భయం వద్దు... భక్తి కావాలి!
ఏమిట్రా అది... బొత్తిగా భయం భక్తీ లేకుండా అని అంటూ ఉంటారు పెద్దలు. భయభక్తులు మనిషికి చాలా అవసరం. ఈ రెండూ బాల్యం నుంచే ఉండాలి ఎవరికైనా. ఎందుకంటే చిన్నప్పుడు తలిదండ్రులు, గురువుల భయం లేకపోతే పిల్లలు తప్పు చేయడానికి సిద్ధపడతారు. తాము ఈ తప్పు చేస్తే తల్లిదండ్రులు ఏమైనా అంటారనే భయం ఉంటే తప్పు చేయరసలు. అయితే భయం కన్నా భక్తి ఇంకా ఎక్కువ అవసరం. ఎందుకంటే భయంతో నడవడిక మారడం తాత్కాలికమే.
ఎప్పుడైతే భయం పోతుందో, మనిషి ఏ పని చేయడానికైనా వెనుకాడడు. భక్తి అలాకాదు. ఒకసారి పాదుకుంటే... కలకాలం ఉంటుంది. రామభక్తి వల్లే కదా, హనుమ అఖండ విజయాన్ని సాధించింది. భక్తరామదాసు, భక్త తుకారాం, భక్త జయదేవ, తులసీదాసు, అన్నమయ్య వంటివారు భక్తితోనే కదా అన్నేసి మంచి పనులు చేయగలిగింది, అంతటి అజ రామరమైన సంకీర్తనలను భావితరాలకు అందించగలిగిందీ. అందుకే భయభక్తులనేవి మనిషికి అత్యవసరమైనవి. ఒకవేళ లేకపోతే అవశ్యం అలవరచుకోవలసినవీనూ.