సైబరాబాద్ /2
విభజన ఉత్తర్వులు జారీ
కొత్త కమిషనర్లుగా నవీన్‌చంద్, భగవత్ ఖరారు?
14 ఏళ్లలో నలుగురు కమిషనర్లు..
సిటీబ్యూరో: విస్తరిస్తున్న ఐటీ రంగం, పాలనా పరమైన సౌలభ్యం కోసం 2002లో ఏర్పాటైన సైబరాబాద్ కమిషనరేట్ రెండుగా విడిపోయింది. దీన్ని ఈస్ట్, వెస్ట్ కమిషనరేట్లుగా విభజిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి సైబరాబాద్‌కు మహేందర్‌రెడ్డి తొలి, సీవీ ఆనంద్ తుది కమిషనర్లుగా సేవలందించారు. ఈ పద్నాలుగేళ్ల కాలంలో నలుగురు ఐపీఎస్ అధికారులు పోలీసు కమిషనర్లుగా పనిచేశారు. నగర శివారు ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమలు రావడం ద్వారా అభివృద్ధి, జనాభా పెరుగుదలతో పాటు నేరాల సంఖ్య కూడా పెరిగింది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నుంచి వేరు చేసిన ప్రాంతాలతో 2002 నవంబర్ 15న ‘సైబరాబాద్ కమిషనరేట్’ను (ఐటీ పరిశ్రమల వల్ల ఈ పేరు వచ్చింది) ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2003 ఫిబ్రవరిలో తొలి కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఎం.మహేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఈయన హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. అప్పట్లో రంగారెడ్డి జిల్లాలో ఆరు సబ్‌డివిజన్లు ఉండగా, వీటిలో ఐదు బాలానగర్, మల్కాజిగిరి, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, అల్వాల్ డివిజన్‌ను సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో కలిపారు. ఈ డివిజన్ల పరిధిలో 34 పోలీసు స్టేషన్లు ఉండేవి. అయితే 19 ఠాణాలతో కూడిన వికారాబాద్ డివిజన్‌ను రంగారెడ్డి జిల్లా రూరల్‌గా మార్చి ఎస్పీ అధికారిని నియమించారు.
స్వరూపం మారుతూ..
మహేందర్ రెడ్డి డీఐజీ హోదాలో కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2004లో కమిషనర్ పోస్టును ఐజీ హోదాకు అప్‌గ్రేడ్ చేశారు. ఆ సమయంలో పదోన్నతి రావడంతో మహేందర్ రెడ్డిని కొనసాగించారు. కమిషనరేట్ పరిధి పెంచేందుకు 2004లో ఎల్‌బీనగర్, అల్వాల్, బాలానగర్ జోన్లను ఏర్పాటు చేశారు. వీటికి డీసీపీ స్థాయి అధికారిని నియమించారు. అలాగే ఒక క్రైమ్ డీసీపీ, ట్రాఫిక్ డీసీపీని కూడా నియమించారు. 2006-07లో ఐదు డివిజన్లకు తోడు మరో నాలుగు కొత్త డివిజన్లు ఏర్పాటు చేశారు. 2011-12లో రెండు డివిజన్లు కొత్తవి ఏర్పాటు చేయడంతో వాటి సంఖ్య 11 డివిజన్లకు చేరింది. 2013లో శంషాబాద్, మాదాపూర్ జోన్లను ఏర్పాటు చేసి కమిషనరేట్ పరిధిని మరింత పెంచారు. అదే సమయంలో జాయింట్ సీపీ పోస్టును కూడా మంజూరు చేశారు.
ఠాణాల పెంపు ఇలా: సైబరాబాద్ కమిషనరేట్‌లో 2003లో 36 ఠాణాలు ఉండగా, 2007లో మరో నాలుగు ఠాణాలు ఏర్పాటయ్యాయి. 2012-13లో మీర్‌పేట, చైతన్యపురి, పేట్ బషీరాబాద్, మియాపూర్ ఠాణాలు, 2014 చివర్లో జవహర్‌నగర్, జగద్గిరిగుట్ట, 2015 జనవరిలో ఆదిభట్ల ఠాణాలు ప్రారంభమయ్యాయి. దీంతో సైబరాబాద్ పరిధిలో లా అండ్ ఆర్డర్ స్టేషన్ల సంఖ్య 45కు, ట్రాఫిక్ ఠాణాలు 12కు చేరాయి. సైబరాబాద్‌కు తొలి కమిషనర్‌గా డీఐజీ హోదాలో మహేందర్‌రెడ్డి, ఆఖరి కమిషనర్‌గా అదనపు డీజీ హోదాలో సీవీ ఆనంద్ పనిచేశారు.