Cyberabad zone
-
సైబరాబాద్ కమిషనరేట్లకు రాజముద్ర
* సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ విభజన, పరిధి పెంపు ఇక అధికారికం * గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన గవర్నర్ * జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చినట్టుగా ఆర్డినెన్స్ * ఇక నూతన కమిషనరేట్ల నుంచే కొత్త ఠాణాల పాలన సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల విభజన, పరిధి పెంపు పరిపూర్ణమైంది. జూన్ 15న సైబరాబాద్ కమిషనరేట్‌ను సైబరాబాద్ ఈస్ట్, సైబరాబాద్ వెస్ట్గా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచి ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చినట్టుగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శని వారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 2 కమిషనరేట్ల పరిధి, విధివిధానాలకు సంబంధించిన చట్టాన్ని శాసనసభ ఆమోదించాల్సి ఉండటం.. ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో శాంతిభద్రతల కోణంలో దీని ఆవశ్యకతను గుర్తించి గవర్నర్ ‘రాజముద్ర’ వేశారు. కాగా, నగర శివారు ప్రాంతాల్లో పట్టణీకరణ ఊపందుకుంటుండటంతో పాటు భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగాఅవసరాలను బట్టి ఇతర జిల్లాలోని ఠాణాలను కలుపుకునేలా, లేదంటే ఇతర ప్రాంత పరిధిలోకి ఠాణాలు ఇచ్చేలా అధికారాలు కల్పిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్‌ను రాచకొండ పోలీసు కమిషనరేట్‌గా, సైబరాబాద్ వెస్ట్ కమిషనరేట్‌ను సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌గా మార్చేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో తాజా ఆర్డినెన్స్ ప్రకారం త్వరలోనే ఉత్తర్వులు రానున్నాయి. ఇప్పటికే సైబరాబాద్ ఈస్ట్ పోలీసు కమిషనర్‌గా మహేష్ ఎం.భగవత్, సైబరాబాద్ వెస్ట్ పోలీసు కమిషనర్‌గా నవీన్ చంద్ బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జోన్‌కు ఎస్పీ స్థాయి అధికారి డీసీపీ హోదాలో, డివిజన్‌కు డీఎస్పీ స్థాయి అధికారి ఏసీపీ హోదాలో నేతృత్వం వహిస్తారు. సైబరాబాద్ ఈస్ట్‌లోకి భువనగిరి జోన్.. సైబరాబాద్ ఈస్ట్ పరిధిలో ఎల్బీనగర్, మల్కాజిగిరి జోన్లు ఉండగా తాజాగా భువనగిరి జోన్ వచ్చి చేరనుంది. భువనగిరి జోన్లో భువనగిరి, చౌటుప్పల్ డివిజన్లు ఉండనున్నాయి. మల్కాజిగిరి జోన్లో మల్కాజిగిరి, కుషాయిగూడ డివిజన్లు ఉంటాయి. ఎల్బీనగర్ జోన్లో ఎల్బీనగర్, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం డివిజన్లు ఉండనున్నాయి. మల్కాజిగిరి జోన్ పరిధిలో ఉన్న కీసర, ఘట్కేసర్ పోలీసుస్టేషన్లతో పాటు భువనగిరి టౌన్ అండ్ రూరల్, బొమ్మలరామారం, బీబీ నగర్ ఠాణాలు భువనగిరి జోన్లోకి వచ్చాయి. మ ల్కాజ్గిరి జోన్ పరిధిలోని అల్వాల్ డివిజన్‌ను కుషాయిగూడ డివిజన్‌గా పిలుస్తారు. శంషాబాద్ జోన్లోకి షాద్‌నగర్ డివిజన్.. సైబరాబాద్ వెస్ట్ పరిధిలో శంషాబాద్, మాదాపూర్, బాలానగర్ జోన్లు ఉండనున్నాయి. శంషాబాద్ జోన్లో శంషాబాద్, రాజేంద్రనగర్ డివిజన్లతో పాటు కొత్తగా మహబూబ్‌నగర్‌కు చెందిన షాద్‌నగర్ డివిజన్ చేరనుంది. మాదాపూర్ జోన్లో మాదాపూర్, కూకట్పల్లి డివిజన్లతో పాటు కొత్తగా మియాపూర్ డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. బాలానగర్ జోన్లో పేట్ బషీరాబాద్, బాలానగర్ డివిజన్లు ఉంటాయి. షాద్‌నగర్, కొందుర్గు, కేశంపేట్, కొత్తూరు ఠాణాలు షాద్‌నగర్ డివిజన్ పరిధిలో ఉంటాయి. శంషాబాద్ డివిజన్లో ప్రస్తుతమున్న శంషాబాద్, ఆర్జీఐ పోలీసు స్టేషన్లతో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన చేవేళ్ల, షాబాద్ ఠాణాలు చేరనున్నాయి. బాధ్యత మరింత పెరిగింది.. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తూ గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకురావడం ఆనందంగా ఉంది. ఇతర జిల్లాల్లోని మరిన్ని ఠాణాలు మా పరిధిలోకి రానుండటంతో మరింత బాధ్యత పెరిగినట్టైంది. ఇది మాకు చాలెంజ్ లాంటిదైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. కమిషనరేట్ల పరిధి పెంపుతో ఇక నుంచి సమర్థవంతంగా పనిచేస్తాం. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరువవుతాం. - మహేష్ భగవత్, నవీన్ చంద్, సైబరాబాద్ కమిషనర్లు -
సైబరాబాద్ /2
విభజన ఉత్తర్వులు జారీ కొత్త కమిషనర్లుగా నవీన్‌చంద్, భగవత్ ఖరారు? 14 ఏళ్లలో నలుగురు కమిషనర్లు.. సిటీబ్యూరో: విస్తరిస్తున్న ఐటీ రంగం, పాలనా పరమైన సౌలభ్యం కోసం 2002లో ఏర్పాటైన సైబరాబాద్ కమిషనరేట్ రెండుగా విడిపోయింది. దీన్ని ఈస్ట్, వెస్ట్ కమిషనరేట్లుగా విభజిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి సైబరాబాద్‌కు మహేందర్‌రెడ్డి తొలి, సీవీ ఆనంద్ తుది కమిషనర్లుగా సేవలందించారు. ఈ పద్నాలుగేళ్ల కాలంలో నలుగురు ఐపీఎస్ అధికారులు పోలీసు కమిషనర్లుగా పనిచేశారు. నగర శివారు ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమలు రావడం ద్వారా అభివృద్ధి, జనాభా పెరుగుదలతో పాటు నేరాల సంఖ్య కూడా పెరిగింది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నుంచి వేరు చేసిన ప్రాంతాలతో 2002 నవంబర్ 15న ‘సైబరాబాద్ కమిషనరేట్’ను (ఐటీ పరిశ్రమల వల్ల ఈ పేరు వచ్చింది) ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2003 ఫిబ్రవరిలో తొలి కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఎం.మహేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఈయన హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. అప్పట్లో రంగారెడ్డి జిల్లాలో ఆరు సబ్డివిజన్లు ఉండగా, వీటిలో ఐదు బాలానగర్, మల్కాజిగిరి, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, అల్వాల్ డివిజన్‌ను సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో కలిపారు. ఈ డివిజన్ల పరిధిలో 34 పోలీసు స్టేషన్లు ఉండేవి. అయితే 19 ఠాణాలతో కూడిన వికారాబాద్ డివిజన్‌ను రంగారెడ్డి జిల్లా రూరల్‌గా మార్చి ఎస్పీ అధికారిని నియమించారు. స్వరూపం మారుతూ.. మహేందర్ రెడ్డి డీఐజీ హోదాలో కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2004లో కమిషనర్ పోస్టును ఐజీ హోదాకు అప్‌గ్రేడ్ చేశారు. ఆ సమయంలో పదోన్నతి రావడంతో మహేందర్ రెడ్డిని కొనసాగించారు. కమిషనరేట్ పరిధి పెంచేందుకు 2004లో ఎల్బీనగర్, అల్వాల్, బాలానగర్ జోన్లను ఏర్పాటు చేశారు. వీటికి డీసీపీ స్థాయి అధికారిని నియమించారు. అలాగే ఒక క్రైమ్ డీసీపీ, ట్రాఫిక్ డీసీపీని కూడా నియమించారు. 2006-07లో ఐదు డివిజన్లకు తోడు మరో నాలుగు కొత్త డివిజన్లు ఏర్పాటు చేశారు. 2011-12లో రెండు డివిజన్లు కొత్తవి ఏర్పాటు చేయడంతో వాటి సంఖ్య 11 డివిజన్లకు చేరింది. 2013లో శంషాబాద్, మాదాపూర్ జోన్లను ఏర్పాటు చేసి కమిషనరేట్ పరిధిని మరింత పెంచారు. అదే సమయంలో జాయింట్ సీపీ పోస్టును కూడా మంజూరు చేశారు. ఠాణాల పెంపు ఇలా: సైబరాబాద్ కమిషనరేట్‌లో 2003లో 36 ఠాణాలు ఉండగా, 2007లో మరో నాలుగు ఠాణాలు ఏర్పాటయ్యాయి. 2012-13లో మీర్‌పేట, చైతన్యపురి, పేట్ బషీరాబాద్, మియాపూర్ ఠాణాలు, 2014 చివర్లో జవహర్‌నగర్, జగద్గిరిగుట్ట, 2015 జనవరిలో ఆదిభట్ల ఠాణాలు ప్రారంభమయ్యాయి. దీంతో సైబరాబాద్ పరిధిలో లా అండ్ ఆర్డర్ స్టేషన్ల సంఖ్య 45కు, ట్రాఫిక్ ఠాణాలు 12కు చేరాయి. సైబరాబాద్‌కు తొలి కమిషనర్‌గా డీఐజీ హోదాలో మహేందర్‌రెడ్డి, ఆఖరి కమిషనర్‌గా అదనపు డీజీ హోదాలో సీవీ ఆనంద్ పనిచేశారు. -
మయూరాలపై వీకెండ్ ‘వయలెన్స్’!
⇒విషం పెట్టి చంపుతున్న గుర్తు తెలియని దుండగులు ⇒రాయదుర్గం పాన్‌మక్తా గుట్టల్లో వారాంతాల్లోనే వరుసగా ఘటనలు ⇒తెల్లారేసరికి మాయమవుతున్న నెమలి కళేబరాలు ⇒తాజాగా శనివారం రాత్రి ఆరు మయూరాలు మృత్యువాత ⇒ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు, జంతు ప్రేమికులు రాయదుర్గం: సైబరాబాద్ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో వారాంతాల్లో నెమళ్లు అంతమవుతున్నాయి. ఈ జాతీయ పక్షికి గుర్తుతెలియని విషం పెట్టి చంపేస్తున్నారు. శనివారం రాత్రి ఏకంగా ఆరు మయూరాలు చనిపోయాయి. వీటిలో నాలుగింటి కళేబరాలు లభించగా... మరో రెండింటికి చెందిన ఈకలు మాత్రమే పడి ఉన్నాయి. రాయదుర్గం పాక్మక్తా గుట్టల్లో వరుసగా నాలుగైదు వారాలుగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. కొన్ని ఉదంతాల్లో నెమలీకలు మాత్రమే మిగులుతుండగా... శనివారం రాత్రి నాలుగు నెమళ్ళ కళేబరాలూ కనిపించాయి. మనుషులపై ప్రభావం చూపని విషం పెట్టి మయూరాలను చంపేస్తున్న దుండగులు ఆనక వాటి మాంసాన్ని తీసుకువెళ్తున్నారని స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనలపై ఇటు అటవీ శాఖ అధికారులు, అటు పోలీసులు పట్టించుకోట్లేదని ఆరోపిస్తున్నారు. ఆ ప్రాంతం నెమళ్లకు