భక్తి అంటే..? | Bhakti is the only way to purify our material mind of endless lifetimes | Sakshi
Sakshi News home page

భక్తి అంటే..?

Published Mon, Mar 18 2024 6:07 AM | Last Updated on Mon, Mar 18 2024 6:09 AM

Bhakti is the only way to purify our material mind of endless lifetimes - Sakshi

మంచిమాట

భక్తి అంటే ఏమిటి? వేదాంత గ్రంథాలిచ్చే నిర్వచనాల జోలికి వెళ్లవద్దు మనం. మామూలు మాటల్లో అర్థం కావటానికి భక్తి అంటే ఏమిటి? చాలామంది అభిప్రాయంలో ఫోటో పెట్టి, దండలు వేసి, పూలు, అగరొత్తులు, దీపాలు పెట్టి నివేదన చెయ్యటం, దణ్ణం పెట్టటం అనుకుంటారు. అది భక్తా? ఒకరకంగా తను మారకుండా ఉండటాన్ని సమర్థించుకునే ప్రయత్నం. ‘‘ఆయన మహానుభావుడు కనుక అట్లా చేయగలిగాడు.

మనవంటి సామాన్యులకి సాధ్యమా?’’ అని తప్పించుకునే మార్గం. అట్లా పూజ చెయ్యటం తప్పు అని కాని, చెయ్య కూడదని కాని చెప్పటం లేదు. అది ఒకరకం. దానివల్ల ఒరిగేది ప్రత్యేకంగా ఏమీ లేదు. అది ఒక క్రమశిక్షణ. చిత్త శుద్ధిని కలిగిస్తుంది. ఇది మొదటిమెట్టు అని చెప్పవచ్చు. కానీ చాలా మంది ఇదే పరమార్థం అనుకుంటారు.

కొంతమంది అనుకరించటమే భక్తి అనే భ్రమలో ఉంటారు. అనుకరించటానికి, అనుసరించటానికి చాలా వ్యత్యాసం ఉంది. వారిలాగా ఉండే ప్రయత్నం అనుకరణ. ఇది భౌతికంగా తమ ఆదర్శమూర్తుల లాగా ఉండేట్టు చేస్తుంది. చూడగానే ఫలానా వారి అభిమానులని తెలియ చేస్తుంది. కాని వారిస్థాయికి చేర్చదు. అయితే అనుకరణ పనికి రానిదని చెప్పటానికి వీలు లేదు. అది రెండవ మెట్టు.

ఒకరిపట్ల భక్తి ఉన్నది అంటే వారు చెప్పిన దానిని చెప్పినట్టు అనుసరించటమే. భక్తిలో ప్రశ్నలకు, సందేహాలకు, వాదోపవాదాలకు తావుండదు. నోటితోనే చెప్పనక్కరలేదు. వారి ప్రవర్తనను చూసి అనుసరించవలసి ఉంటుంది. ‘‘మీ బొమ్మకి పూజ చేస్తాం, కాని, మీరు చెప్పినట్టు చెయ్యటం మావల్ల కాదు, మీరు ఉన్నట్టు ఉండటం అసాధ్యం’’ అంటే అది భక్తి అనిపించుకోదు. భగవంతుడివిషయంలోనైనా అంతే! దేవుణ్ణి గదికే పరిమితం చేసి, పూజచేసిన కొద్దిసేపు మాత్రం ఆయన్ని తలచుకొని, తరువాత దుర్మార్గంగా లోకకంటకంగా ప్రవర్తిస్తే అది భక్తి అనిపించుకోదు. పరమాత్మ నిర్దేశించిన విధంగా, ఆయన మెప్పు వడసే పద్ధతిలో ప్రవర్తిస్తే అది నిజమైన భక్తి.

సాటిమనిషి మీద సానుభూతి, జాలి చూపించలేని వాడు, ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమించ లేని వాడు, తనకి హాని చేసిన శత్రువుని కాక పోయినా కనీసం ఎదుటివాడిని క్షమించలేనివాడు విశ్వాసి ఎలా అవుతాడు? పొరుగువారిని తనవలే ప్రేమించమని చెప్పిన ఏసు క్రీస్తు అంటే భక్తి ఉంటే ఆయన చెప్పిన మాటలని పాటించాలి, ఆయనలాగా ప్రవర్తించాలి. ఆయన మార్గాన్ని అనుసరించాలి.

ఎక్కువసేపు వాళ్ళతో ఉండటం వల్లనో, పోలికలు రావటం వల్లనో మనవలు, మనవరాళ్ళు తరచుగా తాతానాయనమ్మల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. తాతలకి నాయనమ్మలకి, అమ్మమ్మలకి మనవలు, మనవరాళ్ళు అంటే ఇష్టం ఉండటానికి కూడా ఇదే కారణం.

మనుషుల విషయంలోనే ఇలా ఉంటే భగవంతుడి విషయంలో ఆయన చెప్పినట్టు ప్రవర్తిస్తే ఫలితం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భగవంతుడికి, భక్తుడికి ఉండే సంబంధాన్ని భ్రమరకీట న్యాయంగా చెప్పటం ఈ కాణంగానే.

తన చుట్టూ తిరుగుతున్న భ్రమరం చేసే ఝుమ్మనే నాదం విని గూటిలో సుప్తావస్థలో ఉన్న కీటకం దానిని అనుసరిస్తూ తాను కూడాఅటువంటి నాదం చేసే ప్రయత్నంలో భ్రమరం లాగా రూపాంతరం చెందుతుంది. ఈ అనుసరణ అన్నది తానే లక్ష్య వస్తువు అయ్యేట్టు చెయ్యగలదు. ఒక గురువునో, నాయకుణ్ణో అనుకరించేవారు వారి వలె తయారౌతారే కాని, వారుగా అయిపోరు. వారుగా, కనీసం వారంతటి వారుగా అయిపోవటానికి కావలసినది అనుసరణ మాత్రమే. భగవత్తత్త్వాన్ని అందుకోవాలంటే కూడా అంతే!

శ్రీరాముడు పితృభక్తి కలవాడు అని చెపుతాం. అంటే అర్థం తండ్రి చెప్పిన విధంగా జీవించాడు అని. ఆయన మాట జవదాట లేదు. ఆయన తనతోచెప్పిన మాటనే కాదు ఆయన ఎవరికిచ్చిన మాటనైనా పాటించాడు. రాముడిపితృభక్తి, గురుభక్తి విశ్వామిత్రుడు తాటకను సంహరించమన్నప్పుడు మారు మాటాడక సంహరించటంలో వ్యక్తమౌతాయి. తల్లితండ్రులని వృద్ధాశ్రమాలలో ఉంచి ‘‘మేము రామభక్తులం’’ అంటే రాముడిపట్ల అపచారం చేసినట్టే. ఆయనలో ఉన్న కొన్నిగుణాలనైనా అలవరచుకుంటే రామభక్తులు అనిపించుకోగలుగుతారు.

– డా. ఎన్‌. అనంత లక్ష్మి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement