bhakti
-
చిత్తం, చింత, చింతన
చిత్త వ్యాపారాలే చింత, చింతన. మనస్సు చేత ప్రేరేపితమైన ఇంద్రియ వ్యాపారాలను భద్రపరచేది చిత్తం. విషయాలను, అనుభవాలను, భావోద్వేగాలు మొదలైనవాటిని జ్ఞాపకాల రూపంలో భద్రపరచి దాచి ఉంచేది చిత్తం. దానిలో ప్రతి మనోవ్యాపారం ముద్రితమై ఉంటుంది. ఒకోసారి మర్చిపోయాం అనుకొన్నవి కూడా సందర్భానుసారం బయట పడుతూ ఉంటాయి. అందుకే ఏదైనా మరచిపోతే కళ్ళు మూసుకుని ఆలోచిస్తాం. అప్పుడు జ్ఞాపకాల గది తలుపు తెరుచుకుంటుంది. చింతన అంటే నిరంతరం ఒక విషయాన్ని గురించి తలచుకుంటూ, మననం చేయటం. ఇది కూడా చిత్తం చేసే పనే అయినా చింతకి చింతనకి మధ్య ఎంతో తేడా ఉంది. నక్కకి నాకలోకానికి ఉన్నంత. లౌకిక స్థాయిలోచింతన మనిషి మేథకి మెఱుగులు పెడుతుంది. ఆలోచనలకి పదును పెడుతుంది. ఒక విషయాన్ని గురించి కూలంకషంగా విశ్లేషించి తగిన నిర్ణయం తీసుకోవటానికి తోడ్పడుతుంది. ఇది వ్యక్తిగతంగా తన సమస్యలని పరిష్కరించుకోవటానికి ఎంతో అవసరం. చింత అంటే జరిగి పోయిన లేదా జరగబోయే విషయాలను తలుచుకుంటూ బాధపడుతూ వేదన చెందుతూ ఉండటం. పైకి వ్యక్తం చేయక పోయినా మనసు లోపల నిరంతరం అదే విషయం మెదులుతూ సంతోషమన్నది లేకుండా చేస్తుంది. కొంతమంది ముఖాలు చూస్తూనే చెప్పవచ్చు వాళ్ళు ఏదో విషయంలో చాలా బాధ పడుతున్నారు అని. సాధారణంగా ఆ విషయానికి పరిష్కారం వాళ్ళకి తెలియక పోవటమో, తెలిసినా చేయగలిగే పరిస్థితిలో లేక΄పోవటమో దానికి కారణం అయి ఉంటుంది. ఆ అనిశ్చితి, అసమర్థత నిరంతరం మనసులో తిరుగుతూ వేదనని కలిగించి కుంగదీస్తాయి. పరిష్కారం దొరికితే కొంత ఉపశమనం కలుగుతుంది. దానిని అమలు చేయగల శక్తి ఉంటే ధైర్యం కలుగుతుంది. వేదన కొంత ఉపశమిస్తుంది. ఇక్కడ అర్థమయ్యే విషయం ఏమంటే ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచించ గల శక్తి మనిషి మనస్సుకి ఉంది అని. దానిని ఉపయోగపడని వాటికి వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవచ్చు. అప్పుడు అది చింతన అవుతుంది. చింతన మనిషిని తాత్త్వికుడిగా పరిణమింప చేస్తుంది. వ్యక్తిగతమైన సమస్యలు, వాటి పరిష్కారాలు అనే స్థాయి దాటి ఏదైనా ఒక అంశం గాని, సిద్ధాంతం గాని, మరేదైనా గాని – దానిని గురించి లోతుగా, అన్ని కోణాలలోనూ, పరిశీలించి, అధ్యయనం చేసి, మూల తత్త్వాన్ని తెలుసుకునేందుకు సహకరిస్తుంది. ఆధ్యాత్మికత, మతం, రాజనీతి, సాంఘిక సామాజిక పరిస్థితులు, కమ్యూనిజం వంటి ఆధునిక సిద్ధాంతాలు – ఒకటేమిటి ఏవైనా కావచ్చు, వాటి మౌలికతత్త్వం తెలుసుకోవటానికి వాటి గురించిన చింతన ఒకటే మార్గం. ఆ విషయానికి సంబంధించిన అంశాలనే నిరంతరం తలుచుకుంటూ, మననం చేస్తూ ఉంటే, పైకి కనపడే అంశానికి మూలమైన సూత్రం, అసలు లక్షణం, సరిగా చెప్పాలంటే బీజం స్ఫురిస్తుంది. దానితో విరాడ్రూపం మనోనేత్రం ముందు