ఆలవాలం... గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయానికి సమీపంలో ఉన్న రాయదుర్గం పాన్‌మక్తా శివారులోని దుర్గం చెరువు గుట్టల్లో ఏళ్ళుగా వందలాది నెమళ్లు నివసిస్తున్నాయి. ప్రతినిత్యం కనీసం 20 నుంచి 50 దాకా మయూరాలు గుంపులుగా నడుచుకుంటూ గుట్ట శివారు ప్రాంతాల్లో కలియ దిరగడంతో పాటు గుట్టలపై పురివిప్పి ఆడుతూ చుట్టుపక్కల వారితో పాటు ఆ మార్గంలో వెళ్లే వారికీ ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. ఆ ప్రాంతంలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలోని పశువుల కొట్టం ఈ నెమళ్లకు సుపరిచితం. అక్కడ పశువులున్నప్పటికీ నిర్భయంగా నడుచుకుంటూ వచ్చి నీళ్ళు తాగడం, పశువుల కోసం పెట్టిన దాణా తినడం చేసి తమ దారిన వెనక్కు వెళ్లిపోతుంటాయి. నెల్లాళ్ళుగా వరుస ఘటనలు... పాన్‌మక్తా శివారు గుట్టల్లో ఉండే నెమళ్లు నెల రోజులుగా మృత్యువాత పడటం స్థానికుల్ని కలిచి వేస్తోంది. ఈ ఘటనలు వరుసగా వీకెం డ్స్లోనే చోటు చేసుకుంటున్నాయని వారు చెప్తున్నారు. శునివారం ఓ నెమలి నురుగులు కక్కుతూ, ఎగురలేక స్థితిలో నెమ్మదిగా నడచి వెళ్ళడాన్ని గుట్టల్లో పశువులు మేపుకునే ఓ కాపరి గమనించాడు. దాన్ని దగ్గరకు తీసుకుని నీళ్ళు పట్టించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. కొద్దిసేపటికే అవి చనిపోవడంతో స్థానికులకు విషయం చెప్పారు. ఆది వారం గుట్టల్లోకి వెళ్లిన స్థానికులు, భజరంగ్‌దళ్ నాయకులు నాలుగు నెమళ్ల కళేబరాలను గుర్తించారు. దీనికి సమీపంలోనే ముళ్ళ పొద ల్లో మరో రెండు నెమళ్ళకు సంబంధించిన ఈకలు పడి ఉండటాన్ని గమనించారు. వేటాడుతున్నారనే అనుమానాలు... మయూరాలకు సంబంధించి వరుసగా చోటు చేసుకున్న ఘటనల్ని గమనించిన స్థానికులు వేటగాళ్ల పనిగా అనుమానిస్తున్నారు. ప్రధానంగా వారాంతాల్లోనే ఈ ఘటనలు చోటు చేసుకోవడంతో తమ అనుమానాలు బలపడుతున్నామయని వ్యాఖ్యానిస్తున్నారు. మనుషులపై ప్రభావం చూపని గుర్తుతెలియని విషాన్ని వేటగాళ్లు వినియోగిస్తున్నట్లు అనుమానాలున్నాయి. దీని ప్రభావంతో చనిపోయిన నెమళ్ళను సేకరిస్తున్న వేటగాళ్ళు మాంసం కోసం వాటిని తీసుకువెళ్తున్నట్లు ఆరోపిస్తున్నారు. రెండు వారాలుగా నెమళ్ళు సాయంత్రం కనబడినా మరుసటి రోజుకు మాయం అవుతున్నాయని, ఈ నేపథ్యంలోనే వేటగాళ్ల పనిగా అనుమానిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటనలపై విచారణ చేపట్టాలి: భజరంగ్‌దళ్ నాయకుల డిమాండ్ రాయదుర్గం శివారు గుట్టల్లో ఉండే నెమళ్లు నెల రోజులుగా మృత్యువాత పడుతున్నాయని భజరంగ్‌దళ్ జిల్లా ప్రముఖ్ వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు. రాయదుర్గంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘జాతీయ పక్షి అయిన నెమళ్లు వీకెండ్స్‌లో చనిపోవడంపై పూర్తి స్థాయి విచారణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెమలి అందమైన పక్షి అని, స్వేచ్ఛగా జీవనం సాగించేలా చేయాల్సింది పోయి చంపడమేమిటని ఆయన ప్రశ్నించారు. నెమళ్ళైపై కొందరు విషప్రయోగం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తూ ఈ విషయంలో నిజానిజాలు వెలికి తీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జింకలకు కుక్కల భయం... నగర శివార్లలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణం జింకలకు ఆలవాలం. అక్కడ ఉన్న కుక్కలు వీటిని విచ్చలవిడిగా చంపేస్తుంటాయి. జనవరి 9న హెచ్‌సీయూ మశ్రుంరాక్ వద్ద కొలనులో నీరు తాగేందుకు వచ్చిన జింక పిల్ల, జనవరి 20న హ్యుమానిటీస్ ప్రాంగణంలో, ఫిబ్రవరి 11న గోపన్‌పల్లి గేట్ వద్ద మేత కోసం సంచరిస్తున్న జింకలపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఈ ఏడాది జనవరి 3న హెచ్‌సీయూలో జింక వేట ఘటన కలకలం సృష్టించింది. -
‘ఐ వాచ్’
దేశంలోనే తొలిసారి ‘ఐ వార్న్ కెమెరాలు’ వినియోగం సిటీబ్యూరో: ట్రాఫిక్ పోలీసుల విధి నిర్వహణలో పారదర్శకత కోసం సైబరాబాద్ కమిషనరేట్ మరో ముందడుగు వేసింది. గత రెండేళ్లుగా జంట కమిషనరేట్లలో ‘బాడీ వార్న్ కెమెరాలు’ వినియోగిస్తుండగా.. ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు అత్యాధునికమైన ‘ఐ వార్న్ కెమెరా’లు సమీకరించుకున్నారు. దేశంలో ఈ తరహా పరిజ్ఞానం వినియోగిస్తున్న పోలీసు వ్యవస్థగా సైబరాబాద్ రికార్డు కెక్కింది. ఈ కెమెరాలను పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం సిబ్బందికి అందించారు. తొలివిడతలో ప్రయోగాత్మకంగా ఏడు కెమెరాలు ఖరీదు చేశారు. ఆధునిక రంగుల కళ్లజోడుకు కుడి వైపున ఇమిడి ఉండే కెమెరా సాయంతో సిబ్బంది చూసిన ప్రతి ప్రాంతాన్నీ చిత్రీకరించే అవకాశం ఉంది. 32 జీబీ ఇంటర్నల్ మెమొరీతో కూడిన ఈ కెమెరాలు ఆడియో, వీడియోలను నిర్విరామంగా 21 గంటల పాటు రికార్డు చేస్తాయి. కమిషనరేట్‌లోని ట్రాఫిక్ విభాగం వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న 25 బాడీ వార్న్ కెమెరాలకు అదనంగా మరో 75 ఖరీదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు వాహనచోదకులు, సామాన్య ప్రజలతో ఏ విధంగా సంభాషిస్తున్నారు, ప్రవర్తిస్తున్నారనే అంశాలను బాడీ వార్న్, ఐ వార్న్ కెమెరాలు రికార్డు చేస్తాయి. ఈ పుటేజ్‌ను ఆయా ట్రాఫిక్ పోలీసుస్టేషన్లలోని కంప్యూటర్లలో భద్రపరుస్తారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిజిటల్/వీడియో కెమెరాలకు అదనంగా వీటిని వాడుతున్నట్లు ఆనంద్ తెలిపారు. ఉల్లంఘనుల నుంచి జరిమానా డబ్బు నేరుగా వసూలు చేయకుండా.. క్యాష్ లెన్ ఎన్ఫోర్స్మెంట్ విధానాన్ని సైబరాబాద్ పోలీసులూ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చలాన్ పుస్తకాల స్థానంలో ట్యాబ్స్‌ను ఖరీదు చేశారు. వీటిని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సిబ్బంది, అధికారులకు అందించారు. క్షేత్రస్థాయిలో ఉండే సైబరాబాద్ ట్రాఫిక్ సిబ్బంది ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఇబ్బందులు లేకుండా విధులు నిర్వర్తించడం కోసం కిట్‌బ్యాగ్స్ సైతం సమకూర్చుకున్నారు. బూట్లు, వాటర్ బాటిల్, సన్ గ్లాసెస్, నోస్ మాస్క్, రిఫ్లెక్టివ్ జాకెట్, రెయిన్ కోట్తో కూడిన ఈ కిట్లను ఆనంద్ వెయ్యి మంది సిబ్బందికి అందించారు. -
అడిషనల్ డీజీగా సీవీ ఆనంద్
సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు అదనపు డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. దీంతో పాటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కొనసాగేలా బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో రెండో అతిపెద్ద విస్తీర్ణం గల సైబరాబాద్ కమిషనరేట్‌లో శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన కీలక పాత్రపోషిస్తున్నారు. తక్కువ సిబ్బందితో ఎఫెక్టివ్ పోలీసింగ్‌తో నేరాలు అదుపు చేయగలిగారు. 1991 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన ఆనంద్‌కు పదోన్నతి రావడంపై పోలీసు వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. -
‘బ్యాంకుల కుంభకోణం’పై కేసు నమోదు
అధికారికంగా దర్యాప్తు చేపట్టిన సీబీఐ దామోదర్ కోసం ‘ప్రత్యేక’ గాలింపు సాక్షి, హైదరాబాద్: బ్యాంకుల్లో ప్రభుత్వ రంగ సంస్థల డిపాజిట్ల సొమ్మును పక్కదారి పట్టించిన వైనంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ శుక్రవారం కేసు నమోదు చేసింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి, ఘట్కేసర్ల్లోని బ్యాంకుల నుంచి దాదాపు రూ.30 కోట్లకు పైగా పక్కదారి పట్టిన విషయం తెలిసిందే. స్వయంగా హైకోర్టు స్వాధీనంలోని డబ్బులను మాయం చేయడంపై న్యాయస్థానం సీరియస్‌గా తీసుకుంది. భారీ అవకతవకలకు పాల్పడిన ఈ కేసుల్ని ఛేదించాల్సిందిగా న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల తొలివారం నుంచి రంగంలోకి దిగిన సీబీఐ ప్రాథమిక పరిశీలన చేపట్టింది. ఈ కేసులకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు సేకరించిన ఆధారాలు, ఇతర సమాచారాన్ని విశ్లేషించిన అధికారులు స్కామ్‌ను నిర్థారించారు. దీంతో శుక్రవారం దీనిపై అధికారికంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు. ఖాయిలా పడిన పరిశ్రమల బకాయిల సెటిల్మెంట్ కోసం హైకోర్టు లిక్విడేటర్ ఆధీనంలోని సొమ్ము పక్కదారి పట్టడంలో బ్యాంకు అధికారుల పాత్రనూ సీబీఐ అనుమానిస్తోంది. ఏడాది కాలం పాటు డిపాజిట్ చేసిన సొమ్మును కేవలం 15 రోజుల వ్యవధిలో తిరిగి ఇచ్చేయడం ఈ అనుమానాలకు బలాన్నిచ్చింది. ఆ నగదు ముంబై, గుజరాత్, రాజ్‌కోట్ తదితర ప్రాంతాల్లోని 13 ఖాతాల్లోకి బదిలీ చేయడంపై లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న చెన్నైకు చెందిన దామోదర్ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో జరిగిన ఘట్కేసర్ బ్యాంక్ సహా ఇతర కేసుల్నీ సీబీఐ స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.