Bhakta Ramadasu
-
రామదాసుకు అంతర్జాతీయస్థాయి కీర్తి కోసం కృషి
సాక్షి, నేలకొండపల్లి: రామయ్య పరమ భక్తాగ్రేసరుడు కంచర్ల గోపన్న(రామదాసు)కు అంతర్జాతీయస్థాయిలో కీర్తిని తెచ్చేందుకు కృషిచేస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక రామదాసు ధ్యాన మందిరంలో భక్త రామదాసు జయంత్యుత్సవాలను ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం రామదాసు ధ్యాన మందిరం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రసంగించారు. ఈ మందిరం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గత ఏడాది మాట ఇచ్చారని, దానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు. భక్త రామదాసు ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసినట్లే ఆయన స్మృతి భవనాన్ని కూడా త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రామదాసు వంటి మహనీయుడి చరిత్రను ప్రపంచమంతా తెలుసుకునేలా ప్రచారం చేయాలని తుమ్మల సూచించారు. ఇక్కడ బౌద్ధ క్షేత్రంతోపాటు బాలసముద్రం చెరువును కూడా పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. effort for International glory to Ramadas:Tummala -
రామదాసు కీర్తనలతో ఓలలాడిన భద్రాద్రి
సాక్షి, భద్రాచలం: భక్త రామదాసు 385వ జయంత్యుత్సవాలు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానం ఈవో ప్రభాకర శ్రీనివాస్, శ్రీచక్ర సిమెంట్ అధినేత నేండ్రగంటి కృష్ణమోహన్, ప్రముఖ సంగీత విద్వాంసుడు మల్లాది సూరిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. తొలుత భక్త రామదాసు చిత్రపటంతో భక్తుల కోలాటాల నడుమ నగర సంకీర్తనతో ఆలయం నుంచి గోదావరి నది వరకూ వెళ్లారు. అక్కడ గోదావరి మాతకు పూజలు నిర్వహించారు. ఆలయం తరపున గోదారమ్మకు పసుపు, కుంకుమ, వస్త్రాలను అందజేసి హారతి ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలోని భక్త రామదాసు విగ్రహానికి గోదావరి జలాలతో అభిషేకం చేసి గర్భగుడిలోని స్వామి వారి మూలమూర్తుల వద్ద ఉత్సవాలకు అనుజ్ఞ తీసుకున్నారు. చిత్రకూట మండపంలో సంగీత విద్వాంసులంతా ఒకేసారి రామదాసు నవరత్న కీర్తనల గోష్ఠి గానం చేశారు. ఒక్కో కీర్తన మధ్యలో శ్రీ సీతారామచంద్రస్వామి వారికి వివిధ ఫలాలు, పుష్పాలతో అర్చకులు పూజలు నిర్వహిస్తూ మంగళ హారుతులు ఇచ్చారు. కళాకారులను కృష్ణ మోహన్ ఘనంగా సత్కరించారు. కచేరీలు ఈ నెల 25 వరకూ కొనసాగుతాయి. కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
భయం వద్దు... భక్తి కావాలి!
ఏమిట్రా అది... బొత్తిగా భయం భక్తీ లేకుండా అని అంటూ ఉంటారు పెద్దలు. భయభక్తులు మనిషికి చాలా అవసరం. ఈ రెండూ బాల్యం నుంచే ఉండాలి ఎవరికైనా. ఎందుకంటే చిన్నప్పుడు తలిదండ్రులు, గురువుల భయం లేకపోతే పిల్లలు తప్పు చేయడానికి సిద్ధపడతారు. తాము ఈ తప్పు చేస్తే తల్లిదండ్రులు ఏమైనా అంటారనే భయం ఉంటే తప్పు చేయరసలు. అయితే భయం కన్నా భక్తి ఇంకా ఎక్కువ అవసరం. ఎందుకంటే భయంతో నడవడిక మారడం తాత్కాలికమే. ఎప్పుడైతే భయం పోతుందో, మనిషి ఏ పని చేయడానికైనా వెనుకాడడు. భక్తి అలాకాదు. ఒకసారి పాదుకుంటే... కలకాలం ఉంటుంది. రామభక్తి వల్లే కదా, హనుమ అఖండ విజయాన్ని సాధించింది. భక్తరామదాసు, భక్త తుకారాం, భక్త జయదేవ, తులసీదాసు, అన్నమయ్య వంటివారు భక్తితోనే కదా అన్నేసి మంచి పనులు చేయగలిగింది, అంతటి అజ రామరమైన సంకీర్తనలను భావితరాలకు అందించగలిగిందీ. అందుకే భయభక్తులనేవి మనిషికి అత్యవసరమైనవి. ఒకవేళ లేకపోతే అవశ్యం అలవరచుకోవలసినవీనూ.