కదలాడుతుంది. లోతుపాతులు, మంచిచెడులు, విస్తరణ, పరిమితులు మొదలైన వన్ని చాలావరకు అర్థం అవుతాయి. ఇతరులు గుర్తించ లేని రహస్యాలు స్ఫురిస్తాయి. శాస్త్రవేత్తలని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఎంతోమంది శాస్త్రవేత్తలు తాము చేసే పరిశోధనల గురించి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు నిత్యకృత్యాలు నిర్వహిస్తూ కూడా. కొన్నిమార్లు వారికి నిద్రలో కలల రూపంలోనో, పరిసరాల్లో జరుగుతున్న సంఘటనల రూపంలోనో, ఆహారం తీసుకుంటున్నప్పుడో హఠాత్తుగా చేయవలసినది కానీ, పరిష్కారం గాని స్ఫురిస్తుంది. ఆర్కిమిడీస్ దానికి పెద్ద ఉదాహరణ. అతడికి తొట్టెలో స్నానం చేస్తుండగా నీళ్ళలో మునిగినప్పుడు పదార్థం బరువు తగ్గటానికి కారణం స్ఫురించింది. దానికి అతడు దాని గురించి చింతన చేస్తూ ఉండటమే కారణం. మనిషి దేనిని చింతన చేస్తే దానిగా మారిపోతాడు అన్నది ఆధునిక మనస్తత్వశాస్త్ర పరిశోధకులు నిర్ధారించి చెప్పిన మాట. సాధకుడు ఏమి పొందాలని అనుకుంటున్నాడో దానిని సిద్ధింపచేసేది చింతన అని ఆధ్యాత్మికవేత్తలు చెప్పేమాట. – డా. ఎన్. అనంతలక్ష్మి -
భక్తి అంటే..?
భక్తి అంటే ఏమిటి? వేదాంత గ్రంథాలిచ్చే నిర్వచనాల జోలికి వెళ్లవద్దు మనం. మామూలు మాటల్లో అర్థం కావటానికి భక్తి అంటే ఏమిటి? చాలామంది అభిప్రాయంలో ఫోటో పెట్టి, దండలు వేసి, పూలు, అగరొత్తులు, దీపాలు పెట్టి నివేదన చెయ్యటం, దణ్ణం పెట్టటం అనుకుంటారు. అది భక్తా? ఒకరకంగా తను మారకుండా ఉండటాన్ని సమర్థించుకునే ప్రయత్నం. ‘‘ఆయన మహానుభావుడు కనుక అట్లా చేయగలిగాడు. మనవంటి సామాన్యులకి సాధ్యమా?’’ అని తప్పించుకునే మార్గం. అట్లా పూజ చెయ్యటం తప్పు అని కాని, చెయ్య కూడదని కాని చెప్పటం లేదు. అది ఒకరకం. దానివల్ల ఒరిగేది ప్రత్యేకంగా ఏమీ లేదు. అది ఒక క్రమశిక్షణ. చిత్త శుద్ధిని కలిగిస్తుంది. ఇది మొదటిమెట్టు అని చెప్పవచ్చు. కానీ చాలా మంది ఇదే పరమార్థం అనుకుంటారు. కొంతమంది అనుకరించటమే భక్తి అనే భ్రమలో ఉంటారు. అనుకరించటానికి, అనుసరించటానికి చాలా వ్యత్యాసం ఉంది. వారిలాగా ఉండే ప్రయత్నం అనుకరణ. ఇది భౌతికంగా తమ ఆదర్శమూర్తుల లాగా ఉండేట్టు చేస్తుంది. చూడగానే ఫలానా వారి అభిమానులని తెలియ చేస్తుంది. కాని వారిస్థాయికి చేర్చదు. అయితే అనుకరణ పనికి రానిదని చెప్పటానికి వీలు లేదు. అది రెండవ మెట్టు. ఒకరిపట్ల భక్తి ఉన్నది అంటే వారు చెప్పిన దానిని చెప్పినట్టు అనుసరించటమే. భక్తిలో ప్రశ్నలకు, సందేహాలకు, వాదోపవాదాలకు తావుండదు. నోటితోనే చెప్పనక్కరలేదు. వారి ప్రవర్తనను చూసి అనుసరించవలసి ఉంటుంది. ‘‘మీ బొమ్మకి పూజ చేస్తాం, కాని, మీరు చెప్పినట్టు చెయ్యటం మావల్ల కాదు, మీరు ఉన్నట్టు ఉండటం అసాధ్యం’’ అంటే అది భక్తి అనిపించుకోదు. భగవంతుడివిషయంలోనైనా అంతే! దేవుణ్ణి గదికే పరిమితం చేసి, పూజచేసిన కొద్దిసేపు మాత్రం ఆయన్ని తలచుకొని, తరువాత దుర్మార్గంగా లోకకంటకంగా ప్రవర్తిస్తే అది భక్తి అనిపించుకోదు. పరమాత్మ నిర్దేశించిన విధంగా, ఆయన మెప్పు వడసే పద్ధతిలో ప్రవర్తిస్తే అది నిజమైన భక్తి. సాటిమనిషి మీద సానుభూతి, జాలి చూపించలేని వాడు, ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమించ లేని వాడు, తనకి హాని చేసిన శత్రువుని కాక పోయినా కనీసం ఎదుటివాడిని క్షమించలేనివాడు విశ్వాసి ఎలా అవుతాడు? పొరుగువారిని తనవలే ప్రేమించమని చెప్పిన ఏసు క్రీస్తు అంటే భక్తి ఉంటే ఆయన చెప్పిన మాటలని పాటించాలి, ఆయనలాగా ప్రవర్తించాలి. ఆయన మార్గాన్ని అనుసరించాలి. ఎక్కువసేపు వాళ్ళతో ఉండటం వల్లనో, పోలికలు రావటం వల్లనో మనవలు, మనవరాళ్ళు తరచుగా తాతానాయనమ్మల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. తాతలకి నాయనమ్మలకి, అమ్మమ్మలకి మనవలు, మనవరాళ్ళు అంటే ఇష్టం ఉండటానికి కూడా ఇదే కారణం. మనుషుల విషయంలోనే ఇలా ఉంటే భగవంతుడి విషయంలో ఆయన చెప్పినట్టు ప్రవర్తిస్తే ఫలితం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భగవంతుడికి, భక్తుడికి ఉండే సంబంధాన్ని భ్రమరకీట న్యాయంగా చెప్పటం ఈ కాణంగానే. తన చుట్టూ తిరుగుతున్న భ్రమరం చేసే ఝుమ్మనే నాదం విని గూటిలో సుప్తావస్థలో ఉన్న కీటకం దానిని అనుసరిస్తూ తాను కూడాఅటువంటి నాదం చేసే ప్రయత్నంలో భ్రమరం లాగా రూపాంతరం చెందుతుంది. ఈ అనుసరణ అన్నది తానే లక్ష్య వస్తువు అయ్యేట్టు చెయ్యగలదు. ఒక గురువునో, నాయకుణ్ణో అనుకరించేవారు వారి వలె తయారౌతారే కాని, వారుగా అయిపోరు. వారుగా, కనీసం వారంతటి వారుగా అయిపోవటానికి కావలసినది అనుసరణ మాత్రమే. భగవత్తత్త్వాన్ని అందుకోవాలంటే కూడా అంతే! శ్రీరాముడు పితృభక్తి కలవాడు అని చెపుతాం. అంటే అర్థం తండ్రి చెప్పిన విధంగా జీవించాడు అని. ఆయన మాట జవదాట లేదు. ఆయన తనతోచెప్పిన మాటనే కాదు ఆయన ఎవరికిచ్చిన మాటనైనా పాటించాడు. రాముడిపితృభక్తి, గురుభక్తి విశ్వామిత్రుడు తాటకను సంహరించమన్నప్పుడు మారు మాటాడక సంహరించటంలో వ్యక్తమౌతాయి. తల్లితండ్రులని వృద్ధాశ్రమాలలో ఉంచి ‘‘మేము రామభక్తులం’’ అంటే రాముడిపట్ల అపచారం చేసినట్టే. ఆయనలో ఉన్న కొన్నిగుణాలనైనా అలవరచుకుంటే రామభక్తులు అనిపించుకోగలుగుతారు. – డా. ఎన్. అనంత లక్ష్మి -
లోపలి అరలు, పొరలు, వాటికి అడ్డంగా తెరలు
భక్తి ఎప్పుడూ ఆధిపత్య ధోరణిని, అహంభావాన్ని ప్రదర్శించదు. నేను గొప్ప, నాకిది వచ్చు. నాకన్నా వాళ్లెంత...అన్న వైఖరిని చూపదు. విద్య...విత్ అంటే తెలుసుకొనుట. ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుంటే అది వినయం. ‘‘విద్యాదదాతి వినయం వినయాద్యాతిపాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాద్ధర్మంతత సుఖం’’ వైరాగ్య సుఖం, మోక్ష సుఖం వరకు అంతే. అందుకే త్యాగరాజ స్వామి వారిని... మీరంతవారు, మీరింత వారని అంటూంటే... ఆయన పొంగిపోలేదు. పైగా ఆయనేమన్నారు.. అంటే... ఎందరో మహానుభావులు ...అందరికీ వందనములు... అన్నారు. బ్రహ్మాన్ని తెలుసుకున్నవారు, రమించినవారు, పాడినవారు, అర్చించినవారు, అనుభవించినవారు ఎంతో మంది ఉండగా వారి ముందు నేనెంత, వారికి నేనేం చేయగలను, నమస్కారం చేస్తా...’’ అని వారందరినీ ఆదరపూర్వకంగా స్మరించుకున్నారు. వినయం అంటే అదీ. ఆదిశంకరులు అంతటి వారు ‘‘పశుం మాం సర్వజ్ఞ ప్రథితకృపయాపాలయవిభో’’...‘శివా! నేను పశువును. నీవు పశుపతివి. ఇదే మనిద్దరి మధ్య బంధం’ అన్నారు. అది వినయం. అది విద్యకు పరమార్థం.అది దేనిచేత ప్రకాశిస్తుంది... అంటే ఉపాసనా దేవత అనుగ్రహానికి పాత్రమయితే అప్పుడు వినయం వస్తుంది. ఆ వినయం మనకు వాగ్గేయకారులందరిలో కనబడుతుంది. అందుకే వారు ఏది చెప్పినా ఏది చేసినా మనకు సందేశం ఇస్తున్నట్లో, సలహా ఇస్తున్నట్లో ఉండదు. వారికి వారు చెప్పుకున్నట్లు ఉంటుంది. భిన్న కథనాలు ఉన్నప్పటికీ, త్యాగరాజ స్వామివారు ఒకసారి వేంకటాచలం వెళ్ళారు, స్వామి వారి దర్శనం కోసం కూచున్నారు. తెర అడ్డంగా ఉంది. దిగంతాలకు వ్యాపించిన కీర్తిమంతుడిని, సాక్షాత్ ఉపనిషద్బ్రహ్మేంద్రులంతటి వారు నన్నుపిలిచి కీర్తనలు పాడించుకుంటారే, నేనొస్తే తెర వేస్తారా... అని ఆయన కోపగించుకోలేదు. ఈ తెర కాసేపయితే తీస్తారు.. ఇవ్వాళ కాకపోతే రేపయినా తీస్తారు. కానీ లోపల ఇంకొక తెర ఉంది... అనే అర్థంలో ఆయన అన్న మాటేమిటంటే...‘‘తెర తీయగ రాదా, నాలోని తిరుపతి వేంకటరమణా! మదమత్సరమను తెరదీయగరాదా, పరమ పురుషా!’’ అని పిలిచారు. నిజానికి భగవంతుడు ఎక్కడ దర్శనం కావాలి? మన లోపల.. ‘అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా... లోపల అక్కడ కనబడాలి. పరమ యోగీంద్రులకు భావగోచరమైన పాదాబ్జములు నాకు దర్శనమయితే నేను యోగిని. .. అన్నారు తెర వేసినందుకుగానీ, తెర తొలగించనందుకు గానీ ఆయన ఎవరినీ నింద చేయలేదు. నా అంతటివాడొస్తే.. అని అహంకరించలేదు. ఎప్పుడు తీస్తారని అడగలేదు. ఇక్కడ ఉన్న తెర ఎవరయినా, ఎప్పుడయినా తీస్తారు. ‘లోపల నాకు అడ్డొస్తోన్న తెరవల్ల నీవు నాకు ఎప్పటికీ కనబడడం లేదు. అది నీవే తీయాలి. నేను తీసుకోలేను. ఇంకొకరు తీయలేరు. అది తీయవయ్యా నాలోని వేంకటరమణా!’– అని వేడుకున్నారు. నిన్ను పొందడానికి నాకు అడ్డొస్తున్నదేమిటంటే మత్సరం... అన్నారు. ఎంతగొప్పమాట! మత్సరం అంటే అన్య సుఖ ద్వేషి. ఇంకొకరికిఏదయినా మంచి జరిగితే మనం చాలా బాధపడి పోతుంటాం. అన్నపానీయాలు ఎక్కవు. నిద్రాసుఖం ఉండదు. వాడికి శుభం జరగడమా, నాకన్నావాడేం గొప్ప. వాడికేం తెలుసని. వాడికి కీర్తి రావడమేమిటి, వాడికి శుభాలు జరగడమేమిటి ... ఇలా ఇతరులను తక్కువచేసి తన గొప్పదనం స్మరించుకోవడం... అది మత్సరానికి ప్రారంభ స్థానం. అది అడ్డొస్తున్నదన్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
భక్తుడికి ఆహారం భక్తే
యోగరతోవా భోగ రతోవా/ సంగ రతోవా సంగ విహీనః/ యస్య బ్రహ్మణి రమతే చిత్తం/ నందతి నందతి నందత్యేవ... చెరుకు గడను తీసుకొచ్చి కత్తితో నరికినా, మరలోవేసి తిప్పినా, నోటితో కొరికినా... ఎంత హింసించినా తియ్యటి రసాన్ని ఒలికించడం తప్ప అది మరో విధంగా స్పందించదు. కారణం – త్యాగం దాని లక్షణం. ఏ వాగ్గేయకారుడి జీవితం చూసినా ప్రతివారి జీవితంలో ఈ ప్రశాంతత, ఈ కారుణ్యం, ఈ ద్వంద్వాతీత స్థితి, అందరినీ ప్రేమించగల, అనుగ్రహించగల శక్తి కనపడుతుంటాయి. వాళ్ళు కూడా అంత గొప్పగా ఆ సంగీతంతోనే ఎదిగారు. ఆ సంగీతంతోనే మనల్ని ఉద్ధరించారు. త్యాగరాజ స్వామి జీవితం వడ్డించిన విస్తరేమీ కాదు. మహారాజుగారు అన్ని కానుకలు పంపితే ‘నిధి చాల సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా నిజముగబల్కు మనసా..’’ అంటూ వాటిని తీసుకెళ్ళి చెత్తదిబ్బలో పారేస్తాడా ... అని తోడబుట్టిన అన్నగారికే నచ్చలేదు తమ్ముడి పద్ధతి. ‘ఎప్పుడూ ఆ విగ్రహాలు పట్టుకుని కూర్చుంటాడు. తమ్ముడు కనుక రాజుగారి కొలువులో పాడితే ఎంత హాయిగా జీవించవచ్చు...’ అనే భావన అన్నగారిది. కాదు... సంగీతం మోక్ష సామ్రాజ్యాన్ని ఇవ్వగలదు. ఇది ఇవ్వగలిగిన ఆనందం వేరొకటి ఇవ్వలేదు. వాగ్గేయకారులకు ఉన్నది సంగీతసాహిత్యాలు మాత్రమే కాదు. నేను పాట రాస్తాను, బాణీ కడతాను, అంటే ఎవడూ వాగ్గేయకారుడై పోడు. సంగీతసాహిత్యాల్లో అంతర్లీనంగా భక్తి ప్రవహించాలి. అది ఎటువంటి భక్తి ...అంటే నువ్వు ఏమయిపోతున్నా... నమ్ముకున్న వాడి చరణాలు వదలలేనిది అది.. అచంచలమైనది... అదే భర్తృహరి మాటల్లో చెప్పాలంటే... నిను సేవింపగ ఆపదల్ పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ,/జనమాత్రుండననీ, మహాత్ముడననీ, సంసార మోహంబు పై/కొననీ, జ్ఞానము గల్గనీ, గ్రహగతుల్ కుందింపనీ, మేలు వ/చ్చిన రానీ... అంటాడు. ఏది ఏమయిపోయినా ఆ భక్తిలో పరమానందాన్ని పొంది ఎప్పటికప్పుడు లోపల ఈశ్వర గుణానుభవాలు పెరిగి అవి కీర్తనలుగా వెలువడుతుంటే ఆయన వాగ్గేయకారుడు. అంటే భక్తి ప్రధానం. భక్తుడికి భక్తి అమ్మలాంటిది. పసిబిడ్డకు పాలు ఎలాగో, భక్తుడికి భక్తి అలా ఆహారం. భగవంతుడి పాటలు వింటూ, తాను పాడుకుంటూ, రచన చేస్తూ, స్వరపరుస్తూ, శిష్యులకు చెబుతూ, ఏదీ ఆశించకుండా, ఏది లభిస్తే అది తింటూ, పరమ పవిత్రమైన జీవనాన్ని గడుపుతూ ఆఖరికి తన అవసరం లేదనుకున్నప్పుడు గహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి సన్యాసాశ్రమాన్ని స్వీకారం చేసి... భగవంతుడిలో ఐక్యమవుతాడు. భక్తుడిని వేరొకరు రక్షింపనక్కర లేదు..‘‘వాడిని నా కొరకు రక్షింపవలయు..’’ అంటాడు శ్రీమన్నారాయణుడు భాగవతంలో. వాడిని నేను రక్షించేది వాడి కోసం కాదు, నా కోసం..అంటున్నాడు. నన్ను నమ్ముకున్న వాడినే రక్షించకపోతే ఇక నేను ఉన్నానని లోకం ఎందుకు నమ్ముతుంది? అందుకని నేనున్నానని జనులు నమ్మడం కోసం.. నాకోసం వాడిని రక్షిస్తున్నా... అంటున్నాడు. భక్తుని స్థితి అలా ఉంటుంది. వాగ్గేయకారుల అనుభవాలు కూడా ఇవే. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
భయం వద్దు... భక్తి కావాలి!
ఏమిట్రా అది... బొత్తిగా భయం భక్తీ లేకుండా అని అంటూ ఉంటారు పెద్దలు. భయభక్తులు మనిషికి చాలా అవసరం. ఈ రెండూ బాల్యం నుంచే ఉండాలి ఎవరికైనా. ఎందుకంటే చిన్నప్పుడు తలిదండ్రులు, గురువుల భయం లేకపోతే పిల్లలు తప్పు చేయడానికి సిద్ధపడతారు. తాము ఈ తప్పు చేస్తే తల్లిదండ్రులు ఏమైనా అంటారనే భయం ఉంటే తప్పు చేయరసలు. అయితే భయం కన్నా భక్తి ఇంకా ఎక్కువ అవసరం. ఎందుకంటే భయంతో నడవడిక మారడం తాత్కాలికమే. ఎప్పుడైతే భయం పోతుందో, మనిషి ఏ పని చేయడానికైనా వెనుకాడడు. భక్తి అలాకాదు. ఒకసారి పాదుకుంటే... కలకాలం ఉంటుంది. రామభక్తి వల్లే కదా, హనుమ అఖండ విజయాన్ని సాధించింది. భక్తరామదాసు, భక్త తుకారాం, భక్త జయదేవ, తులసీదాసు, అన్నమయ్య వంటివారు భక్తితోనే కదా అన్నేసి మంచి పనులు చేయగలిగింది, అంతటి అజ రామరమైన సంకీర్తనలను భావితరాలకు అందించగలిగిందీ. అందుకే భయభక్తులనేవి మనిషికి అత్యవసరమైనవి. ఒకవేళ లేకపోతే అవశ్యం అలవరచుకోవలసినవీనూ. -
సంగమేశ్వరం..భక్తి పారవశ్యం
– శాస్త్రోక్తంగా నదీమ తల్లికి హారతులు – తెల్లవారుజామున 5.45 నిమిషాలకు ప్రారంభమైన పుష్కరాలు – తరలివచ్చిన రెండు తెలుగు రాష్ట్రాల భక్తులు – తొలిరోజు పుష్కర స్నానమాచరించిన ప్రజాప్రతినిధులు – భక్తుల సేవలలో అధికార యంత్రాంగం సంగమేశ్వరం నుంచి సాక్షి ప్రతినిధి : సప్తనదుల కూడలి సంగమేశ్వర క్షేత్రం..భక్తిపారవశ్యంతో ఓలలాడింది. శుక్రవారం తెల్లవారుజామున 5.54 నిమిషాలకు వేదపండితులు నదీమ తల్లి కృష్ణమ్మకు పూజలు చేసి.. హారతులిచ్చి పుష్కరాలను ప్రారంభించారు. సంగమేశ్వర ఘాట్ వద్ద జెడ్పీ చైర్మన్ రాజశేఖర్, ఎస్పీ ఆకె రవికృష్ణ, జేసీ హరికిరణ్, టీడీపీ నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జ్ శివానందరెడ్డి తొలిసారిగా పుష్కర స్నానాలు ఆచరించారు. భక్తుల సంఖ్య ఉదయం చాలా మందకొడిగా ఉండటంతో ఘాట్లు వెలవెలబోయాయి. అయితే ఈ సంఖ్య 11 గంటల తరువాత రానురాను పుంజుకోవడంతో కోలాహలం కనిపించింది. తొలిరోజు సాయంత్రం 6.10 గంటలకు పుష్కర స్నానాలను ముగించారు. డిప్యూటీ సీఎం గైర్హాజరు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన కృష్ణా పుష్కర ప్రారంభోత్సవ వేడుకలు సాదాసీదాగా జరిగాయి. సంగమేశ్వర క్షేత్రం వద్ద డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేతుల మీదుగా పుష్కరాలు ప్రారంభమవుతాయని అధికారులు ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకపోవడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులే పుష్కరాలను ప్రారంభించారు. ప్రజాప్రతినిధుల పుణ్యస్నానాలు సప్తనదీ సంగమేశ్వర క్షేత్రం వద్ద పుష్కర స్నానం ఆచరించేందుకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కుటుంబసమేతంగా తరలివచ్చారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఐజయ్య క్షేత్రానికి చేరుకుని పుష్కర స్నానమాచరించారు. అనంతరం లలిత సంగమేశ్వరస్వామివార్లను దర్శించుకున్నారు. అక్కడ ఏర్పాట్లపై అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. వీఐపీ ఘాట్ ఇక్కడ లేదా అంటూ కొత్తపల్లి తహశీల్దార్ నరసింహులును నిలదీశారు. ప్రజాప్రతినిధులకు ఇచ్చే మర్యాద ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి సతీసమేతంగా పుష్కరస్నానాలు ఆచరించి లలిత సంగమేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో మాజీ ఎంపీ గంగుల ప్రతాప్రెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి పుష్కరిణిలో స్నానాలు చేశారు. సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టి.. రాయలసీమ ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా దీవించమని సంగమేశ్వరుడిని వేడుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన విలేకరులకు తెలిపారు. పరవశించిన భక్తులు.. సంగమేశ్వరంలో పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులు కష్ణానది పరవళ్ల సోయగాలను, సముద్రాన్ని తలపించేలా ఉన్న కృష్ణమ్మను చూస్తూ పరవశించిపోయారు. నిజంగానే నదీమ తల్లిలో స్నానం ఆచరించగానే తమ పాపాలు తొలగిపోయినట్లుగా భావన కలిగిందని మరికొందరు చెప్పుకోవడం జరిగింది. రాయలసీమ వాసులతోపాటు ప్రకాశం, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా నుంచి భక్తులు తరలివచ్చారు. జేసీ పర్యవేక్షణలో ఏర్పాట్లు.. సంగమేశ్వరం వద్ద భక్తుల కోసం చేపట్టిన పనులు ఇంకా అసంపూర్తిగా ఉండటంతో వాటిని పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ ఆదేశించారు. భక్తులెవరైనా తేలు, పాము కాటుకు గురైతే వారికి తక్షణమే ప్రథమ చికిత్స అందించి.. అవసరమైతే జిల్లా కేంద్రానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా సహాయ వైద్యాధికారి రాజా సుబ్బారావుకు సూచించారు. పుష్కరాలకు వచ్చే వికలాంగులను వలంటీర్లు జాగ్రత్తగా పుష్కర స్నానాలు చేయించి అదేక్రమంలో వారిని సురక్షితంగా వాహనాల్లో కూర్చోబెట్టాలన్నారు. అయితే అక్కడ పుష్కర విధులు నిర్వహించేందుకు వచ్చిన అధికారులు, సిబ్బంది అరకొర వసతులు కల్పించడం.. ఉదయం నుంచి సాయంత్రం వరకు విధుల్లో ఉన్న వారికి కనీసం మంచినీటిని అందించకపోవడంతో వారందరూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.