సైబరాబాద్ కమిషనరేట్లకు రాజముద్ర
* సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ విభజన, పరిధి పెంపు ఇక అధికారికం
* గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన గవర్నర్
* జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చినట్టుగా ఆర్డినెన్స్
* ఇక నూతన కమిషనరేట్ల నుంచే కొత్త ఠాణాల పాలన
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల విభజన, పరిధి పెంపు పరిపూర్ణమైంది. జూన్ 15న సైబరాబాద్ కమిషనరేట్‌ను సైబరాబాద్ ఈస్ట్, సైబరాబాద్ వెస్ట్‌గా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచి ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చినట్టుగా గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ శని వారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
2 కమిషనరేట్ల పరిధి, విధివిధానాలకు సంబంధించిన చట్టాన్ని శాసనసభ ఆమోదించాల్సి ఉండటం.. ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో శాంతిభద్రతల కోణంలో దీని ఆవశ్యకతను గుర్తించి గవర్నర్ ‘రాజముద్ర’ వేశారు. కాగా, నగర శివారు ప్రాంతాల్లో పట్టణీకరణ ఊపందుకుంటుండటంతో పాటు భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగాఅవసరాలను బట్టి ఇతర జిల్లాలోని ఠాణాలను కలుపుకునేలా, లేదంటే ఇతర ప్రాంత పరిధిలోకి ఠాణాలు ఇచ్చేలా అధికారాలు కల్పిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్‌ను రాచకొండ పోలీసు కమిషనరేట్‌గా, సైబరాబాద్ వెస్ట్ కమిషనరేట్‌ను సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌గా మార్చేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో తాజా ఆర్డినెన్స్ ప్రకారం త్వరలోనే ఉత్తర్వులు రానున్నాయి.
ఇప్పటికే సైబరాబాద్ ఈస్ట్ పోలీసు కమిషనర్‌గా మహేష్ ఎం.భగవత్, సైబరాబాద్ వెస్ట్ పోలీసు కమిషనర్‌గా నవీన్ చంద్ బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జోన్‌కు ఎస్పీ స్థాయి అధికారి డీసీపీ హోదాలో, డివిజన్‌కు డీఎస్పీ స్థాయి అధికారి ఏసీపీ హోదాలో నేతృత్వం వహిస్తారు.
సైబరాబాద్ ఈస్ట్‌లోకి భువనగిరి జోన్..
సైబరాబాద్ ఈస్ట్ పరిధిలో ఎల్బీనగర్, మల్కాజిగిరి జోన్లు ఉండగా తాజాగా భువనగిరి జోన్ వచ్చి చేరనుంది. భువనగిరి జోన్‌లో భువనగిరి, చౌటుప్పల్ డివిజన్లు ఉండనున్నాయి. మల్కాజిగిరి జోన్‌లో మల్కాజిగిరి, కుషాయిగూడ డివిజన్లు ఉంటాయి. ఎల్‌బీనగర్ జోన్‌లో ఎల్‌బీనగర్, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం డివిజన్లు ఉండనున్నాయి. మల్కాజిగిరి జోన్ పరిధిలో ఉన్న కీసర, ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్లతో పాటు భువనగిరి టౌన్ అండ్ రూరల్, బొమ్మలరామారం, బీబీ నగర్ ఠాణాలు భువనగిరి జోన్‌లోకి వచ్చాయి. మ ల్కాజ్‌గిరి జోన్ పరిధిలోని అల్వాల్ డివిజన్‌ను కుషాయిగూడ డివిజన్‌గా పిలుస్తారు.
శంషాబాద్ జోన్‌లోకి షాద్‌నగర్ డివిజన్..
సైబరాబాద్ వెస్ట్ పరిధిలో శంషాబాద్, మాదాపూర్, బాలానగర్ జోన్లు ఉండనున్నాయి. శంషాబాద్ జోన్‌లో శంషాబాద్, రాజేంద్రనగర్ డివిజన్లతో పాటు కొత్తగా మహబూబ్‌నగర్‌కు చెందిన షాద్‌నగర్ డివిజన్ చేరనుంది. మాదాపూర్ జోన్‌లో మాదాపూర్, కూకట్‌పల్లి డివిజన్లతో పాటు కొత్తగా మియాపూర్ డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. బాలానగర్ జోన్‌లో పేట్ బషీరాబాద్, బాలానగర్ డివిజన్లు ఉంటాయి. షాద్‌నగర్, కొందుర్గు, కేశంపేట్, కొత్తూరు ఠాణాలు షాద్‌నగర్ డివిజన్ పరిధిలో ఉంటాయి. శంషాబాద్ డివిజన్‌లో ప్రస్తుతమున్న శంషాబాద్, ఆర్‌జీఐ పోలీసు స్టేషన్లతో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన చేవేళ్ల, షాబాద్ ఠాణాలు చేరనున్నాయి.
బాధ్యత మరింత పెరిగింది..
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తూ గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకురావడం ఆనందంగా ఉంది. ఇతర జిల్లాల్లోని మరిన్ని ఠాణాలు మా పరిధిలోకి రానుండటంతో మరింత బాధ్యత పెరిగినట్టైంది. ఇది మాకు చాలెంజ్ లాంటిదైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. కమిషనరేట్ల పరిధి పెంపుతో ఇక నుంచి సమర్థవంతంగా పనిచేస్తాం. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరువవుతాం.
- మహేష్ భగవత్, నవీన్ చంద్, సైబరాబాద్ కమిషనర్లు