
నామినేషన్‌కు ముందు బూర ఊదుతున్న లక్ష్మణ్. చిత్రంలో బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్/కొత్తగూడెం: రాష్ట్రంలో డిసెంబర్ 7న జరుగనున్న శాసనసభ ఎన్నికలకు ఈసీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనుంది. ఈ నెల 19 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు 22తో ముగియనుంది. డిసెంబర్ 7న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా 13 నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని గంట ముందుగానే ముగించాలని ఈసీ నిర్ణయించింది.
106 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. కానీ గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఐదు జిల్లాల్లోని 13 నియోజకవర్గాల్లో 4 గంటల వరకే పోలింగ్ జరపాలని నిర్ణయించింది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలకు సరిహద్దులో ఉన్న ఈ నియోజకవర్గాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉండడంతో హోంశాఖ సూచనల మేరకు ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భద్రత కారణాల నేపథ్యంలో ఈవీఎంలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చేందుకు వీలుగా షెడ్యూల్ రూపొందించారు. వీటిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, కొత్తగూడెం, పినపాక, అశ్వారావుపేట, ఇల్లెందు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లా పరిధిలోని మంథని, మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో ఉన్నాయి.
డేగకళ్లతో నిఘా..
భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల, వెంకటాపురం మండలాల్లో గతంలో ఉనికిలో లేకుండా పోయిన డివిజన్ కమిటీలు ఇప్పుడు క్రియాశీలకంగా మారాయని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలు ఇచ్చింది. ఎన్నికలు బహిష్కరించాలంటూ మావోయిస్టులు బ్యానర్లు కట్టడంతో పాటు వాటి కింద మందుపాతరలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో గెరిల్లా దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐజీ నాగిరెడ్డి ఈ ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు.
తొలి రోజు నామినేషన్లు పార్టీల వారీగా..
తొలి రోజు 38 నియోజకవర్గాల పరిధిలో 48 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్‌ఎస్ నుంచి 10 మంది, బీజేపీ నుంచి 9, కాంగ్రెస్ నుంచి 6, టీడీపీ, పీపీఐ, ఆప్, బీఎల్‌ఎఫ్ నుంచి చెరో ఇద్దరు, సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ, బీఎస్పీ నుంచి ఒక్కొక్కరు, 11 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment