సైబరాబాద్ కొత్త బాస్‌లు వీరే | These new boss Cyberabad | Sakshi
Sakshi News home page

సైబరాబాద్ కొత్త బాస్‌లు వీరే

Published Tue, Jun 28 2016 12:23 AM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM

సైబరాబాద్ కొత్త బాస్‌లు వీరే

సైబరాబాద్ కొత్త బాస్‌లు వీరే

సిటీబ్యూరో: సైబరాబాద్ వెస్ట్ పోలీసు కమిషనర్‌గా నవీన్‌చంద్, ఈస్ట్ పోలీసు కమిషనర్‌గా మహేష్ మురళీధర్ భగవత్‌లు నియమితులయ్యారు. 2012 నవంబర్ 15న సైబరాబాద్ కమిషనరేట్‌ను ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుచేయగా, విస్తరిస్తున్న ఐటీ రంగం, జనాభా పెరుగుదల, నేరాలు పెరగడంతో తెలంగాణ ప్రభుత్వం దాన్ని సైబరాబాద్ వెస్ట్, ఈస్ట్ కమిషనరేట్లుగా విభజిస్తూ ఈ నెల 23న జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ వెస్ట్ పోలీసు కమిషనర్‌గా 1996 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన నవీన్ చంద్‌ను, ఈస్ట్ పోలీసు కమిషనర్‌గా 1995 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన మహేష్ మురళీధర్ భగవత్‌లను నియమించింది. ప్రస్తుత సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్  వ్యక్తిగత విదేశీ పర్యటన నిమిత్తం సెలవుకు దరఖాస్తు చేయడంతో ప్రభుత్వం మంజూరు చేసింది. గ్రేహౌండ్స్ డీఐజీగా పనిచేస్తున్న 1999 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఎం.స్టీఫెన్ రవీంద్రను వెస్ట్ సైబరాబాద్ జాయింట్ పోలీసు కమిషనర్‌గా, ప్రస్తుతం సైబరాబాద్ జాయింట్ పోలీసు కమిషనర్‌గా ఉన్న టీవీ శశిధర్‌రెడ్డిని కొత్తగా ఏర్పాటు చేసిన ఈస్ట్ సైబరాబాద్ జాయింట్ పోలీసు కమిషనర్‌గా నియమించింది.

 
మరికొద్ది రోజుల్లో ఇతర ఖాళీలపై స్పష్టత...
సైబరాబాద్ వెస్ట్, ఈస్ట్ పోలీసు కమిషనరేట్లకు ట్రాఫిక్ డీసీపీలను నియమించాల్సి ఉంది. ప్రస్తుతం సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా ఏఆర్ శ్రీనివాస్‌ను రెండింట్లో ఏదో ఒక జోన్‌గా కేటాయించినా, రెండో జోన్‌కు ఇంకొక ట్రాఫిక్ డీసీపీని నియమించాల్సి ఉంది. వీటితో పాటు క్రైమ్ డీసీపీలను కూడా భర్తీ చేయాల్సి ఉంది. కొత్తగా ఏర్పడిన భువనగిరి జోన్‌తో పాటు  చాలా రోజుల నుంచి ఐపీఎస్‌ల కొరతతో ఖాళీగా ఉంటూ ఇన్‌చార్జి డీసీపీలతో నెట్టుకొస్తున్న  మల్కాజిగిరి, బాలానగర్ జోన్లకు కూడా డీసీపీలను నియమించాల్సి రానుంది. త్వరలోనే ఈ ఖాళీలపై స్పష్టత వచ్చే అవకాశముందని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు.

 
గచ్చిబౌలి నుంచే పాలన...

ప్రస్తుత సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయం వున్న గచ్చిబౌలిలోనే సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ కమిషనరేట్స్ కార్యాలయాలు కొనసాగనున్నాయి. ఒకటి, రెండు అంతస్తుల నుంచి వెస్ట్ కమిషనరేట్ కార్యకలాపాలు, నిర్మాణ పనులు పూర్తయిన మూడు, నాలుగు అంతస్తుల్లో ఈస్ట్ కమిషనరేట్ కార్యకలాపాలు కొనసాగించనున్నారు. ఆపై వెస్ట్ కమిషనరేట్ ఇక్కడే కొనసాగగా... ఈస్ట్ కమిషనరేట్  కార్యాలయాన్ని అనువైన ప్రాంతానికి తరలించనున్నారు. దీని కోసం అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాథమికంగా రెండూ ఇక్కడే కొనసాగినా...సాధ్యమైనంత తొందరగా ఈస్ట్ కమిషనరేట్‌ను తరలించాలన్న ఉద్దేశంతో ఉన్నతాధికారులు ఉప్పల్‌లో అనువైన స్థలం కోసం అన్వేషిస్తున్నారు.

 
మహేష్ భగవత్ ప్రొఫైల్...

మహారాష్ట్రకు చెందిన మహేష్ భగవత్ కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా పోలీసు సర్వీస్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు. విధుల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు 2004లో ఇండియన్ ప్రెసిడెంట్ పోలీసు మెడల్ ఫర్ గ్యాలెంటరీ అందుకున్నారు. ఆదిలాబాద్ అదనపు ఎస్పీగా పనిచేసిన మహేష్ భగవత్ ఆ తర్వాత అదే జిల్లాకు ఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత నల్గొండ, కడపలో ఎస్పీగా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో సౌత్‌జోన్ డీసీపీగా, సైబరాబాద్‌లో అల్వాల్ డీసీపీగా పనిచేశారు. సీఐడీలో మహిళల అక్రమ రవాణా నిరోధక బృందాలను నేతృత్వం వహించారు. డీఐజీగా ఏలూరు, నగర పోలీసు కమిషనరేట్‌లో స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ప్రముఖుల భద్రతను పర్యవేక్షించే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో ఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

 
నవీన్‌చంద్ నేపథ్యమిదీ...

నవీన్ చంద్‌ది కరీంనగర్ జిల్లా. హైకోర్టులో అడ్వకేట్‌గా పనిచేశారు. క్రిమినల్ లాయర్‌గా మంచి పేరు తెచ్చకున్నారు. 1987లో డీఎస్‌పీగా పోలీసు విభాగంలో అడుగుపెట్టారు. తొలి పోస్టింగ్ నర్సంపేట డీఎస్‌పీగా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని సుల్తాన్ బజార్ ఏసీపీ, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ఏసీపీ, ఎస్‌ఐబీలో అడిషనల్ ఎస్‌పీగా, ట్రాఫిక్‌లో అడిషనల్ డీసీపీగా, గ్రేహౌండ్స్‌లో నాన్‌క్యాడర్ ఎస్పీగా, 1996లో ఐపీఎస్, చిత్తూరు, తూర్పుగోదావరి, ప్రకాశం ఎస్పీ, డీఐజీగా విజిలెన్స్, హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ సీపీ, హైదరాబాద్ రేంజ్ డీఐజీ, 2013లో ఐజీ, రాయలసీమ జోన్ ఐజీ, తెలంగాణ ఏర్పాటైన తర్వాత డీజీపీ కార్యాలయంలో పీ అండ్ ఎల్ విభాగం ఐజీ, ఐపీఎస్‌ల విభజన పూర్తయి తెలంగాణకు వచ్చిన తర్వాత వరంగల్, హైదరాబాద్ జోన్‌లకు ఐజీగా ఏడాదిన్నర పాటు పనిచేశారు.

Advertisement
Advertisement