీయాలకు ప్రజా రవాణా విభాగం (పీటీడీ) వంత పాడదని చెప్పారు. సమ్మెను ఎదుర్కొంటామని తెలిపారు. పీటీడీలో అతిపెద్ద సంఘాల్లో ఒకటైన వైఎస్సార్ ఈఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. రాష్ట్ర, జోనల్, డివిజనల్, నాన్ ఆపరేషన్ నాయకులు అధిక సంఖ్యలో సమావేశంలో పాల్గొన్నారు. సమ్మె ఆవశ్యకత, జేఏసీల తీరుపై సుదీర్ఘంగా చర్చించారు.
ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లేది లేదని సంఘం 13 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు తేల్చి చెప్పారు. పీఆర్సీ సాధన సమితికి పలు ప్రశ్నలు సంధించారు. ఈ వివరాలను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు డీఎస్పీ రావు, ప్రధాన కార్యదర్శి ఎం.అబ్రహాం, ముఖ్య ఉపాధ్యక్షుడు జేఎం నాయుడు మీడియాకు తెలిపారు. పీటీడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎల్లవేళలా సిద్ధమని చెప్పారు. చర్చల ద్వారా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని, సమ్మెలో పాల్గొనవద్దని ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
ఆర్టీసీని వాడుకోవాలని జేఏసీ చూస్తోంది
‘ఆర్టీసీ రూ.6,900 కోట్ల నష్టంలో ఉంది. ప్రతి నెలా రూ.150 కోట్లు అప్పు చేస్తే కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఆర్టీసీ ఏమవుతుందో అనుకున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేవదూతలా వచ్చి సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశారు. ఉద్యోగులు ఎవరూ కోరలేదు. పోరాటాలు చేయలేదు. అయినా ఇచ్చిన మాట కోసం ప్రభుత్వంలో విలీనం చేసి చరిత్ర సృష్టించారు. 54 వేల మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చారు. ఆర్టీసీ నుంచి రూపాయి ఆదాయం రాకపోయినా రూ.6 వేల కోట్లు జీతభత్యాలు చెల్లించి ఉద్యోగులను ఆదుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి ఎటువంటి మెమోరాండం ఇవ్వకుండా, చర్చలు జరపకుండా కొందరు హఠాత్తుగా బస్సులు నిలిపివేస్తామనడం సరికాదు. ఆర్టీసీ బస్సులు ఆగిపోతే ఎన్జీవోల సమ్మెకు ఉపయోగం. ఆర్టీసీ ఉద్యోగులను వాడుకోవాలని జేఏసీ చూస్తోంది. మనకు సంబంధం లేని సమ్మెలోకి వెళ్లొద్దు. అడుగడుగునా సమ్మెను అడ్డుకోవాలి’ అని ఆర్టీసీ ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్టీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చల్లా చంద్రయ్య
పీఆర్సీ సాధన సమితికి సంధించిన ప్రశ్నలివీ
► పీఆర్సీ సాధన సమితి ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో పీటీడీ ఉద్యోగుల అంశాలు ఏమైనా ఉన్నాయా?
► మీరు పెట్టిన 75 డిమాండ్లలో పీటీడీ ఉద్యోగులకు సంబంధించినవి ఎన్ని? ఎన్నింటిపై చర్చించారు? ఎన్ని సాధించారు?
► పీటీడీ ఉద్యోగులకు వేతన స్థిరీకరణ, క్యాడర్, ఫిట్‌మెంట్, ఇళ్ల స్థలాలు ఏ మేరకు ఇస్తారో తెలియక ముందే మీ స్వార్థం కోసం సమ్మెకు ఉసిగొల్పడం ఎంత వరకు సమంజసం?
► ఈ ఉద్యమం నాయకుల మనుగడ కోసమా? ఉద్యోగుల మేలు కోసమా? అనేది అర్థంకాని పరిస్థితి ఉద్యోగుల్లో ఉంది.
►పీఆర్సీ సాధన సమితి స్వార్థ రాజకీయాలకు పీటీడీలోని సంఘాలు ఎందుకు వంత పాడుతున్నాయి? దీని ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకొంటున్నాయి?
ఇదీ మా వినతి
‘పీటీడీ ఉద్యోగులకు క్యాడర్, వేతన స్థిరీకరణ, ఫిక్సేషన్ అమలు చేయాలి. పాత పెన్షన్ సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు, పీటీడీ ఉద్యోగుల జీత భత్యాల్లో వ్యత్యాసం ఉన్న 19 శాతం ఫిట్‌మెంట్‌ను వర్తింపజేయాలి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇవ్వాలి. బకాయిలు చెల్లించాలి. ఇహెచ్‌ఎస్ ద్వారా మెరుగైన వైద్య సదుపాయం అందించాలి. కారుణ్య నియామకాలు 2016 నుంచి చేపట్టాలి’ అని ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
APSRTC: సమ్మెలోకి మమ్మల్ని లాగొద్దు
Published Sun, Jan 30 2022 2:16 AM | Last Updated on Sun, Jan 30 2022 2:58 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment