చిత్త వ్యాపారాలే చింత, చింతన. మనస్సు చేత ప్రేరేపితమైన ఇంద్రియ వ్యాపారాలను భద్రపరచేది చిత్తం. విషయాలను, అనుభవాలను, భావోద్వేగాలు మొదలైనవాటిని జ్ఞాపకాల రూపంలో భద్రపరచి దాచి ఉంచేది చిత్తం. దానిలో ప్రతి మనోవ్యాపారం ముద్రితమై ఉంటుంది. ఒకోసారి మర్చిపోయాం అనుకొన్నవి కూడా సందర్భానుసారం బయట పడుతూ ఉంటాయి. అందుకే ఏదైనా మరచిపోతే కళ్ళు మూసుకుని ఆలోచిస్తాం. అప్పుడు జ్ఞాపకాల గది తలుపు తెరుచుకుంటుంది.
చింతన అంటే నిరంతరం ఒక విషయాన్ని గురించి తలచుకుంటూ, మననం చేయటం. ఇది కూడా చిత్తం చేసే పనే అయినా చింతకి చింతనకి మధ్య ఎంతో తేడా ఉంది. నక్కకి నాకలోకానికి ఉన్నంత. లౌకిక స్థాయిలోచింతన మనిషి మేథకి మెఱుగులు పెడుతుంది. ఆలోచనలకి పదును పెడుతుంది. ఒక విషయాన్ని గురించి కూలంకషంగా విశ్లేషించి తగిన నిర్ణయం తీసుకోవటానికి తోడ్పడుతుంది. ఇది వ్యక్తిగతంగా తన సమస్యలని పరిష్కరించుకోవటానికి ఎంతో అవసరం.
చింత అంటే జరిగి పోయిన లేదా జరగబోయే విషయాలను తలుచుకుంటూ బాధపడుతూ వేదన చెందుతూ ఉండటం. పైకి వ్యక్తం చేయక పోయినా మనసు లోపల నిరంతరం అదే విషయం మెదులుతూ సంతోషమన్నది లేకుండా చేస్తుంది. కొంతమంది ముఖాలు చూస్తూనే చెప్పవచ్చు వాళ్ళు ఏదో విషయంలో చాలా బాధ పడుతున్నారు అని. సాధారణంగా ఆ విషయానికి పరిష్కారం వాళ్ళకి తెలియక పోవటమో, తెలిసినా చేయగలిగే పరిస్థితిలో లేక΄పోవటమో దానికి కారణం అయి ఉంటుంది. ఆ అనిశ్చితి, అసమర్థత నిరంతరం మనసులో తిరుగుతూ వేదనని కలిగించి కుంగదీస్తాయి. పరిష్కారం దొరికితే కొంత ఉపశమనం కలుగుతుంది. దానిని అమలు చేయగల శక్తి ఉంటే ధైర్యం కలుగుతుంది. వేదన కొంత ఉపశమిస్తుంది. ఇక్కడ అర్థమయ్యే విషయం ఏమంటే ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచించ గల శక్తి మనిషి మనస్సుకి ఉంది అని. దానిని ఉపయోగపడని వాటికి వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవచ్చు. అప్పుడు అది చింతన అవుతుంది.
చింతన మనిషిని తాత్త్వికుడిగా పరిణమింప చేస్తుంది. వ్యక్తిగతమైన సమస్యలు, వాటి పరిష్కారాలు అనే స్థాయి దాటి ఏదైనా ఒక అంశం గాని, సిద్ధాంతం గాని, మరేదైనా గాని – దానిని గురించి లోతుగా, అన్ని కోణాలలోనూ, పరిశీలించి, అధ్యయనం చేసి, మూల తత్త్వాన్ని తెలుసుకునేందుకు సహకరిస్తుంది. ఆధ్యాత్మికత, మతం, రాజనీతి, సాంఘిక సామాజిక పరిస్థితులు, కమ్యూనిజం వంటి ఆధునిక సిద్ధాంతాలు – ఒకటేమిటి ఏవైనా కావచ్చు, వాటి మౌలికతత్త్వం తెలుసుకోవటానికి వాటి గురించిన చింతన ఒకటే మార్గం. ఆ విషయానికి సంబంధించిన అంశాలనే నిరంతరం తలుచుకుంటూ, మననం చేస్తూ ఉంటే, పైకి కనపడే అంశానికి మూలమైన సూత్రం, అసలు లక్షణం, సరిగా చెప్పాలంటే బీజం స్ఫురిస్తుంది. దానితో విరాడ్రూపం మనోనేత్రం ముందు కదలాడుతుంది. లోతుపాతులు, మంచిచెడులు, విస్తరణ, పరిమితులు మొదలైన వన్ని చాలావరకు అర్థం అవుతాయి. ఇతరులు గుర్తించ లేని రహస్యాలు స్ఫురిస్తాయి. శాస్త్రవేత్తలని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.
ఎంతోమంది శాస్త్రవేత్తలు తాము చేసే పరిశోధనల గురించి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు నిత్యకృత్యాలు నిర్వహిస్తూ కూడా. కొన్నిమార్లు వారికి నిద్రలో కలల రూపంలోనో, పరిసరాల్లో జరుగుతున్న సంఘటనల రూపంలోనో, ఆహారం తీసుకుంటున్నప్పుడో హఠాత్తుగా చేయవలసినది కానీ, పరిష్కారం గాని స్ఫురిస్తుంది. ఆర్కిమిడీస్ దానికి పెద్ద ఉదాహరణ. అతడికి తొట్టెలో స్నానం చేస్తుండగా నీళ్ళలో మునిగినప్పుడు పదార్థం బరువు తగ్గటానికి కారణం స్ఫురించింది. దానికి అతడు దాని గురించి చింతన చేస్తూ ఉండటమే కారణం.
మనిషి దేనిని చింతన చేస్తే దానిగా మారిపోతాడు అన్నది ఆధునిక మనస్తత్వశాస్త్ర పరిశోధకులు నిర్ధారించి చెప్పిన మాట. సాధకుడు ఏమి పొందాలని అనుకుంటున్నాడో దానిని సిద్ధింపచేసేది చింతన అని ఆధ్యాత్మికవేత్తలు చెప్పేమాట.
– డా. ఎన్. అనంతలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment