మయూరాలపై వీకెండ్ ‘వయలెన్స్’! | weekend, 'Violence'! | Sakshi
Sakshi News home page

మయూరాలపై వీకెండ్ ‘వయలెన్స్’!

Published Sun, Jun 19 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM

మయూరాలపై వీకెండ్ ‘వయలెన్స్’!

మయూరాలపై వీకెండ్ ‘వయలెన్స్’!

విషం పెట్టి చంపుతున్న గుర్తు తెలియని దుండగులు
రాయదుర్గం పాన్‌మక్తా గుట్టల్లో వారాంతాల్లోనే  వరుసగా ఘటనలు
తెల్లారేసరికి మాయమవుతున్న నెమలి కళేబరాలు
తాజాగా శనివారం రాత్రి  ఆరు మయూరాలు మృత్యువాత

ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు, జంతు ప్రేమికులు

 

రాయదుర్గం: సైబరాబాద్ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో వారాంతాల్లో నెమళ్లు అంతమవుతున్నాయి. ఈ జాతీయ పక్షికి గుర్తుతెలియని విషం పెట్టి చంపేస్తున్నారు. శనివారం రాత్రి ఏకంగా ఆరు మయూరాలు చనిపోయాయి. వీటిలో నాలుగింటి కళేబరాలు లభించగా... మరో రెండింటికి చెందిన ఈకలు మాత్రమే పడి ఉన్నాయి. రాయదుర్గం పాక్‌మక్తా గుట్టల్లో వరుసగా నాలుగైదు వారాలుగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. కొన్ని ఉదంతాల్లో నెమలీకలు మాత్రమే మిగులుతుండగా... శనివారం రాత్రి నాలుగు నెమళ్ళ కళేబరాలూ కనిపించాయి. మనుషులపై ప్రభావం చూపని విషం పెట్టి మయూరాలను  చంపేస్తున్న దుండగులు ఆనక వాటి మాంసాన్ని తీసుకువెళ్తున్నారని స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనలపై ఇటు అటవీ శాఖ అధికారులు, అటు పోలీసులు పట్టించుకోట్లేదని ఆరోపిస్తున్నారు.

 
ఆ ప్రాంతం నెమళ్లకు ఆలవాలం...

గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయానికి సమీపంలో ఉన్న రాయదుర్గం పాన్‌మక్తా శివారులోని దుర్గం చెరువు గుట్టల్లో ఏళ్ళుగా వందలాది నెమళ్లు నివసిస్తున్నాయి. ప్రతినిత్యం కనీసం 20 నుంచి 50 దాకా మయూరాలు గుంపులుగా నడుచుకుంటూ గుట్ట శివారు ప్రాంతాల్లో కలియ దిరగడంతో పాటు గుట్టలపై పురివిప్పి ఆడుతూ చుట్టుపక్కల వారితో పాటు ఆ మార్గంలో వెళ్లే వారికీ ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. ఆ ప్రాంతంలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలోని పశువుల కొట్టం ఈ నెమళ్లకు సుపరిచితం. అక్కడ పశువులున్నప్పటికీ నిర్భయంగా నడుచుకుంటూ వచ్చి నీళ్ళు తాగడం, పశువుల కోసం పెట్టిన దాణా తినడం చేసి తమ దారిన వెనక్కు వెళ్లిపోతుంటాయి.

 
నెల్లాళ్ళుగా వరుస ఘటనలు...

పాన్‌మక్తా శివారు గుట్టల్లో ఉండే నెమళ్లు నెల రోజులుగా మృత్యువాత పడటం స్థానికుల్ని కలిచి వేస్తోంది. ఈ ఘటనలు వరుసగా వీకెం డ్స్‌లోనే చోటు చేసుకుంటున్నాయని వారు చెప్తున్నారు. శునివారం ఓ నెమలి నురుగులు కక్కుతూ, ఎగురలేక స్థితిలో నెమ్మదిగా నడచి వెళ్ళడాన్ని గుట్టల్లో పశువులు మేపుకునే ఓ కాపరి గమనించాడు. దాన్ని దగ్గరకు తీసుకుని నీళ్ళు పట్టించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. కొద్దిసేపటికే అవి చనిపోవడంతో స్థానికులకు విషయం చెప్పారు. ఆది వారం గుట్టల్లోకి వెళ్లిన స్థానికులు, భజరంగ్‌దళ్ నాయకులు నాలుగు నెమళ్ల కళేబరాలను గుర్తించారు. దీనికి సమీపంలోనే ముళ్ళ పొద ల్లో మరో రెండు నెమళ్ళకు సంబంధించిన ఈకలు పడి ఉండటాన్ని గమనించారు.

 
వేటాడుతున్నారనే అనుమానాలు...

మయూరాలకు సంబంధించి వరుసగా చోటు చేసుకున్న ఘటనల్ని గమనించిన స్థానికులు వేటగాళ్ల పనిగా అనుమానిస్తున్నారు. ప్రధానంగా వారాంతాల్లోనే ఈ ఘటనలు చోటు చేసుకోవడంతో తమ అనుమానాలు బలపడుతున్నామయని వ్యాఖ్యానిస్తున్నారు. మనుషులపై ప్రభావం చూపని గుర్తుతెలియని విషాన్ని వేటగాళ్లు వినియోగిస్తున్నట్లు అనుమానాలున్నాయి.  దీని ప్రభావంతో చనిపోయిన నెమళ్ళను సేకరిస్తున్న వేటగాళ్ళు మాంసం కోసం వాటిని తీసుకువెళ్తున్నట్లు ఆరోపిస్తున్నారు. రెండు వారాలుగా నెమళ్ళు సాయంత్రం కనబడినా మరుసటి రోజుకు మాయం అవుతున్నాయని, ఈ నేపథ్యంలోనే వేటగాళ్ల పనిగా అనుమానిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు.

 
ఈ ఘటనలపై విచారణ చేపట్టాలి: భజరంగ్‌దళ్ నాయకుల డిమాండ్

రాయదుర్గం శివారు గుట్టల్లో ఉండే నెమళ్లు నెల రోజులుగా మృత్యువాత పడుతున్నాయని భజరంగ్‌దళ్ జిల్లా ప్రముఖ్ వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు. రాయదుర్గంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘జాతీయ పక్షి అయిన నెమళ్లు వీకెండ్స్‌లో చనిపోవడంపై పూర్తి స్థాయి విచారణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెమలి అందమైన పక్షి అని, స్వేచ్ఛగా జీవనం సాగించేలా చేయాల్సింది పోయి చంపడమేమిటని ఆయన ప్రశ్నించారు.  నెమళ్ళైపై కొందరు విషప్రయోగం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తూ ఈ విషయంలో నిజానిజాలు వెలికి తీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 
జింకలకు కుక్కల భయం...

నగర శివార్లలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణం జింకలకు ఆలవాలం. అక్కడ ఉన్న కుక్కలు వీటిని విచ్చలవిడిగా చంపేస్తుంటాయి. జనవరి 9న హెచ్‌సీయూ మశ్రుంరాక్ వద్ద కొలనులో నీరు తాగేందుకు వచ్చిన జింక పిల్ల, జనవరి 20న హ్యుమానిటీస్ ప్రాంగణంలో, ఫిబ్రవరి 11న గోపన్‌పల్లి గేట్ వద్ద మేత కోసం సంచరిస్తున్న జింకలపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఈ ఏడాది జనవరి 3న హెచ్‌సీయూలో జింక వేట ఘటన కలకలం సృష్టించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement